మా ఊరు.. దోమలకు కేరాఫ్ అడ్రస్
వైఎస్సార్ జిల్లా లోని ప్రొద్దుటూరు పట్టణం దోమలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో భూగర్భడ్రైనేజీకి సంబంధించి ప్రశ్నపై ఆయన మాట్లాడారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. 37.5 కోట్లతో భూగర్భ డ్రైనేజి మంజూరు చేశారు. 5 కోట్లు వెచ్చించి కొన్ని పనులు చేశారు. తర్వాత భూగర్భ డ్రైనేజీ నిర్వహణ పని ఆగిపోయిందని తెలిపారు. ఇటీవల దోమ కాటు వల్ల 15 మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రొద్దుటూరులో 5 ప్రధాన కాలువలు ఉన్నాయని.. దశాబ్దాలుగా ఆధునీకరణకు నోచుకోలేదని తెలిపారు. ప్రొద్దుటూరు నగరాన్ని మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య పట్టి పీడిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం భూగర్భ డ్రైనేజీ అంచనా వ్యయం 70 కోట్లకు చేరిందని.. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి.. పనులు తిరిగి ప్రారంభం అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.