Rachabanda programmes
-
రచ్చ.. రచ్చ
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్: భీమవరంలో శనివారం నిర్వహించిన పట్టణ రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే, అధికారులను నిలదీసిన వైఎస్సార్ సీపీ, సీపీఎం నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని సభ నుంచి ఈడ్చి వేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజలు కూడా సమస్యలపై నిలదీయడంతో సభను నిమిషాల వ్యవధిలో ముగించారు. నిలదీసిన వైసీపీ స్థానిక లూథరన్ హైస్కూల్ క్రీడామైదానంలో నిర్వహించిన రచ్చబండ సభకు మునిసిపల్ కమిషనర్ జీవీవీ సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అతిథిగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని, గతంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేదంటూ వైసీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేగేశ్న రామకృష్ణంరాజు, రేవూరి గోగురాజు, దాట్ల జైపాల్‌రాజు, యింటి సత్యనారాయణ తదితరులు సభా వేదిక వద్ద ఆందోళన నిర్వహించారు. పట్టణంలో మూడేళ్ల క్రితం పేదలకు ఇచ్చిన 82 ఎకరాల ఇళ్ల స్థలాన్ని ఇప్పటికీ పూడ్చలేదని, బైపాస్‌రోడ్డు నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తిచేస్తారని, ట్రాఫిక్ సమస్య, కంపోస్టు యార్డు, డ్రెయిన్లలో సిల్టు తదితర సమస్యలను ప్రస్తావించి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణమూర్తి వారిని వారించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ 14 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందించారు. ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిందేనని వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేశారు. వారికి సీపీఎం నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. సీఐ మధుసూదనరావు ఆధ్వర్యంలో విజయకుమార్ తన సిబ్బందితో వారిని బయటకు ఈడ్చివేశారు. సమస్యలపై నిలదీస్తే గెంటేస్తారా అంటూ సీపీఎం డివిజన్ కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, పట్టణ కార్యదర్శి ఆంజనేయులు, కళ్యాణి తదితరులు ఎమ్మెల్యే తీరుని తప్పుబట్టారు. అనంతరం ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరిస్తానంటూ ముక్తసరిగా మాట్లాడి కొద్ది నిమిషాల్లోనే రచ్చబండ అయ్యిందనిపించి పోలీస్ బందోబస్తు మధ్య అక్కడి నుంచి నిష్ర్కమించారు. అరకొర ఏర్పాట్లతో ప్రజల అవస్థలు రచ్చబండకు అధికారులు అరకొర ఏర్పాట్లు చేయడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అంచనా వేసిన దానికన్నా ఎక్కువ మంది లబ్ధిదారులు రావడంతో ఎక్కువ మంది ఎండలోనే కూర్చోవలసి వచ్చింది. వివిధ పథకాల లబ్ధిదారుల కంటే ఎక్కువ మంది సమస్యలపై దరఖాస్తులు ఇచ్చేందుకు రావడం విశేషం. దీంతో కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. దరఖాస్తుదారులు లైన్లలో బారులుతీరారు. చాలా మంది దరఖాస్తులు ఇవ్వకుండానే వెనుదిరిగారు. -
సమైక్యంతోనే అభివృద్ధి
* విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో రచ్చబండలో పాల్గొన్న సీఎం * సమైక్యం కోసం ఆఖరి వరకు పోరాటం చేస్తానని వెల్లడి * ప్రభుత్వస్థాయిలో విభజనకు ఓకే అంటూనే.. మరోవైపు ‘సమైక్య’ వ్యాఖ్యలు సాక్షి, విశాఖపట్నం/ఏలూరు/హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రంలో వనరులన్నీ సమకూర్చుకుని అభివృద్ధి పథంలో పయనిస్తున్న సమయంలో ఆటంబాంబులా విభజన వార్తను పేల్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ఈనెల 18న మంత్రుల బృందం (జీవోఎం) ముందు ఇదే విషయాన్ని తెలియజేస్తానని, ముందోమాట వెనకోమాట చెప్పే వ్యక్తిని కాదని, పదవిని సైతం లెక్క చేయనని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వలన సీమాంధ్ర కన్నా తెలంగాణకే ఎక్కువ నష్టమని వివరించారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లా చోడవరం, పశ్చిమగోదావరి జిల్లా జగన్నాథపురంలో రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవైపు రాష్ట్ర విభజనకు కేంద్రానికి లోపాయికారీగా సహకారం అందిస్తూ.. మరోవైపు ప్రజల ముందు మరోసారి ఇలా సమైక్యవాదాన్ని వినిపించారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తన నిర్ణయం ప్రకటించిన 9 రోజుల తర్వాత తీరిగ్గా మీడియా ముందుకు వచ్చి.. విభజనతో సమస్యలేనంటూ కిరణ్ చెప్పారు. ఆ తర్వాత మరో 50 రోజుల అనంతరం మళ్లీ విలేకరుల సమావేశం నిర్వహించి విభజన సమస్యలను వల్లెవేశారు. ఇప్పుడు మరోసారి రచ్చబండ వేదికగా సమైక్య వాణిని వినిపించారు. విభజనకు సీఎం కిరణ్ ఓకే చెప్పారని ఢిల్లీ పెద్దలు బాహాటంగానే ప్రకటిస్తున్నా.. కిరణ్ మాత్రం ప్రజల ముందు తాను సమైక్యవాదినని చెప్పుకుంటుండడం గమనార్హం. రెండు రాష్ట్రాలపై భారం.. రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణకు మేలు, సీమాంధ్రకు నష్టం జరుగుతుందని అనుకుంటే పొరపాటేనని సీఎం అన్నారు. సీమాంధ్ర కన్నా తెలంగాణకే నష్టమెక్కువని తెలిపారు. ఇప్పటికే విశాఖ, ఖమ్మం జిల్లాల్లో నక్సల్ బెడద ఉందని విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్స్ ప్రాబల్యం పెరుగుతుందన్నారు. ‘‘సమైక్య రాష్ట్రంలో ప్రస్తుతం రూ.43 వేల కోట్లు జీతాలు, పింఛన్ల కింద ఖర్చు చేస్తున్నాం. విభజన జరిగితే ఇరు రాష్ట్రాలకు రూ.5 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం పోలీసులు సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి తిరుపతికి, ఇతర ప్రాంతాలకు విధి నిర్వహణకు వస్తున్నారు. రెండు రాష్ట్రాలైతే అలాంటి అవకాశం ఉండదు. పోలీసు సిబ్బందిని రెట్టింపు చేయాల్సి ఉంటుంది. జీతాల భారం ప్రభుత్వాలపై పడుతుంది’’ అని చెప్పారు. విడిపోతే తెలంగాణలో విద్యుచ్ఛక్తికి 50 శాతం ఎక్కువ అవసరం అవుతుందన్నారు. నాలుగేళ్లలో రూ. 60 నుంచి రూ.70 వేల కోట్లు ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 175 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, అందుకు మరో రూ.35 వేల కోట్ల వెచ్చించాల్సి ఉంటుందన్నారు. సాగునీటి విషయంలో ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇబ్బందులు పడుతున్నామన్నారు. విభజన జరిగితే కోర్టులకు పోవడంతోపాటు కొట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. సీమాంధ్ర ప్రయోజనాల కోసం పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, కేంద్రం పునఃపరిశీలన చేసేలా ఆఖరి వరకు పోరాటం చేస్తానని చెప్పారు. విభజిస్తే ఆ పాపం బాబుకే తగులుతుంది..: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. విభజనపై ఇంతవరకూ స్పష్టమైన వైఖరిని చెప్పలేకపోతున్నారని, సమన్యాయం అంటున్నారే తప్ప విభజించాలా, వద్దా అనే విషయాన్ని తేల్చడం లేదని సీఎం విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగితే ఆ పాపం మొదట చంద్రబాబుకే తగులుతుందన్నారు. చోడవరం రచ్చబండ సభలో ఆరు రకాల ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగన్నాథపురం రచ్చబండకు ముందు ఆచంట నియోజకవర్గంలో ఇందిరమ్మ కలలు పథకం కింద రూ.79 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, వట్టి వసంత్‌కుమార్, జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కన్నాను మరో సీఎం అన్న పితాని: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రచ్చబండలో మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. మంత్రి కన్నాను ‘మరో ముఖ్యమంత్రి’ అని సంబోధించడం చర్చనీయాంశమైంది. కన్నాను మాట్లాడేందుకు ఆహ్వానిస్తూ ఇప్పుడు మరో సీఎం కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడతారని పితాని నవ్వుతూ అన్నారు. ఈ సమయంలో కిరణ్ పైకి నవ్వినా ఇబ్బందిగానే కనిపించారు. ఆత్మాభిమానం కాపాడుకునేందుకు వెళ్లలేదు: మంత్రి బాలరాజు విశాఖలో సీఎం హాజరైన రచ్చబండకు జిల్లా సీనియర్ మంత్రి పసుపులేటి బాలరాజు గైర్హాజరయ్యారు. విశాఖ సిటీ ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్ కూడా హాజరు కాలేదు. సీఎం కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై బాలరాజును మీడియా ప్రశ్నించగా.. ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకే రచ్చబండలో పాల్గొనలేదని చెప్పారు. సీఎం ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా తనకు కావాల్సిన వారినే వెంటబెట్టుకుని వ్యక్తిగత కార్యక్రమాలుగా మార్చుతున్నారని మండిపడ్డారు. రచ్చబండలో తన శాఖకు చెందిన అంశాలున్నప్పటికీ సమాచారం ఇవ్వకుండా అవమానకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదొక్కటే కాదని, తన శాఖలో అనేక నిర్ణయాలు తన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయన్నారు. శాఖాపరమైన నిర్ణయాలు సీఎం, అధికారులే తీసుకుంటూ తనను అవమానిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట కోసం ఇంతకాలం ఓపిక పట్టానని, ఇక మౌనంగా ఉండలేనని మంత్రి పేర్కొంటున్నారు. కిరణ్ వ్యవహార శైలిపై ఒకట్రెండు రోజుల్లో బయటకు వచ్చి మాట్లాడతానని చెబుతున్నారు. -
‘సమైక్య రచ్చ’బండ
న్యూస్‌లైన్ నెట్వర్క్: రచ్చబండ కార్యక్రమాలు గురువారం సమైక్య నినాదాలతో రచ్చరచ్చగా మారాయి. విజయనగరం జిల్లా సతివాడలో జరిగే రచ్చబండలో పాల్గొనేందుకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కారు దిగగానే సమైక్యవాదులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం కొంత ఉద్రిక్తంగా మారింది. సమైక్యవాదమా... వేర్పాటువాదమా స్పష్టం చేసి తర్వాత ప్రసంగించాలంటూ సమైక్యవాదులు ప్రజాప్రతినిధులను నిలదీశారు. సత్యవేడు నియోజకవర్గం నారాయణవనంలో చింతామోహన్ ప్రసంగిస్తుండగా కార్మిక సంఘాలు, వైఎస్ఆర్సీపీ, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అదే సభలో టీడీపీ ఎమ్మెల్యే హేమలతను ‘ గత రచ్చబండలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు. కొత్త అర్జీలు ఎందుకు’ అని నిలదీశారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో కేంద్ర మంత్రి పళ్లంరాజుకు సమైక్యసెగ తగిలింది. నగర పంచాయతీ కార్యాలయ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మంత్రిని పాతబస్టాండ్ ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు, సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పళ్లంరాజు మాట్లాడుతూ తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని అందుకే రాజీనామా చేయలేదన్నారు. ఆరని విభజన సెగ: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం గురువారం 107వ రోజుకు చేరుకుంది. బాలల దినోత్సవం రోజున నెహ్రూవిగ్రహం సాక్షిగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర విభజన మానుకోవాలని.. జీవోఎం సభ్యులకు మంచి బుద్ధి ప్రసాదించాలని అనంతపురం జిల్లా హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చిన్నారులు జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పూలు సమర్పించి విన్నవించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘రాష్ట్ర విభజన-విద్యార్థుల భవిషత్తు’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వెలుగు సంస్థ చిన్నారులు భారీ ర్యాలీ తీయగా, పుంగనూరులో ఉద్యోగ జేఏసీ చైర్మన్ వరదారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కుప్పంలో ఐక్య జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ లో రైతులు దీక్షలో కూర్చున్నారు. కళాశాలలు విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ఆకివీడు పోలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు దీక్షలో కూర్చున్నారు. సమైక్యాంధ్రపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కొనసాగిన వైఎస్సార్సీపీ దీక్షలు చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్ఆర్ సీపీ రిలేదీక్షలు కొనసాగాయి. ైబెరైడ్డిపల్లెలో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి సమైక్య పర్యటనను కొనసాగించారు. శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు గౌతంరెడ్డి ముఖ్యఅతిథిగా పార్టీ కార్యకర్తలు భారీబైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా కైకలూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాల యం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలు గురువారానికి 100వ రోజుకు చేరాయి.