‘సమైక్య రచ్చ’బండ
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రచ్చబండ కార్యక్రమాలు గురువారం సమైక్య నినాదాలతో రచ్చరచ్చగా మారాయి. విజయనగరం జిల్లా సతివాడలో జరిగే రచ్చబండలో పాల్గొనేందుకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కారు దిగగానే సమైక్యవాదులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం కొంత ఉద్రిక్తంగా మారింది. సమైక్యవాదమా... వేర్పాటువాదమా స్పష్టం చేసి తర్వాత ప్రసంగించాలంటూ సమైక్యవాదులు ప్రజాప్రతినిధులను నిలదీశారు. సత్యవేడు నియోజకవర్గం నారాయణవనంలో చింతామోహన్ ప్రసంగిస్తుండగా కార్మిక సంఘాలు, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ నేతలు అడ్డుకున్నారు.
అదే సభలో టీడీపీ ఎమ్మెల్యే హేమలతను ‘ గత రచ్చబండలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు. కొత్త అర్జీలు ఎందుకు’ అని నిలదీశారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో కేంద్ర మంత్రి పళ్లంరాజుకు సమైక్యసెగ తగిలింది. నగర పంచాయతీ కార్యాలయ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మంత్రిని పాతబస్టాండ్ ఎదుట వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పళ్లంరాజు మాట్లాడుతూ తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని అందుకే రాజీనామా చేయలేదన్నారు.
ఆరని విభజన సెగ: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం గురువారం 107వ రోజుకు చేరుకుంది. బాలల దినోత్సవం రోజున నెహ్రూవిగ్రహం సాక్షిగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర విభజన మానుకోవాలని.. జీవోఎం సభ్యులకు మంచి బుద్ధి ప్రసాదించాలని అనంతపురం జిల్లా హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చిన్నారులు జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహానికి పూలు సమర్పించి విన్నవించారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘రాష్ట్ర విభజన-విద్యార్థుల భవిషత్తు’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వెలుగు సంస్థ చిన్నారులు భారీ ర్యాలీ తీయగా, పుంగనూరులో ఉద్యోగ జేఏసీ చైర్మన్ వరదారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కుప్పంలో ఐక్య జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ లో రైతులు దీక్షలో కూర్చున్నారు. కళాశాలలు విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ఆకివీడు పోలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు దీక్షలో కూర్చున్నారు. సమైక్యాంధ్రపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.
కొనసాగిన వైఎస్సార్‌సీపీ దీక్షలు
చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్‌ఆర్ సీపీ రిలేదీక్షలు కొనసాగాయి. ైబెరైడ్డిపల్లెలో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి సమైక్య పర్యటనను కొనసాగించారు. శ్రీకాళహస్తిలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకుడు గౌతంరెడ్డి ముఖ్యఅతిథిగా పార్టీ కార్యకర్తలు భారీబైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా కైకలూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాల యం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలు గురువారానికి 100వ రోజుకు చేరాయి.