రచ్చ.. రచ్చ
Published Sun, Nov 17 2013 2:44 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్: భీమవరంలో శనివారం నిర్వహించిన పట్టణ రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే, అధికారులను నిలదీసిన వైఎస్సార్ సీపీ, సీపీఎం నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని సభ నుంచి ఈడ్చి వేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజలు కూడా సమస్యలపై నిలదీయడంతో సభను నిమిషాల వ్యవధిలో ముగించారు.
నిలదీసిన వైసీపీ
స్థానిక లూథరన్ హైస్కూల్ క్రీడామైదానంలో నిర్వహించిన రచ్చబండ సభకు మునిసిపల్ కమిషనర్ జీవీవీ సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అతిథిగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని, గతంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేదంటూ వైసీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేగేశ్న రామకృష్ణంరాజు, రేవూరి గోగురాజు, దాట్ల జైపాల్‌రాజు, యింటి సత్యనారాయణ తదితరులు సభా వేదిక వద్ద ఆందోళన నిర్వహించారు.
పట్టణంలో మూడేళ్ల క్రితం పేదలకు ఇచ్చిన 82 ఎకరాల ఇళ్ల స్థలాన్ని ఇప్పటికీ పూడ్చలేదని, బైపాస్‌రోడ్డు నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తిచేస్తారని, ట్రాఫిక్ సమస్య, కంపోస్టు యార్డు, డ్రెయిన్లలో సిల్టు తదితర సమస్యలను ప్రస్తావించి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణమూర్తి వారిని వారించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ 14 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందించారు. ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిందేనని వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేశారు.
వారికి సీపీఎం నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. సీఐ మధుసూదనరావు ఆధ్వర్యంలో
విజయకుమార్ తన సిబ్బందితో వారిని బయటకు ఈడ్చివేశారు. సమస్యలపై నిలదీస్తే గెంటేస్తారా అంటూ సీపీఎం డివిజన్ కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్, పట్టణ కార్యదర్శి ఆంజనేయులు, కళ్యాణి తదితరులు ఎమ్మెల్యే తీరుని తప్పుబట్టారు. అనంతరం ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరిస్తానంటూ ముక్తసరిగా మాట్లాడి కొద్ది నిమిషాల్లోనే రచ్చబండ అయ్యిందనిపించి పోలీస్ బందోబస్తు మధ్య అక్కడి నుంచి నిష్ర్కమించారు.
అరకొర ఏర్పాట్లతో ప్రజల అవస్థలు
రచ్చబండకు అధికారులు అరకొర ఏర్పాట్లు చేయడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అంచనా వేసిన దానికన్నా ఎక్కువ మంది లబ్ధిదారులు రావడంతో ఎక్కువ మంది ఎండలోనే కూర్చోవలసి వచ్చింది. వివిధ పథకాల లబ్ధిదారుల కంటే ఎక్కువ మంది సమస్యలపై దరఖాస్తులు ఇచ్చేందుకు రావడం విశేషం. దీంతో కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. దరఖాస్తుదారులు లైన్లలో బారులుతీరారు. చాలా మంది దరఖాస్తులు ఇవ్వకుండానే వెనుదిరిగారు.
Advertisement