సమైక్యంతోనే అభివృద్ధి
* విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో రచ్చబండలో పాల్గొన్న సీఎం
* సమైక్యం కోసం ఆఖరి వరకు పోరాటం చేస్తానని వెల్లడి
* ప్రభుత్వస్థాయిలో విభజనకు ఓకే అంటూనే.. మరోవైపు ‘సమైక్య’ వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం/ఏలూరు/హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రంలో వనరులన్నీ సమకూర్చుకుని అభివృద్ధి పథంలో పయనిస్తున్న సమయంలో ఆటంబాంబులా విభజన వార్తను పేల్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ఈనెల 18న మంత్రుల బృందం (జీవోఎం) ముందు ఇదే విషయాన్ని తెలియజేస్తానని, ముందోమాట వెనకోమాట చెప్పే వ్యక్తిని కాదని, పదవిని సైతం లెక్క చేయనని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వలన సీమాంధ్ర కన్నా తెలంగాణకే ఎక్కువ నష్టమని వివరించారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లా చోడవరం, పశ్చిమగోదావరి జిల్లా జగన్నాథపురంలో రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓవైపు రాష్ట్ర విభజనకు కేంద్రానికి లోపాయికారీగా సహకారం అందిస్తూ.. మరోవైపు ప్రజల ముందు మరోసారి ఇలా సమైక్యవాదాన్ని వినిపించారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తన నిర్ణయం ప్రకటించిన 9 రోజుల తర్వాత తీరిగ్గా మీడియా ముందుకు వచ్చి.. విభజనతో సమస్యలేనంటూ కిరణ్ చెప్పారు. ఆ తర్వాత మరో 50 రోజుల అనంతరం మళ్లీ విలేకరుల సమావేశం నిర్వహించి విభజన సమస్యలను వల్లెవేశారు. ఇప్పుడు మరోసారి రచ్చబండ వేదికగా సమైక్య వాణిని వినిపించారు. విభజనకు సీఎం కిరణ్ ఓకే చెప్పారని ఢిల్లీ పెద్దలు బాహాటంగానే ప్రకటిస్తున్నా.. కిరణ్ మాత్రం ప్రజల ముందు తాను సమైక్యవాదినని చెప్పుకుంటుండడం గమనార్హం.
రెండు రాష్ట్రాలపై భారం..
రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణకు మేలు, సీమాంధ్రకు నష్టం జరుగుతుందని అనుకుంటే పొరపాటేనని సీఎం అన్నారు. సీమాంధ్ర కన్నా తెలంగాణకే నష్టమెక్కువని తెలిపారు. ఇప్పటికే విశాఖ, ఖమ్మం జిల్లాల్లో నక్సల్ బెడద ఉందని విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్స్ ప్రాబల్యం పెరుగుతుందన్నారు. ‘‘సమైక్య రాష్ట్రంలో ప్రస్తుతం రూ.43 వేల కోట్లు జీతాలు, పింఛన్ల కింద ఖర్చు చేస్తున్నాం. విభజన జరిగితే ఇరు రాష్ట్రాలకు రూ.5 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం పోలీసులు సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి తిరుపతికి, ఇతర ప్రాంతాలకు విధి నిర్వహణకు వస్తున్నారు. రెండు రాష్ట్రాలైతే అలాంటి అవకాశం ఉండదు. పోలీసు సిబ్బందిని రెట్టింపు చేయాల్సి ఉంటుంది.
జీతాల భారం ప్రభుత్వాలపై పడుతుంది’’ అని చెప్పారు. విడిపోతే తెలంగాణలో విద్యుచ్ఛక్తికి 50 శాతం ఎక్కువ అవసరం అవుతుందన్నారు. నాలుగేళ్లలో రూ. 60 నుంచి రూ.70 వేల కోట్లు ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 175 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, అందుకు మరో రూ.35 వేల కోట్ల వెచ్చించాల్సి ఉంటుందన్నారు. సాగునీటి విషయంలో ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇబ్బందులు పడుతున్నామన్నారు. విభజన జరిగితే కోర్టులకు పోవడంతోపాటు కొట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. సీమాంధ్ర ప్రయోజనాల కోసం పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, కేంద్రం పునఃపరిశీలన చేసేలా ఆఖరి వరకు పోరాటం చేస్తానని చెప్పారు.
విభజిస్తే ఆ పాపం బాబుకే తగులుతుంది..: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. విభజనపై ఇంతవరకూ స్పష్టమైన వైఖరిని చెప్పలేకపోతున్నారని, సమన్యాయం అంటున్నారే తప్ప విభజించాలా, వద్దా అనే విషయాన్ని తేల్చడం లేదని సీఎం విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగితే ఆ పాపం మొదట చంద్రబాబుకే తగులుతుందన్నారు. చోడవరం రచ్చబండ సభలో ఆరు రకాల ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగన్నాథపురం రచ్చబండకు ముందు ఆచంట నియోజకవర్గంలో ఇందిరమ్మ కలలు పథకం కింద రూ.79 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, వట్టి వసంత్‌కుమార్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కన్నాను మరో సీఎం అన్న పితాని: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రచ్చబండలో మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. మంత్రి కన్నాను ‘మరో ముఖ్యమంత్రి’ అని సంబోధించడం చర్చనీయాంశమైంది. కన్నాను మాట్లాడేందుకు ఆహ్వానిస్తూ ఇప్పుడు మరో సీఎం కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడతారని పితాని నవ్వుతూ అన్నారు. ఈ సమయంలో కిరణ్ పైకి నవ్వినా ఇబ్బందిగానే కనిపించారు.
ఆత్మాభిమానం కాపాడుకునేందుకు వెళ్లలేదు: మంత్రి బాలరాజు
విశాఖలో సీఎం హాజరైన రచ్చబండకు జిల్లా సీనియర్ మంత్రి పసుపులేటి బాలరాజు గైర్హాజరయ్యారు. విశాఖ సిటీ ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్ కూడా హాజరు కాలేదు. సీఎం కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై బాలరాజును మీడియా ప్రశ్నించగా.. ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకే రచ్చబండలో పాల్గొనలేదని చెప్పారు. సీఎం ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా తనకు కావాల్సిన వారినే వెంటబెట్టుకుని వ్యక్తిగత కార్యక్రమాలుగా మార్చుతున్నారని మండిపడ్డారు. రచ్చబండలో తన శాఖకు చెందిన అంశాలున్నప్పటికీ సమాచారం ఇవ్వకుండా అవమానకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదొక్కటే కాదని, తన శాఖలో అనేక నిర్ణయాలు తన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయన్నారు. శాఖాపరమైన నిర్ణయాలు సీఎం, అధికారులే తీసుకుంటూ తనను అవమానిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట కోసం ఇంతకాలం ఓపిక పట్టానని, ఇక మౌనంగా ఉండలేనని మంత్రి పేర్కొంటున్నారు. కిరణ్ వ్యవహార శైలిపై ఒకట్రెండు రోజుల్లో బయటకు వచ్చి మాట్లాడతానని చెబుతున్నారు.