Rachamallu Ramachandra Reddy
-
Rachamallu Ramachandra Reddy: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!
విమర్శకుడిగా, కథకుడిగా, సమీక్షకుడిగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా.) తెలుగు మేధావుల ప్రశంసలకు పాత్రమ య్యారు. తాను స్వయంగా చక్కని కథానికలు రాయడమే కాదు ఒక తరం కథకులను తర్ఫీదు చేశారు. మంచి విమర్శకుడిగా తాను రాణించడమే కాదు ఎందరో విమర్శకులకు పదును పెట్టారాయన. ప్రత్యేకించి విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండ గలదో చేసి, చూపించారు. ప్రాక్పశ్చిమ దేశాల సాహి త్యాన్ని క్షుణ్ణంగా చదివిన కొద్దిమంది విమర్శకుల్లో రా.రా. ఒకరు. మార్క్స్, ఎంగెల్స్, గ్రామ్సీ, గియోర్గీ లూకాస్ లాంటి సిద్ధాంతవేత్తల రచనలు చదివిన రచయితలు చాలా తక్కువ. రా.రా. వారిలో ఒకరు! తెలుగు సాహితి నిస్తబ్ధంగా పడివుండిన దశలో 1968లో ‘సంవేదన’ పత్రిక మొదలుపెట్టి చైతన్యం తీసుకొచ్చిన వాడు రా.రా. ఆయన కథా సంపుటి ‘అలసిన గుండెలు’ కొడవటిగంటి కుటుంబరావుకు బాగా నచ్చింది. రా.రా.ను విమర్శకుడిగానే కాక, కథక శిల్పిగా కూడా... కథాశిల్పం గురించి లోతుగా అధ్యయనం చేసి, పుస్తకం రాసిన వల్లంపాటి గౌరవించేవారు. ఇక, సొదుం జయరాం, కేతు విశ్వనాథరెడ్డి తదితరుల మాట చెప్పనక్కర్లేదు. వాళ్లను రా.రా. అంతేవాసులనవచ్చు. ‘అనువాదకుడిగానూ, అను వాద ప్రక్రియ అధ్యయనశీలిగానూ’ ఒక్కమాటలో చెప్తే రా.రా. కృషి అనన్యసాధ్యం! విమర్శకుల్లో రా.రా. మెథడాలజీని, మెథడ్ను రెండింటినీ ఒకమేరకు ఒంటపట్టించుకున్నవారు ఆర్వీయార్ . ‘సంవేదన’ సంపాదకుడిగా రా.రా. ఆ పత్రికలో సుదీర్ఘ సమీక్షలు చేసేవారు; చేయించేవారు కూడా! అయితే, రా.రా. విమర్శచేసే తీరుతెన్నులపై పూలే కాదు రాళ్లు కురిపించినవాళ్ళూ కొంద రున్నారు! ఆయన విమర్శను కొందరు ‘వ్యక్తిగత’ విమర్శగా పరిగణించారు! అందులో వ్యక్తమయ్యే ధర్మాగ్రహమే అందుకు కారణం. రా.రా. అభిమాన కవి శ్రీశ్రీయే ఆయన్ను ‘క్రూరమయిన విమర్శకుడ’ని అన్న సంగతి మన కందరికీ తెలుసు. ఇలాంటిది ప్రతి రచయిత విషయంలోనూ జరగదు. కాన్సిక్వెన్సియల్ రచయితల విషయంలోనే అలా జరుగుతుంది! ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పవలసివుంది. రా.రా. ఏ రంగంలో కృషి చేసినా దానిపై తన ముద్ర బలంగా వేసిన వారు. వాటిల్లో అనువాదం కూడా ఒకటి! ‘అనువాదం అంటే ఏమిటి?’ అనే ప్రశ్న ఎంత సరళమైందో దానికి వచ్చిన సమాధానాలు అంతే జటిలంగా ఉన్నాయి! ‘మూలభాషలోని పాఠాన్ని, లక్ష్యభాషలోకి మార్చడమే అనువాదం’ అనేది అతి సరళమైన నిర్వచనం అనిపించు కుంటుందేమో! అయితే, రాబర్ట్ ఫ్రాస్ట్ అనే ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ కవి అనువాదం విషయంలో అంత ‘సరళంగా’ ఆలోచిం చినట్లు కనబడదు. కవిత్వానికి ఓ నిర్వచనం చెప్పవయ్యా మహానుభావా అంటే ‘అనువాదంలో లుప్తమైపోయేదే కవిత్వం’ అన్నాడు ఫ్రాస్ట్! ఈ విష యంలో ఫ్రాస్ట్కు మరెందరో మద్దతుదారులు కూడా వున్నారు; అసలు అనువాదాల ‘శీలాన్నే’ శంకించారు కొందరు. అలాంటి ఫ్రెంచ్ సామెత ఒకదాన్ని రా.రా. తన పుస్తకం ‘అనువాద సమస్యలు’ మొదట్లోనే పేర్కొ న్నారు. ఆ పాటి హాస్య ప్రియత్వం లేకుండానే ఆయన అన్నేళ్ళు అనువాద రంగంలో గడపగలిగారంటారా? రా.రా. పెద్దగా మెచ్చని ఓ మాటతోనే ఆయన్ని అభివర్ణించగలం. అది (బాగా అరిగిపోయిన మాటే అనుకోండి) బహుముఖ ప్రజ్ఞావంతుడు! ‘సారస్వత వివేచన’ అనే విమర్శ వ్యాసాల సంకలనం వెలువరించిన గొప్ప విమర్శకుడు రా.రా. నన్నయ, తిక్కన, పోతన, పెద్దన, ఏనుగు లక్ష్మణకవి, గురజాడ, దువ్వూరి రామిరెడ్డి, చలం, విశ్వనాథ, శ్రీశ్రీ, మహీధర, కాళోజీ, ఆర్.ఎస్. సుదర్శనం, బంగోరె, కేవీఆర్, అద్దేపల్లి రామమోహనరావు లాంటి తెలుగు వాళ్ళ కృషితో పాటు ఉమర్ ఖయావ్ు, రబీంద్రనాథ్ టాగోర్ తదితరుల రచనలను కూడా విమర్శనాత్మకంగా విశ్లేషించి నిష్కర్ష చేసిన వాడు రా.రా. ఆయన వ్యాసాలన్నింట్లో ముఖ్యంగా ‘అనువాద సమ స్యలు’లో మెటా ఫర్ను (ఆలంకారిక అభి వ్యక్తిని) విస్తృతంగా వాడడం కనిపిస్తుంది. ఇది, మనకో మాట చెప్తుంది. ‘హృదయ వాది’ రా.రా. ‘మనసులో కవి’ (ఎ పొయెట్ ఎట్ హార్ట్) అయివుండాలి!! దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి చెప్తూ ‘‘తిలక్లోని ప్రముఖమైన గుణం భావు కత్వం. కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి మనకు లేడేమో!’ అన్నారు రా.రా. ‘అలౌకిక సౌందర్య శోభితమయిన ఐంద్రజాలికుని అంతఃపురం లాగుంది అతని కవితా చందన శాల’ అని కూడా అన్నారాయన. ఆ వ్యాసం తిలక్ ‘వస్తుతః భావకవి’ అని సాదరంగా స్థాపించిందని గుర్తుంచుకోవాలి! అలాంటి వ్యాసానికి అలాంటి భాష ఉపయోగించడానికి అంతో ఇంతో కవి అయివుండాలి! ‘మల్లారెడ్డి గేయాలు’ పరిచయ వాక్యాల్లో వ్యక్తమయిన ‘అనన్యత లాంటి అన్యోన్యత’ లాంటి అలంకారాలూ ఆ విషయాన్నే పట్టిస్తాయి. ‘రేపటికోసం’ సంకలనంలో, బెర్టోల్ట్ బ్రెష్ట్ రాసిన ‘మృత సైనికోపాఖ్యానం’ అనే పాటకి రా.రా. చేసిన అనువాదం చూస్తే, గేయ రచనలోనూ ఆయన సిద్ధహస్తుడని రుజువ వుతుంది. అదృష్టదీపక్ కవితా సంపుటి ‘ప్రాణం’ పుస్తకానికి రా.రా. ముందు మాట కూడా కవిత్వం పట్ల ఆయన అభిమానానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్తే, విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండగలదో చూపించా డాయన. మరీ ముఖ్యంగా ఆయన రాసిన సమీక్ష వ్యాసాలు విమర్శ రంగాన్ని కొత్త మలుపు తిప్పాయి. ‘చుక్కలు చీకటి’, ‘నీతి గానుగ’ లాంటి గొప్ప కథలు రాసిన రా.రా., సొదుం జయరాం (వాడిన మల్లెలు), కేతు విశ్వనాథరెడ్డి (జప్తు), కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి (కుట్ర) లాంటి కథకులనూ పదునుపెట్టి, తెలుగు సాహితికి పరిచయం చేశారు. ‘సంవేదన’ పత్రికలో జయరాం కథానిక ‘వాడిన మల్లెలు’ పై చేసిన ప్రయోగం, దాన్ని సవిమర్శకంగా విశ్లేషిస్తూ కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసమూ కథానిక రచయితల పాలిట పెద్దబాలశిక్ష లాంటివి! పిల్లల కోసం ‘చంద్ర మండలం శశిరేఖ’, ‘విక్రమార్కుని విడ్డూరం’, ‘అన్నంపెట్టని చదువు’ లాంటి విలువైన ఆసక్తికరమైన రచనలు చేసినవారు రా.రా. రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య జీవితంలో పత్రికలదీ పెద్దపాత్రే! ‘సవ్యసాచి’, ‘సంవేదన’ లాంటి పత్రికలకు ‘సంపాదకుడిగా’ ఉండిన ప్రతిభా వంతుడాయన. ‘వ్యక్తి స్వాతంత్య్రం సమాజ శ్రేయస్సు’ లాంటి సైద్ధాంతిక విషయాలను ఏనాడో చర్చించిన మేధావి రా.రా. తర్వాతి రోజుల్లో పుస్తక రూపంలో వచ్చిన ఈ దీర్ఘ వ్యాసం ‘సందేశం’ పత్రికలో మొదటిసారి అచ్చయినట్టుంది. దినపత్రి కల్లో స్పష్టంగానూ, స్ఫుటంగానూ, నిర్దుష్టంగానూ ఉండే అనువాదాలు చేసేలా విద్యార్థులకు ఒరవడి నిచ్చిన శిక్షకులు రా.రా. ఇక, రాచమల్లు రామచంద్రారెడ్డి రెండున్నర దశాబ్దాల కాలం కేంద్రీకరించి పనిచేసిన రంగం అనువాదం! అంతేకాదు రచనా ప్రక్రియ గానూ, శాస్త్రం గానూ అనువాదాన్ని సాధన చేశారాయన. పరిశోధకుల పరిభాషలో వాటిని మెథడ్గానూ, మెథడాలజీగానూ ఆయన సాధన చేశారని చెప్పొచ్చు! రా.రా. ‘అనువాద సమస్యలు’ పుస్తకానికి 1988లో కేంద్ర సాహిత్య ఎకాడెమీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే! భారతీయ భాషల్లో అలాంటి పుస్తకం అంతవరకూ రాలేదని అప్పట్లో ఓ సమీక్షకుడు పేర్కొన్నారు! - మందలపర్తి కిశోర్ సీనియర్ పాత్రికేయుడు (నేడు కేంద్ర సాహిత్య అకాడమీ, యోగి వేమన విశ్వవిద్యాలయం, బ్రౌన్ గ్రంథాలయం రా.రా. శతజయంతి సదస్సు నిర్వహిస్తున్నాయి) -
ప్రాణం ఖరీదు
కథాసారం కాన్స్టంట్నోపుల్లో లంగరు వేసింది ఓడ. పేరు మెజి డాల్టన్. దాని కాప్టెన్, జిబ్బిన్స్. పైపు పీలుస్తూ డెక్కు మీదకు దిగుతూనే ఆయనకు టర్కిష్ పోస్ట్మాన్ టెలిగ్రామ్ అందించాడు. న్యూఆర్లియన్స్లోని కంపెనీ అధిపతి నుండి వచ్చింది. మెజి డాల్టన్ను న్యూఆర్లియన్స్ నుండి ఒదేస్సకూ, తిరిగి న్యూఆర్లియన్స్కూ ప్రయాణం మీద పంపిన లెన్స్పి అండ్ సన్ కంపెనీ త్వరగా సరుకు నింపుకొని రావాలని పట్టుబడుతున్నదని దాని సారాంశం. ఓడలో నింపబోయే పొద్దుతిరుగుడు పూలచెక్కకు మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చేట్టుందట. పిసినారి అధిపతి టన్నుకు రెండు సెంట్లకు కక్కుర్తి పడి నాసిరకం బొగ్గు నింపించాడు. దానివల్ల ఎదురు గాలికి అట్లాంటిక్ మహాసముద్రం దాటేప్పటికే అవసరమైనంత ఆవిరి పీడనం నిలవడం కష్టంగా ఉంది. కానీ త్వరగా రమ్మని ఉత్తరువు! దాన్ని నిర్వర్తించడం కాప్టెన్ బాధ్యత. పైగా త్వరగా వెళ్తే బోనస్ కూడా ఇస్తారు. వెంటనే ఓడ మెకానిక్ ఓహిడ్డీని పిలిపించాడు. కానీ బాయిలర్లు శుభ్రం చేసుకోవడానికి ఒదేస్సలో మనం ఆగాలి, అన్నాడు ఓహిడ్డీ. గత ప్రయాణంలో చేశాం కదా; యీ గలీజు పని మళ్లీ చేయకపోతేనేమని ప్రశ్నించాడు జిబ్బిన్స్. మసి పేరుకొని సగం గొట్టాలు పనిచేయడం లేదు; శుభ్రం చేయకపోతే మనం తిరిగిపోలేం; సరుకు వేసుకొని అసలు పోలేమని తేల్చాడు ఓహిడ్డీ. అయితే మన బోనస్ పోతుందన్నమాట! నిట్టూర్చాడు కాప్టెన్. ఒక్క నిమిషం వృథా చేయకుండా పని ముగించమన్నాడు. రైలు కమ్మీల ఆవల ఉన్నది ‘ఓడల బాయిలర్లను శుభ్రపరిచే ఆఫీసు’. యజమాని పి.కె.బీకొవ్. అనువాదకుడు లైజర్ను వెంటబెట్టుకుని బీకొవ్ ఆఫీసుకెళ్లాడు ఓహిడ్డీ. ఈయనకు రెండు రోజుల్లో బాయిలర్ శుభ్రం చేయాలి; అర్జెంటు రవాణా ఉంది; అమెరికాకు త్వరగా తిరిగి వెళ్లాలి, అని చెప్పాడు లైజర్. బదులుగా చాలా పెద్ద మొత్తం చెప్పాడు బీకొవ్. రెండు రోజులకు రెండు రోజుల్లాగే చెల్లించాలనీ అన్నాడు. చేసేదిలేక ఓహిడ్డీ అంగీకరించాడు. రెండ్రోజుల్లో పూర్తి కాకపోతే మాత్రం ప్రతిరోజుకూ మొత్తంలో ఇరవై ఐదు శాతం పట్టుకుంటామని మాత్రం ఖండితంగా చెప్పాడు. చెప్పిన సమయానికి పని పూర్తవుతుందని ధీమాగా ఉన్నాడు బీకొవ్. ఈ ఒప్పందం చేసుకుంటున్నప్పుడే ఆఫీసు ముందర కుర్రాళ్ల గుంపొకటి కనబడింది ఓహిడ్డీకి. అందులోంచి ఓ చింపిరి బట్టల కుర్రాడొచ్చి, గివ్ మి షిలింగ్ ఇఫ్ యూ ప్లీజ్ అన్నాడు. వాణ్ని చూడగానే ఓహిడ్డీకి తన స్వదేశం కెనడా గొర్తొచ్చింది. ముచ్చటపడి డాలర్ నాణెం చేతిలో పెట్టాడు. హిప్ హిప్ హుర్రా అని అరిచాడు పిల్లాడు. ఎలకా, సేన్కా, మీష్కా, పాష్కా, పేత్కా, అలోష్కా అని కేకేశాడు బీకొవ్. బాయిలర్ గొట్టాలకు మురికి పట్టినప్పుడు పెద్దవాళ్లు వాటి లోపలికి దూరలేరు. పదేళ్ల పిల్లాడైతే సరిగ్గా సరిపోతాడు. దానికోసం బీకొవ్ దగ్గర ఈ కుర్రాళ్ల గుంపు ఉంది. రేవులోని దారిద్య్ర దేవతల బిడ్డలు వాళ్లు. రోజుకు పదిహేను కోపెక్కుల చొప్పున వారికి చెల్లిస్తాడు. భోజనం వాళ్లదే. కుర్రాళ్లందరిలోకీ మీత్క ప్రత్యేకమైనవాడు. వాడికి యెముకలే లేవు. యిరుకైన గొట్టాల్లో కూడా ఈల్ చేపలా ఈదుతాడు. మూలల్లోకీ వంపుల్లోకీ కూడా పాకుతాడు. అందుకే వాణ్ని ఎలక అంటారు. ఎలకొక్కడే పదిమంది పని చేస్తాడని బీకొవ్కు తెలుసు. ఒళ్లు గీచుకపోకుండా తార్పాలిన్ సంచులు తొడుక్కుని గొట్టాల్లో మాయమయ్యారు కుర్రాళ్లు. ఈలోపులో జిబ్బిన్స్కు ఓడ అధిపతి నుంచి మరో టెలిగ్రామ్ వచ్చింది. ప్రయాణకాలంలో మరి రెండు రోజులు తగ్గించగలిగితే బోనస్ రెట్టింపు చేస్తానని ఉంది. తన పిల్లల భవిష్యత్ కోసం బేంకులో డబ్బు వేయొచ్చనిపించింది. లైజర్, ఓహిడ్డీ, జిబ్బిన్స్ కూర్చుని టీ తాగుతుండగా కాబిన్ తలుపు భళ్లున తెరుచుకుంది. ఫోర్మన్ విషయం చెప్పాడు. డామిట్ అనుకుంటూ ఓహిడ్డీ, లైజర్ ఉరికినారు. అబ్బాయిలూ ఏమైంది? మీత్క లోపలికి పాకినాడు, బయటికి రాలేకున్నాడు. యెలక ఇరుక్కుపోవడమా? లైజర్ నమ్మలేదు. నీ కాళ్లు విరగ, ఎంత పనిచేశావురా? దేవుడి తోడు నా తప్పేమీ లేదు; గొట్టం వెంబడి పాకినాను; నా చెయ్యి ఎలాగో వడిదిరిగి శరీరం కింద ఇరుక్కుంది; వూడదీసుకోలేకున్నానని ఏడ్వసాగాడు మీత్క. తనకు స్వదేశాన్ని గుర్తుతెచ్చిన కుర్రాడికే ఇలా జరగడంతో ఓహిడ్డీ ప్రాణం మూలిగింది. కాళ్లు పట్టుకుని లాగడానికి ప్రయత్నించారు. హృదయవిదారకమైన చావుకేక. ఓ వదలండి... నొప్పి... నా చేయి విరిగిపోతుంది. విషయం తెలిసి బీకొవ్ దడదడలాడుతూ వచ్చాడు. సకాలంలో పని జరక్కపోతే మీరు డబ్బిస్తారా గాడద కొడుకుల్లారా అంటూ తిట్టిపోశాడు. మీత్కా, దొంగవేషాలు వేస్తున్నావా బద్మాష్ అని అరిచాడు. నా చేయి పూర్తిగా వడదిరిగింది అని మొత్తుకున్నాడు మీత్కా. మూతి పగలగొడతాను బయటికి రా! నన్ను చంపడం నయం, ఈ బాధ భరించలేను... గొట్టంలో బకెట్ నూనె పోశారు జిడ్డుగా ఉంటే సులభంగా తీయొచ్చని. రెండో బకెట్ కూడా పోశారు. ఎలక కాలికి తాడు కట్టి లాగారు. ఓ దేవుడా నొప్పి నొప్పి అయ్యో అయ్యో చచ్చేంత నొప్పి... పిల్లాడిని హింసించడానికి ఓహిడ్డీ ఒప్పుకోలేదు. వాడు బయటికి రావాలంటే గొట్టం పగలగొట్టడం మినహా మార్గం లేదన్నాడు బీకొవ్. కంపెనీ యజమానుల అనుమతీ, సరుకు యజమానుల అనుమతీ లేకుండా పగలగొట్టడానికి ఒప్పుకోనన్నాడు కాప్టెన్. పిల్లవాడి సంగతి చెబుతూ యజమానికి టెలిగ్రామ్ పంపాడు. ఎలాంటి ఆలస్యమూ అనుమతించబడదనీ, దానికి యావత్తూ జిబ్బిన్స్ బాధ్యత వహించాలనీ జవాబు వచ్చింది. అతడి ముఖం కొయ్యబారి పోయింది. ఒక్క గంట ఆలస్యం కూడా ఒప్పుకోనని బీకొవ్కు తేల్చి చెప్పాడు. సాయంత్రం పొయ్యి అంటించి తీరాలి! ఆలస్యానికి నేను డబ్బులు చెల్లించి బికారి కాదల్చుకోలేదన్నాడు బీకొవ్. గొట్టంలోనే చావదల్చుకున్నావటరా... అతని కుర్రవాడు అతని వ్యవహారం, సాయంత్రం మాత్రం పొయ్యి అంటించాలి అన్నాడు కాప్టెన్. అందరూ భోజనానికి వెళ్లిపోయినారు. సందడి లేదు. ఆ నిశ్శబ్దంలో బీకొవ్ పథకం ఆలోచించాడు. గొట్టంలోకి పేత్కను పంపించాడు. అందరూ తిరిగి వచ్చేప్పటికి ఎలకను లాగినట్టుగా తాడుతో పేత్కను లాగాడు. ఎటూ ఊపిరాడక చచ్చిపోయే కుర్రాడి కోసం కాప్టెన్ తన బోనస్ వదులుకోవడానికి సిద్ధంగా లేడు. సాయంత్రం పూర్తి సరుకుతో ఓడ బయల్దేరింది. నిజం తెలిసిపోయి, ఈ అర్జెంటు రవాణాలో ఓడ మీద తిరుగుబాటు చేయలేక అశక్తుడైన ఓహిడ్డీ సముద్రంలో దూకినాడు. మెకానిక్ మరణించినట్లు కాప్టెన్ తన దినచర్య పుస్తకంలో రాసుకున్నాడు. న్యూఆర్లియన్స్ రేవులో ఓడ ఆగింది. ఆ కుర్రాడి సమస్యను ఎలా పరిష్కరించారని కాప్టెన్ను అడిగాడు యజమాని. అందులో చెప్పవలిసిందేమీ లేదన్నాడు కాప్టెన్. రాత్రి సిబ్బంది నగరంలోకి పోయినప్పుడు కాప్టెన్ యింజిన్ గదిలోకి పోయినాడు. పెద్ద కొక్కెం తీసుకుని గొట్టం లోపలికి దూర్చి చాలాసేపు కలబెట్టినాడు. కొక్కాన్ని వెనక్కి లాగినప్పుడు ఆయన కాళ్ల వద్ద చిన్న పుర్రె, యెముకలు కింద పడ్డాయి. తర్వాత నల్లగా కమిలిన డాలర్! తెల్లారి కంసాలి దగ్గరకు వెళ్లి, దాన్ని తన వెండి పొగాకు పెట్టెకు అతికించమన్నాడు. యెక్కడిదీ డాలరు? కంసాలికి ఇలా జవాబిచ్చాడు కాప్టెన్: నాకు చెప్పడం ఇష్టం లేదు. అదొక విషాద కథ. కానీ యీ నాణాన్ని జ్ఞాపకార్థంగా వుంచుకోవాలనుకున్నాను. - బోరిస్ లవ్రెన్యోవ్