కథాసారం
కాన్‌స్టంట్‌నోపుల్‌లో లంగరు వేసింది ఓడ. పేరు మెజి డాల్టన్. దాని కాప్టెన్, జిబ్బిన్స్. పైపు పీలుస్తూ డెక్కు మీదకు దిగుతూనే ఆయనకు టర్కిష్ పోస్ట్‌మాన్ టెలిగ్రామ్ అందించాడు. న్యూఆర్లియన్స్‌లోని కంపెనీ అధిపతి నుండి వచ్చింది. మెజి డాల్టన్‌ను న్యూఆర్లియన్స్ నుండి ఒదేస్సకూ, తిరిగి న్యూఆర్లియన్స్‌కూ ప్రయాణం మీద పంపిన లెన్‌స్పి అండ్ సన్ కంపెనీ త్వరగా సరుకు నింపుకొని రావాలని పట్టుబడుతున్నదని దాని సారాంశం. ఓడలో నింపబోయే పొద్దుతిరుగుడు పూలచెక్కకు మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చేట్టుందట.
పిసినారి అధిపతి టన్నుకు రెండు సెంట్లకు కక్కుర్తి పడి నాసిరకం బొగ్గు నింపించాడు. దానివల్ల ఎదురు గాలికి అట్లాంటిక్ మహాసముద్రం దాటేప్పటికే అవసరమైనంత ఆవిరి పీడనం నిలవడం కష్టంగా ఉంది. కానీ త్వరగా రమ్మని ఉత్తరువు! దాన్ని నిర్వర్తించడం కాప్టెన్ బాధ్యత. పైగా త్వరగా వెళ్తే బోనస్ కూడా ఇస్తారు. వెంటనే ఓడ మెకానిక్ ఓహిడ్డీని పిలిపించాడు. కానీ బాయిలర్లు శుభ్రం చేసుకోవడానికి ఒదేస్సలో మనం ఆగాలి, అన్నాడు ఓహిడ్డీ. గత ప్రయాణంలో చేశాం కదా; యీ గలీజు పని మళ్లీ చేయకపోతేనేమని ప్రశ్నించాడు జిబ్బిన్స్. మసి పేరుకొని సగం గొట్టాలు పనిచేయడం లేదు; శుభ్రం చేయకపోతే మనం తిరిగిపోలేం; సరుకు వేసుకొని అసలు పోలేమని తేల్చాడు ఓహిడ్డీ. అయితే మన బోనస్ పోతుందన్నమాట! నిట్టూర్చాడు కాప్టెన్. ఒక్క నిమిషం వృథా చేయకుండా పని ముగించమన్నాడు.
రైలు కమ్మీల ఆవల ఉన్నది ‘ఓడల బాయిలర్లను శుభ్రపరిచే ఆఫీసు’. యజమాని పి.కె.బీకొవ్. అనువాదకుడు లైజర్‌ను వెంటబెట్టుకుని బీకొవ్ ఆఫీసుకెళ్లాడు ఓహిడ్డీ. ఈయనకు రెండు రోజుల్లో బాయిలర్ శుభ్రం చేయాలి; అర్జెంటు రవాణా ఉంది; అమెరికాకు త్వరగా తిరిగి వెళ్లాలి, అని చెప్పాడు లైజర్. బదులుగా చాలా పెద్ద మొత్తం చెప్పాడు బీకొవ్. రెండు రోజులకు రెండు రోజుల్లాగే చెల్లించాలనీ అన్నాడు. చేసేదిలేక ఓహిడ్డీ అంగీకరించాడు. రెండ్రోజుల్లో పూర్తి కాకపోతే మాత్రం ప్రతిరోజుకూ మొత్తంలో ఇరవై ఐదు శాతం పట్టుకుంటామని మాత్రం ఖండితంగా చెప్పాడు. చెప్పిన సమయానికి పని పూర్తవుతుందని ధీమాగా ఉన్నాడు బీకొవ్. ఈ ఒప్పందం చేసుకుంటున్నప్పుడే ఆఫీసు ముందర కుర్రాళ్ల గుంపొకటి కనబడింది ఓహిడ్డీకి. అందులోంచి ఓ చింపిరి బట్టల కుర్రాడొచ్చి, గివ్ మి షిలింగ్ ఇఫ్ యూ ప్లీజ్ అన్నాడు. వాణ్ని చూడగానే ఓహిడ్డీకి తన స్వదేశం కెనడా గొర్తొచ్చింది. ముచ్చటపడి డాలర్ నాణెం చేతిలో పెట్టాడు. హిప్ హిప్ హుర్రా అని అరిచాడు పిల్లాడు.
ఎలకా, సేన్కా, మీష్కా, పాష్కా, పేత్కా, అలోష్కా అని కేకేశాడు బీకొవ్. బాయిలర్ గొట్టాలకు మురికి పట్టినప్పుడు పెద్దవాళ్లు వాటి లోపలికి దూరలేరు. పదేళ్ల పిల్లాడైతే సరిగ్గా సరిపోతాడు. దానికోసం బీకొవ్ దగ్గర ఈ కుర్రాళ్ల గుంపు ఉంది. రేవులోని దారిద్య్ర దేవతల బిడ్డలు వాళ్లు. రోజుకు పదిహేను కోపెక్కుల చొప్పున వారికి చెల్లిస్తాడు. భోజనం వాళ్లదే. కుర్రాళ్లందరిలోకీ మీత్క ప్రత్యేకమైనవాడు. వాడికి యెముకలే లేవు. యిరుకైన గొట్టాల్లో కూడా ఈల్ చేపలా ఈదుతాడు. మూలల్లోకీ వంపుల్లోకీ కూడా పాకుతాడు. అందుకే వాణ్ని ఎలక అంటారు. ఎలకొక్కడే పదిమంది పని చేస్తాడని బీకొవ్‌కు తెలుసు. ఒళ్లు గీచుకపోకుండా తార్‌పాలిన్ సంచులు తొడుక్కుని గొట్టాల్లో మాయమయ్యారు కుర్రాళ్లు. ఈలోపులో జిబ్బిన్స్‌కు ఓడ అధిపతి నుంచి మరో టెలిగ్రామ్ వచ్చింది. ప్రయాణకాలంలో మరి రెండు రోజులు తగ్గించగలిగితే బోనస్ రెట్టింపు చేస్తానని ఉంది. తన పిల్లల భవిష్యత్ కోసం బేంకులో డబ్బు వేయొచ్చనిపించింది.
లైజర్, ఓహిడ్డీ, జిబ్బిన్స్ కూర్చుని టీ తాగుతుండగా కాబిన్ తలుపు భళ్లున తెరుచుకుంది. ఫోర్‌మన్ విషయం చెప్పాడు. డామిట్ అనుకుంటూ ఓహిడ్డీ, లైజర్ ఉరికినారు. అబ్బాయిలూ ఏమైంది? మీత్క లోపలికి పాకినాడు, బయటికి రాలేకున్నాడు. యెలక ఇరుక్కుపోవడమా? లైజర్ నమ్మలేదు. నీ కాళ్లు విరగ, ఎంత పనిచేశావురా? దేవుడి తోడు నా తప్పేమీ లేదు; గొట్టం వెంబడి పాకినాను; నా చెయ్యి ఎలాగో వడిదిరిగి శరీరం కింద ఇరుక్కుంది; వూడదీసుకోలేకున్నానని ఏడ్వసాగాడు మీత్క. తనకు స్వదేశాన్ని గుర్తుతెచ్చిన కుర్రాడికే ఇలా జరగడంతో ఓహిడ్డీ ప్రాణం మూలిగింది. కాళ్లు పట్టుకుని లాగడానికి ప్రయత్నించారు. హృదయవిదారకమైన చావుకేక. ఓ వదలండి... నొప్పి... నా చేయి విరిగిపోతుంది.
విషయం తెలిసి బీకొవ్ దడదడలాడుతూ వచ్చాడు. సకాలంలో పని జరక్కపోతే మీరు డబ్బిస్తారా గాడద కొడుకుల్లారా అంటూ తిట్టిపోశాడు. మీత్కా, దొంగవేషాలు వేస్తున్నావా బద్మాష్ అని అరిచాడు. నా చేయి పూర్తిగా వడదిరిగింది అని మొత్తుకున్నాడు మీత్కా. మూతి పగలగొడతాను బయటికి రా! నన్ను చంపడం నయం, ఈ బాధ భరించలేను... గొట్టంలో బకెట్ నూనె పోశారు జిడ్డుగా ఉంటే సులభంగా తీయొచ్చని. రెండో బకెట్ కూడా పోశారు. ఎలక కాలికి తాడు కట్టి లాగారు.
ఓ దేవుడా నొప్పి నొప్పి అయ్యో అయ్యో చచ్చేంత నొప్పి... పిల్లాడిని హింసించడానికి ఓహిడ్డీ ఒప్పుకోలేదు. వాడు బయటికి రావాలంటే గొట్టం పగలగొట్టడం మినహా మార్గం లేదన్నాడు బీకొవ్. కంపెనీ యజమానుల అనుమతీ, సరుకు యజమానుల అనుమతీ లేకుండా పగలగొట్టడానికి ఒప్పుకోనన్నాడు కాప్టెన్. పిల్లవాడి సంగతి చెబుతూ యజమానికి టెలిగ్రామ్ పంపాడు. ఎలాంటి ఆలస్యమూ అనుమతించబడదనీ, దానికి యావత్తూ జిబ్బిన్స్ బాధ్యత వహించాలనీ జవాబు వచ్చింది. అతడి ముఖం కొయ్యబారి పోయింది. ఒక్క గంట ఆలస్యం కూడా ఒప్పుకోనని బీకొవ్‌కు తేల్చి చెప్పాడు. సాయంత్రం పొయ్యి అంటించి తీరాలి!
ఆలస్యానికి నేను డబ్బులు చెల్లించి బికారి కాదల్చుకోలేదన్నాడు బీకొవ్. గొట్టంలోనే చావదల్చుకున్నావటరా... అతని కుర్రవాడు అతని వ్యవహారం, సాయంత్రం మాత్రం పొయ్యి అంటించాలి అన్నాడు కాప్టెన్. అందరూ భోజనానికి వెళ్లిపోయినారు. సందడి లేదు. ఆ నిశ్శబ్దంలో బీకొవ్ పథకం ఆలోచించాడు. గొట్టంలోకి పేత్కను పంపించాడు. అందరూ తిరిగి వచ్చేప్పటికి ఎలకను లాగినట్టుగా తాడుతో పేత్కను లాగాడు. ఎటూ ఊపిరాడక చచ్చిపోయే కుర్రాడి కోసం కాప్టెన్ తన బోనస్ వదులుకోవడానికి సిద్ధంగా లేడు.
సాయంత్రం పూర్తి సరుకుతో ఓడ బయల్దేరింది. నిజం తెలిసిపోయి, ఈ అర్జెంటు రవాణాలో ఓడ మీద తిరుగుబాటు చేయలేక అశక్తుడైన ఓహిడ్డీ సముద్రంలో దూకినాడు. మెకానిక్ మరణించినట్లు కాప్టెన్ తన దినచర్య పుస్తకంలో రాసుకున్నాడు. న్యూఆర్లియన్స్ రేవులో ఓడ ఆగింది. ఆ కుర్రాడి సమస్యను ఎలా పరిష్కరించారని కాప్టెన్‌ను అడిగాడు యజమాని. అందులో చెప్పవలిసిందేమీ లేదన్నాడు కాప్టెన్. రాత్రి సిబ్బంది నగరంలోకి పోయినప్పుడు కాప్టెన్ యింజిన్ గదిలోకి పోయినాడు.
పెద్ద కొక్కెం తీసుకుని గొట్టం లోపలికి దూర్చి చాలాసేపు కలబెట్టినాడు. కొక్కాన్ని వెనక్కి లాగినప్పుడు ఆయన కాళ్ల వద్ద చిన్న పుర్రె, యెముకలు కింద పడ్డాయి. తర్వాత నల్లగా కమిలిన డాలర్! తెల్లారి కంసాలి దగ్గరకు వెళ్లి, దాన్ని తన వెండి పొగాకు పెట్టెకు అతికించమన్నాడు. యెక్కడిదీ డాలరు? కంసాలికి ఇలా జవాబిచ్చాడు కాప్టెన్: నాకు చెప్పడం ఇష్టం లేదు. అదొక విషాద కథ. కానీ యీ నాణాన్ని జ్ఞాపకార్థంగా వుంచుకోవాలనుకున్నాను. - బోరిస్ లవ్రెన్యోవ్
Comments
Please login to add a commentAdd a comment