Racherla
-
రిటైర్డ్ హెచ్ఎం రాంభూపాల్‌రెడ్డి ఔదార్యం
ఒంగోలు అర్బన్(ప్రకాశం జిల్లా): రాచర్ల మండలం యడవల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి తన పెన్షన్ సొమ్ముతో వెయ్యి మంది కార్మికులకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వచ్చి ఔదార్యం చాటుకున్నారు. ఈ మేరకు సోమవారం స్పందన భవనంలో అంగీకార పత్రాన్ని కలెక్టర్ దినేష్‌కుమార్‌కు అందజేశారు. యడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కార్మికులకు బీమా చెల్లిస్తానని అంగీకారం తెలిపారు. గతంలో రిటైర్మెంట్ బెన్ఫిట్స్ మొత్తం రూ.26 లక్షలు స్థానిక పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ద్వారా సుమారు 100 మందికి పైగా పేద బాలికలకు జమ చేస్తున్ననాని తెలిపారు. దీనిపై దేశ ప్రధాని కూడా అభినందించిన విషయం గుర్తుచేశారు. సేవా భావంతో రిటైర్డ్ ఉద్యోగి పనిచేయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. (క్లిక్: 100 మందికి సుకన్య సమృద్ధి యోజన) -
మనస్తాపంతో వృద్ధుడు ఆత్మహత్య
రాచెర్ల (ప్రకాశం జిల్లా) : కన్నకొడుకులే తనను సాకడానికి వంతులు వేసుకొని పోట్లాడుకోవడంతో మనస్తాపం చెంది ఓ తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురం గ్రామంలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మదిరె పెద్దిరెడ్డి(79)కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో ఒకరు ఆర్మీలో పనిచేస్తుండగా.. మరో కొడుకు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని ఎవరు సాకాలనే విషయంపై ఇద్దరు కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి తోడు ఎవరు తండ్రిని సాకితే తండ్రి దగ్గర ఉన్న రూ. లక్ష వారికే చెందాలి అంటూ మాట్లాడుకోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన పెద్దిరెడ్డి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
గుట్టల్లో గొర్రెల కాపరి మృత్యువాత
రాచర్ల (ప్రకాశం) : ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోమిదేవపల్లి సమీపంలోని కొండల పైనుంచి కిందపడి ఒక గొర్రెల కాపరి మృతి చెందాడు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బత్తుల రాజయ్య(65) ఐదు రోజుల క్రితం గొర్రెలను మేపుకునేందుకు గ్రామ సమీపంలోని గుట్టల్లోకి వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు గుట్టపై నుంచి కింద పడి మృత్యువు పాలయ్యాడు. కాగా మిగతా గొర్రెల కాపరులతో వెళ్లి ఉంటాడని కుటుంబసభ్యులు, ఇంటికి వెళ్లి ఉంటాడని కాపరులు అనుకుంటున్నారు. మంగళవారం అటుగా వెళ్లిన వారికి తీవ్ర దుర్వాసన రావటంతో చూడగా విషయం వెలుగులోకి వచ్చింది.