Radhakrishna Jagarlamudi
-
ఆగిపోయిన అక్కినేని సినిమా.. 39 ఏళ్ల తర్వాత విడుదల
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, జయసుధ, తులసి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిబింబాలు’. కె.ఎస్. ప్రకాష్ రావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ‘వియ్యాలవారి కయ్యాలు, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు, వినాయక విజయం’ వంటి చిత్రాలను నిర్మించిన జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి నిర్మించిన ‘ప్రతిబింబాలు’ సినిమా 39 ఏళ్ల అనంతరం ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ – ‘‘1982 సెప్టెంబర్ 4న ‘ప్రతిబింబాలు’ చిత్రాన్ని ప్రారంభించినప్పటి నుంచి నిర్మాణానికి అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పట్లో కొత్తగా ఉందనిపించి, ఈ చిత్రకథని ఎన్నుకున్నాం. అయితే ఇప్పటికీ అలాంటి కథతో ఒక్క సినిమా కూడా రాలేదు. ఏయన్నార్ ఫ్యాన్స్‌నే కాకుండా ప్రతి ఒక్కర్నీ ఈ చిత్రం అలరిస్తుంది. మేలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. గుమ్మడి, కాంతారావు, సుత్తివేలు, సాక్షి రంగారావు, జయమాలిని, అనురాధ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రవర్తి, కెమెరా: సెల్వరాజ్, హరనాథ్. -
క్రిష్ దర్శకత్వంలో కరీనా, శ్రద్ధాకపూర్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ కథానాయకునిగా తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ‘గబ్బర్’ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. చిరంజీవి ‘ఠాగూర్’ చిత్రం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథ రీత్యా ఇద్దరు కథానాయికలు ఉంటారు. మరి అక్షయ్ సరసన జతకట్టే ఆ అందాల భామలెవరు? టాలీవుడ్లో కూడా చర్చనీయాంశమైన విషయం ఇది. ఒక బాలీవుడ్ సినిమాలో నటించే కథానాయికల గురించి టాలీవుడ్లో కూడా చర్చలు జరగడం బహుశా ఈ సినిమా విషయంలో జరిగిందని చెప్పొచ్చు. అందుకు తగ్గట్టుగానే చాలామంది కథానాయికల పేర్లు మీడియాలో హల్చల్ చేశాయి. తమన్నా, శ్రుతిహాసన్, అమలాపాల్, ఇలియానా ఇలా చాలామంది దక్షిణాది కథానాయికల పేర్లు కూడా వినిపించాయి. అయితే.. ఎట్టకేలకు ‘గబ్బర్’ కథానాయికలు ఖరారయ్యారు. కరీనాకపూర్, శ్రద్ధాకపూర్ ఈ పాత్రలకు ఎంపికైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో అక్షయ్ భార్యగా కరీనా, ప్రియురాలిగా శ్రద్ధాకపూర్ నటించనున్నట్లు తెలిసింది. తమిళ చిత్రం ‘రమణ’ కథకు కొద్ది మార్పులతో చిరంజీవి ‘ఠాగూర్’ రూపొందింది. అయితే... ఆ కథను క్రిష్ తనదైన శైలిలో ఎన్నో మార్పులు చేసినట్లు సమాచారం. సమకాలీన అంశాలను స్పృశించే విషయంలో క్రిష్‌ది ప్రత్యేక శైలి. ఆయన గత చిత్రాలే అందుకు నిదర్శనం. లంచగొండితనం నిర్మూలనే ప్రధానాం శంగా రూపొందిన ఈ కథాంశాన్ని నేటి పరిస్థితులకు అనుగుణంగా పలు మార్పులు చేసి క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిసింది. డిసెంబర్లో ‘గబ్బర్’ సెట్స్‌కి వెళ్లనుందని వినికిడి.