raghava sharma
-
ప్రజా నిబద్ధతే నిఖిలేశ్వర్ కవిత్వ కొలబద్ద
నిఖిలేశ్వర్ ‘అగ్ని శ్వాస’కు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించినా, ప్రజా నిబద్ధతే కొలబద్దగా వారి కవిత్వాన్ని తెలుగు సాహిత్య లోకం ఏనాడో గుర్తించింది. ‘నన్నయ్యను నరేం ద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి– లేపకు– నీ పీక నులిమి గోతిలోకి లాగు తాడు’ అంటూ దిగంబర కవిత్వానికి అంకురార్పణ చేసిన నిఖిలేశ్వర్ కవితా ప్రస్థానం ఆరున్నర దశాబ్దాల క్రితమే మొదలైంది. ఎంకి పాటలు పాడుకుంటూ, కరుణశ్రీ పద్యాలకు మురిసిపోతూ, భావకవిత్వం ఊపులో కవిత లల్లుతూ, ఆత్మానుభూతి నుంచి సమష్టిలోకి, లోకానుభూతిలోకి తొలి అడుగులు వేసిన కుంభం యాదవరెడ్డి దిగంబర కవిత్వం ద్వారా నిఖిలేశ్వర్‌గా రూపాంతరం చెందారు. ప్రజాపోరాటాలతో పెనవేసుకుని, వర్గ చైతన్యాన్ని పెంచే విప్లవ కవిగా శ్రామిక విప్లవ పోరాటాలతో మమేకమయ్యారు. నల్లగొండ జిల్లా వీరవల్లి గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో ఏకైక సంతానంగా 1938లో నిఖిలేశ్వర్ పుట్టిన ఏడాదికే తండ్రి నరసయ్య మరణించారు. ‘గునుగుపూల తెల్లని జడలు, మోదుగుపూల చిలుక ముక్కులు, గుల్మొహర్ పరచిన ఎర్రతివాచీ’ వంటి బాల్యపు జ్ఞాపకాలు ఆయన కవిత్వంలో పరిమళిస్తుంటాయి. నిజాం పాలనలో గ్రామాలపై రజాకార్లు పడి దాడులు చేస్తుంటే, గడ్డివాముల్లో దాక్కున్న బాల్యం ఆయనది. పొట్ట చేతపట్టుకుని తల్లితో కలిసి భాగ్యనగరానికి వలస వచ్చారు. సుల్తాన్ బజార్, బాకారం, ముషీరాబాద్ వీధి బడులలో విద్యా భ్యాసం. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీలో కూలీగా తల్లి నర్సమ్మ శ్రమజీవనం. ఆయన ఆలోచనలు ఆర్యసమాజం మీదుగా హేతు వాదంలోకి, యామినితో కులాంతర వివాహానికి దారితీశాయి. నిఖిలేశ్వర్ 1956 నుంచే హిందీలో కవిత్వం రాయడం మొదలు పెట్టారు. కె. యాదవ రెడ్డి పేరుతో 1960–65 మధ్య భావకవిత్వం రాశారు. ‘నవ్యత నింపుకోవాలంటే కోపంగా వెనక్కి చూడు’ అంటూ ఆత్మానుభూతి నుంచే లోకానుభూతి వైపు తొంగి చూశారు. సమాజం కులతత్వం, మతత్వం, అవినీతి, బంధుప్రీతి తప్ప, సమష్టి ప్రయోజనం కోల్పోయిన దశలో కొత్త పేర్లతో ఆరుగురు దిగంబర కవులు 1965లో ఆవిర్భవించారు. ప్రపంచపు అచ్ఛాదనల్ని చీల్చుకుని, పెద్ద పెద్ద అలలతో దిగంబర కవిత్వం ఒక ఉప్పెనలా విరుచుకుపడింది. ఆనాటి సమాజానికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఈ ఆరుగురు దిగంబర కవుల్లో నిఖిలేశ్వర్‌ది సొంత గొంతుక. ‘ఈ దేశంలో ప్రతినగరం నవ నవలాడే మహాగాయం. దూరం నుండి అది ఎర్రగులాబి. దగ్గరకు వెళితే అది రక్తస్రావపు వ్రణం’ అంటారు. దిగంబర కవులు 1966ను నిఖిలేశ్వర్ నామ సంవత్సరంగా నామకరణం చేశారు. దిగంబరత్వం మానసికమైనదేకానీ భౌతికమైనది కాదు. అయినా, ఆరుగురు దిగంబర కవుల్లో అతి తక్కువ బూతు పదాలు వాడింది నిఖిలేశ్వరే. ఆయన ఆర్మీలో సివిలియన్ ఉపాధ్యాయుడిగా, మద్రాసు ఎయిర్ ఫోర్స్‌లో సివిలియన్ క్లర్కుగా చేసినా, హైద రాబాద్‌లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా స్థిర పడ్డారు. అంతకు ముందు గోల్కొండ పత్రికలో సబ్ ఎడిటర్‌గా కూడా చేశారు. తెలుగులోనే కాకుండా హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో కూడా కవిత్వం రాశారు. అనేక కథలు, సాహిత్య వ్యాసాలు రాశారు. వీరి కవిత్వం ఇంగ్లిష్, హిందీతోపాటు పలు భాషల్లోకి అనువాద మైంది. ‘గోడల వెనుక’ జైలు జ్ఞాపకాలు 1972లో వచ్చింది. భారత–చైనా మిత్రమండలి తరపున 2015 డిసెంబర్లో, పదిమంది సభ్యుల బృందంతో కలిసి నిఖిలేశ్వర్ పదిరోజుల పాటు చైనాలో పర్యటించారు. నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు, పౌర హక్కుల ఉద్యమాలు నిఖిలేశ్వర్‌ను నిమ్మళంగా కూర్చోనివ్వలేదు. జ్వాలా ముఖి, చెరబండరాజు, నగ్నమునితో కలిసి విరసం వ్యవస్థాపక సభ్యులయ్యారు. ఆయన కలం నుంచి ‘మండుతున్న తరం’ వచ్చింది. పీడీ యాక్టు కింద జ్వాలాముఖి, చెరబండరాజుతో కలిపి నిఖిలేశ్వర్‌ను 1971లో అరెస్టు చేసి 50 రోజులు జైల్లో పెట్టారు. ‘రోజూ తూర్పున ఎరుపెక్కే ఆకాశాన్ని, ద్వీపపు గోళాల్ని ఛేదించుకువచ్చే కిరణాల్ని, పశ్చిమాన ఎరుపెక్కే చంద్రుణ్ణి, రక్తస్నానం చేయించే సూర్యుల్ని ఎవరూ బంధించలేరు’ అంటారు జైలు నుంచి ‘నేరస్తుల ద్వీపం’లో. ‘దుక్కి దున్నిన చేతులకు దక్కిన దేమిటి?’ అని ‘ఈనాటికీ’ ప్రశ్నిస్తారు. ‘పిచ్చికుక్కల్లా కాటేసిన తుపాకుల చేతులు తిరిగి మన్నులోనే వెతుక్కోవాలి మానవత్వాన్ని’ అంటూ ఇంద్రవెల్లి కాల్పులపై పోలీసులకు ఆత్మబోధ చేస్తారు. ‘యథార్థాన్ని వికృతం చేసి వికటాట్టహాసం చేస్తున్న వెండితెర’ని తూర్పారబడతారు. బాల్యంలో వీరవల్లి వదిలాక నిఖిలేశ్వర్‌ను హైదరాబాదే అక్కన చేర్చుకుంది. ‘ప్రతి మారుమూలా గతుకుల, అతుకుల గల్లీల్లో అడుగులేస్తూ, పడుతూ, లేస్తూ, ఏడుస్తూ, నవ్వుతూ’నే తిరిగారు. ‘సహనానికి హద్దులు చెరిపేసిన మతోన్మాదం’ అంటూ నాలుగు దశాబ్దాల నా మహానగరం’లో ఆవేదన వ్యక్తం చేస్తారు. ‘ద్వేషపు కత్తులతో అతి చల్లగా నెత్తుటి నెలవంక’ను ఆ మహా నగరంలో చూశారు. ‘ఈ దేశంలోని ప్రతినగరం నవనవలాడే మహాగాయం’ అని బాధపడుతూనే, దీనికి హైదరాబాద్ ఏమీ అతీతం కాదని సమాధానపడతారు. ‘ప్రశ్నించే గొంతులను, తెగించే యువకులను ఎన్కౌంటర్ చేస్తున్నదెవరు?’ అని ప్రశ్ని స్తారు. ‘చరిత్రపాఠాలను నేర్పలేని వారు చరిత్రను అసలే నిర్మిం చలేరు’ అని కుండబద్దలు కొడతారు. ‘అనామకమైన ఈ బతుకు లోయలో నా పాదముద్రల ఆనవాళ్ళు చూడాలని వెనక్కి తిరిగితే గతమంతా తవ్వని జ్ఞాపకాల గనిగా మారిపోయింది. పెంటకుప్పల మీంచి గంతు లేసి, వరి పొలాల తల నిమరగానే పట్నం గల్లీల్లో పరుగు పెట్టిన కాళ్ళు కొంత దూరం ఎగిరిపోయిన అక్షరాల పావురాళ్ళ’ అని ‘జ్ఞాపకాలకొండ’ను తవ్వితీస్తారు. ‘ప్రజాస్వామ్యాన్ని ముసుగేసు కున్న కొత్త నియంత–గుర్రమెక్కి దౌడుతీస్తున్న వర్తమానం’ అని వ్యాఖ్యానిస్తారు. ‘కరగని కాలం కొవ్వొత్తిపై అగ్నిశిఖలా నేను, కొడిగట్టే క్షణాలతో చేయూతనిచ్చే జీవనోత్సాహం’ అని ‘అగ్నిశ్వాస’లో ‘అగ్ని స్పర్శ’ను అనుభవిస్తారు. ‘మన అడుగుల కింద నలిగి కూడా దుమ్ము దులుపుకుని లేచి వడివడిగా నడిచే పిపీలికం’ లోని పట్టుదలను కూడా ‘అగ్నిశ్వాస’లో మనకందిస్తారు. నిఖిలేశ్వర్ కవిత్వం ఒక్కసారిగా విరుచుకుపడి ఆగిపోయే ఉప్పెన కాదు. నిరంతరం అలలతో కదలాడే జీవనదిలా సాగుతుంది. తన చుట్టూ ఉన్న మనుషులతో, తనతో తాను నిత్యం సంభాషి స్తున్నట్టుంటుంది. ఉద్యమాల ఉధృతి, అనుభవాల గాఢత నిఖి లేశ్వర్ కవిత్వాన్ని నడిపిస్తాయి. ఆయన కవిత్వమంతా జీవితాన్ని వ్యాఖ్యానించడంతో సరిపెట్టుకోదు, జీవితాన్ని మార్చేదిశగా ఆలోచింపజేస్తుంది. రాఘవశర్మ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు మొబైల్ : 94932 26180 -
మరోసారి చారిత్రక తప్పిదం!
ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు వారసత్వంగా వస్తున్న చారిత్రక తప్పిదాలకు మరొక‘సారి’ తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, వికేంద్రీకరణను వ్యతిరేకించాలని కోరుతున్నారు. వెనుకబడిన ఉత్తర కోస్తాకు పరిపాలనా రాజధాని, రాయలసీమకు హైకోర్టు ఇవ్వాలన్న ప్రతిపాదనను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విభిన్న భౌగోళిక ప్రాంతాల మధ్య సమతుల్యత సాధించడం కోసం చేపట్టవలసిన పరిపాలనా వికేంద్రీకరణ ప్రయత్నాన్ని అసలు వీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? అమరావతిలో కార్పొరేట్ సామ్రాజ్యం కోసం నవనగరాల ఆర్థిక రాజధానిని నిర్మించదలచిన చంద్రబాబును ‘ఉభయ కమ్యూనిస్టులు’ ఎందుకు సమర్థిస్తున్నారు? విజయవాడ కేంద్రంగా ఏర్పడిన వ్యాపార సామ్రాజ్యానికి ఊపిరిపోయడంలో ఏడెనిమిది దశాబ్దాలుగా ఈ ‘కామ్రేడ్లు’ భాగస్వాములయ్యారు. రాష్ట్ర శాసన సభకు 1955లో జరిగిన ఎన్నికల్లో ఘోరపరాజయం పాలవడంతో పార్టీ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. కమ్యూనిస్టు పార్టీ నాయకులు వ్యాపారాల్లోకి, వ్యవసాయంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించారు. దాంతో వర్గపోరాటానికి బదులు వర్గసామరస్యత వైపు ప్రయాణిస్తూ. పార్లమెంటరీ పంథాను అంతిమ లక్ష్యంగా, ఏకైక మార్గంగా భావించే స్థితికి వెళ్ళిపోయారు. ఫలితంగా ఉదారవాదులుగా మిగిలిపోయారు. క్రమంగా ఇలా వర్గ చైతన్యాన్ని కోల్పోయిన ‘కామ్రేడ్లు’ వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు బాసటగా నిలవలేకపోతున్నారు. కోస్తా నాయకులు 1937లో సీమ నాయకులతో శ్రీబాగ్ ఒడంబడిక చేసుకుని వారిని కూడా ఆంధ్రరాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములను చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. కేంద్ర జలవనరుల సంఘం 1951లో ఆమోదం తెలిపిన కృష్టాపెన్నార్ ప్రాజెక్టును నిర్మించినట్టయితే కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 7 లక్షల ఎకరాలకుపైగా భూమి సాగయ్యేది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినాక తమిళులకు నీళ్ళివ్వాల్సి వస్తుం దన్న సాకుతో కృష్టాపెన్నార్ను అటకెక్కించారు. అంతర్జాతీయ దృక్పథం కలిగిన కమ్యూనిస్టు నాయకులు కూడా తమిళ వ్యతిరేకతను తలకెక్కిం చుకుని, కృష్టాపెన్నార్ బదులు రాయలసీమకు చుక్క నీరు రాని నాగార్జునసాగర్‌ను నిర్మించాలని పట్టుబట్టారు. రాయలసీమకు అన్యాయం చేయ డంద్వారా చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. సీమకు రావలసిన న్యాయమైన కృష్ణా నీటి గురించి ఈ ‘కామ్రేడ్లు’ ఆందోళన చేయడం లేదు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు పూర్వ కర్నూలు రాజధానిని పునరుద్ధరించాలనే కోర్కె సీమలో బలంగా వినిపించినప్పుడు కూడా ‘కామ్రేడ్లు’ స్పందించలేదు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజకీయంగా వీరికి బలం లేకపోయినా, వీరికున్న సామాజిక, సాంస్కృతిక, వ్యాపారబంధం మాత్రం మరింత బలపడుతోంది. వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనం గురించి వీరు ఆలోచించడం లేదు. రాజధాని పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్‌తో ఏర్పాటు చేసుకోవాలనుకున్న రెండు లక్షల కోట్ల రూపాయల విలువగల సామ్రాజ్యం కుప్పకూలిపోతోందనుకుంటే, దాని వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఆధిపత్యవర్గాలు బెంబేలెత్తడం సహజం. వారితో ‘కామ్రేడ్లు’ కూడా గొంతుకలపడమే విషాదం. మూడు రాజధానులను వ్యతిరేకించే పేరిట కార్పొరేట్ సామ్రాజ్యపు ఆర్థిక రాజధానిని పునరుద్ధరించాలని కామ్రేడ్లు కూడా ఆందోళన చేయడం మరో చారిత్రక తప్పిదం. అమరావతి రాజధాని మార్పును సీపీఎం తమ విధాన ప్రకటనగా వ్యతిరేకించినప్పటికీ, సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ మాత్రం రాజధాని మార్పును బీజేపీ నేత, ప్రధాని నరేంద్రమోదీని అవమానించడంగా భావించారు. మూడు ప్రాంతాలకు కేంద్రబిందువుగా ఉన్నందునే అమరావతిని సమర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, బెంగాల్ తది తర రాష్ట్రాల రాజధానులేవీ ఆయా రాష్ట్రాలకు కేంద్రబిందువుగా లేవు. చివరికి దేశ రాజధాని ఢిల్లీ కూడా కేంద్ర బిందువుగా లేదు. ప్రజా ఉద్యమాలకు పట్టంకట్టాల్సిన కామ్రేడ్లు కార్పొరేట్ శక్తులకబంద హస్తాలలోకి జారుకోవడం చారిత్రక తప్పిదమే కాదు మహా విషాదకరం కూడా. రాఘవశర్మ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మొబైల్ : 94932 26180 -
మాండలిక మాధుర్యాల పదకోశం
మాండలికాలు మన వారసత్వ సంపద. జానపద విజ్ఞానం మాండలికాల నుంచి పుట్టిందే. ప్రాచీన కాలంలో అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, సారంగపాణి, రామదాసు వంటి వాగ్గేయకారులు, వేమన, బద్దెన వంటి శతకకర్తలు మాండలికాలను వాడారు. యక్షగానాల్లోనూ పాత్రోచితంగా మాండలికాలను ఉపయోగించారు. సాహిత్యంలో గ్రాంధికం నుంచి శిష్టవ్యవహారికానికి, అక్కడ నుంచి మాండలికానికి ప్రాధాన్యత పెరిగి నేడు సాహిత్య రచన భాషగా మాండలికం నిలదొక్కుకుంది. ఈ మాండలిక భాషా సంపదను భద్రపరుచు కోవడం మన బాధ్యత. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇటీవల ఉద్యోగవిరమణ చేసిన ఆచార్య మూలె విజయలక్ష్మి ఆ బాధ్యతను ఎప్పటి నుంచో భుజానికెత్తుకున్నారు. వ్యావహారిక భాష నుంచి జాతీయాలు సేకరించి 2008లో ‘తెలుగు జాతీయాలు పర్యాయ పదకోశం’ నిర్మించారు. భారతీయ భాషల్లో జాతీయాలకు నిర్మించిన తొట్టతొలి పర్యాయపదకోశంగా ఇది గుర్తింపు పొందింది. దీనికి ముందు ‘తెలుగు జాతీయాల కోశం’ నిర్మించారు. తెలుగులో ప్రథమ మహిళా నిఘంటు నిర్మాతగా గుర్తింపు పొందారు. గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ‘తెలుగు మాండలిక పదకోశం’ తెచ్చిన వీరు, తాజాగా చిత్తూరు జిల్లాకు కూడా ‘తెలుగు మాండలిక పదకోశం’ నిర్మించారు. తన గురువర్యులైన ప్రముఖ భాషా శాస్త్రవేత్త, నిఘంటు నిర్మాత జిఎన్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం ఈ పదకోశాన్ని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆవిష్కరింపచేశారు. భాష సామాజికం కనుక, సమాజంలో కనిపించే మార్పులు భాషలోనూ కనిపిస్తాయి. సమాజంలో ఉండే కుల, మత, ప్రాంత, వర్గ, వయోభేదాల అంతరాలు భాషా వైవిధ్యానికి దారితీస్తున్నాయి. చారిత్రకంగా, సామాజికంగా, ప్రాంతీయంగా భాషలో కలిగే మార్పులు, విలక్షణత, వైవిధ్యాన్ని మాండలికం అంటున్నాం. ఒక ప్రాంతంలో వాడే ప్రత్యేక పదాలు, పదబంధాలు, జాతీయాలు, సామెతలు, వ్యాకరణాంశాలు, ధ్వని పరిణామాలు, అన్యదేశ పదాలు ఒక ప్రాంత మాండలిక ప్రత్యేకతను పట్టిస్తాయి. మాటల ఉచ్ఛారణ తీరు ‘యాస’ కూడా మాండలికంలో భాగమే. తెలుగు భాషా ప్రాంతాన్ని స్థూలంగా కళింగాంధ్ర, కోస్తా, తెలంగాణ, రాయలసీమ అనే నాలుగు భాషా మండలాలుగా భద్రిరాజు కృష్ణమూర్తి విభజించారు. అయినప్పటికీ, ఆయా జిల్లాలకే పరిమితమైన పదజాలం, మాండలికత ఉంది. జిల్లా అంతటా కూడా భాషలో, యాసలో ఏకరూపత లేదు. ప్రాంతీయ, స్థానిక మాండలికాలకు ఖచ్చితంగా గిరిగీసి సరిహద్దులు ఏర్పాటు చేయలేం. తెలుగు పదజాలం, వ్యాకరణాంశాలు, ధ్వనిమార్పుల్లో ఉన్న వైవిధ్యం, విలక్షణత, భాష సుపంపన్నతను తెలియచేస్తుంది. ఏ రెండు మాండలికాలైనా భిన్న అర్థాలు ధ్వనిస్తే వాటిని భిన్న భాషలుగా గుర్తించవచ్చు. ఒక భాషలోని మాండలికాలే భిన్నభాషలుగా రూపాం తరం చెందినట్టు భాషా పరిణామ చరిత్ర చెపుతోంది. మూల ద్రావిడ భాష నుంచి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం తదితర భాషలు పుట్టుకు రావడం ఇందుకు నిదర్శనం. జిల్లాల వారీగా వ్యావహారిక ఖండికల్ని సేకరించి, ఆయా జిల్లాల మాండలిక భాషా నిర్మాణ భేదాల్ని గతంలో బూదరాజు రాధాకృష్ణ విశ్లేషించారు. జిల్లాల వారీగా జరగని మాండలిక పదసేకరణను ఈ ‘తెలుగు మాండలిక పదకోశం’లో మూలె విజయలక్ష్మి చేపట్టారు. కేవలం పదాల సేకరణకే పరిమితం కాకుండా, వాటి అర్థాలను, వాడే తీరును కూడా వివరించారు. నానాటికీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ ప్రభావం వల్ల మాండలిక పదజాలం కాలగర్భంలో కలిసిపోకముందే వాటిని నిక్షిప్తం చేయడం ఎంతైనా అవసరం. రాఘవశర్మ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మొబైల్ : 94932 26180 -
సాహిత్య బాటసారి శారద
‘‘అది 1937వ సంవత్సరం. చలికాలపు ఓ ఉదయం. పన్నెండేళ్ల పిల్లవాడు తెనాలి రైల్వేప్లాట్‌ఫాంపై కాలుమోపాడు. తెలుగు ఒక్క ముక్క రాదు. ఎక్కడో పుదుక్కోటలో పుట్టి, మద్రాసులో పెరిగి, జానెడు పొట్టకోసం తెనాలి వచ్చాడు. హోటల్ కార్మికుడిగా చేరి తెలుగు నేర్చుకున్నాడు. అతనికి చదువు ఒక వ్యసనం. తనలోని తీవ్రమైన భావావేశాన్ని ప్రకటించడానికి రచనను ఆశ్రయించాడు. తోటి హోటల్ కార్మికులమైన మాకు తెలుగుతోపాటు తమిళ అక్షరాలు కూడా నేర్పాడు, పుస్తకాలు చదివించాడు. తను రాయడమే కాకుండా, నాచేత, ప్రకాశరావు, అబ్బరాజు నాగభూషణరావు, ముక్కామల మల్లికార్జునరావు చేత రాయించి మమ్మల్ని రచయితలను చేశాడు’’ అంటూ ఆలూరి భుజంగరావు తన జీవిత చట్రం నుంచి శారద జీవితాన్ని ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే ‘సాహిత్య బాటసారి శారద స్మృతి శకలాలు’. ఈ పుస్తకం 1985లో వచ్చింది. శారద తుపాను వేగంతో సాహిత్యంలోకొచ్చాడు. అంతేవేగంతో జీవితం నుంచి నిష్క్రమించాడు. బతికినంత కాలం హోటల్ కార్మికుడిగానే బతికాడు. ఒక చేత్తో రచనలు చేస్తూనే, మరో చేత్తో రోడ్డుపక్క మసాలా గారెలు, మిరపకాయ బజ్జీలు అమ్మాడు. బస్సుల్లో నిమ్మకాయ మజ్జిగ, రోడ్డుపక్క పాతపుçస్తకాలు అమ్మాడు. అసలు పేరు ఎస్. నటరాజన్. శారద, గంధర్వుడు, శక్తి అన్న పేర్లతో వందకుపైగా కథలు రాశాడు. అపస్వరాలు, మంచి–చెడు, ఏదిసత్యం, సరళాదేవి హత్య, మహీపతి, అందాల దీవి వంటి ఆరు నవలలు రాశాడు. ముప్ఫై ఏళ్లే జీవించాడు. ‘‘అది 1947 ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు. నేను, శారద పనికోసం తెనాలి వీధులన్నీ తిరిగాం. మాకు పనులు ఇవ్వని హోటల్ యజమానులు, మమ్మల్ని కొట్టిన యజమానులు, మా జీతాలు ఎగ్గొట్టిన యజమానులు ఆరోజు జెండాల్ని ఎగరేశారు. ఆరోజు మా పొయ్యిలో పిల్లి లేవలేదు. నేను, శారద, అమ్మ కటిక పస్తులు పడుకున్నాం’’ అంటూ భుజంగరావు చెప్పిన విషయాలు కంటతడి పెట్టిస్తాయి. ‘‘ఆనాటి హోటల్ వృత్తి అవగుణాల నిలయం. పొద్దుగూకులూ బండెడు చాకిరీ చేయాల్సి ఉండేది. నాలుగు డబ్బులు చేతికి వచ్చిన రోజున ఏ చీట్లాటకో, తాగుడుకో, దొమ్మరిగుడిసెలకో వెళుతుండేవారు. అంతటి కల్మషంలో బతుకుతున్నా కూడా కథలు రాయాలన్న అపురూప ఊహ కలిగించినవాడు శారద.’’ ‘‘ఆరోజు ఆగస్టు 17, 1955వ సంవత్సరం. ‘కాఫీకి రారా బుజ్జీ’ అని శారద కేకవేశాడు. ‘నేను రానురా కథరాసుకుంటున్నా’ అన్నాను. తలెత్తి గేటువేపు చూశాను. అదే ఆఖరి చూపు. రాత్రి తొమ్మిది గంటలకు ‘శారద చనిపోయాడు’ అన్నారెవరో! మర్నాడు శవసంస్కారానికి బజారున పడ్డాం చందాలకు. అప్పటికతనికి ఇద్దరు పిల్లలు. భార్య నిండు గర్భవతి.’’ ‘‘శారద కథ రాయాలంటే అరకప్పు కాఫీ తాగి, æతాజ్ మహల్ బీడీకట్ట దగ్గర పెట్టుకుంటేనేగానీ కలం కదిలేది కాదు. పరిచయమున్న వారందరినీ కాఫీకి, బీడీలకు అణాడబ్బులడిగేవాడని అపప్రధ ఉండేది. ఎక్కడో తమిళ దేశంలో పుట్టి, తెనాలికొచ్చి తెలుగు నేర్చుకుని, తెలుగు జీవితాన్ని అక్షరబద్ధం చేసిన శారదకు కాఫీ కోసం, బీడీల కోసం ఎన్ని అణాలిస్తే అతని రుణం తీర్చుకోగలం!’’ అన్న భుజంగరావు మాటలు మనల్ని వెంటాడుతాయి. - రాఘవ శర్మ -
విశ్వకవికి చైనా నీరాజనం
భారత-చైనాల మధ్య సాహిత్య సాంస్కృతిక బంధాలకు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ పునాది వేశారు. తొమ్మిది దశాబ్దాల క్రితం ఆ మహాకవి చేసిన చైనా సందర్శన అక్కడి మేధావులను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ మహానుభావుడిని ఆ దేశం ఈనాటికీ గౌరవిస్తూనే ఉంది.మొన్న డిసెంబరు నెలలో చైనాలో పర్యటించిన మా భారత-చైనా మిత్రమండలి బృందం దృష్టిని ఈ విషయం విశేషంగా ఆకర్షించింది. చైనాలోని పాఠశాల విద్యలో ‘ఫ్రూట్ గ్యాదరింగ్’ అన్న టాగూర్ రచనను పాఠ్యాంశంగా పెట్టడం ద్వారా ఆ కవితా ధారను ఆ జాతి యావత్తూ బాల్యం నుంచే ఆస్వాదించే అవకాశాన్ని కల్పించారు. హైదరాబాదులో ఏడాదికోసారి పుస్తక ప్రదర్శన పెడితేనే పుస్తక ప్రియులకు పండుగ చేసుకున్నట్టుంటుంది. చైనా ఆర్థిక రాజధాని షాంఘై మహానగరంలో ఉన్న ఏడంతస్తుల ‘షాంఘై బుక్ సిటీ’లో మాత్రం ప్రతి రోజూ పుస్తక పండుగే. మన పుస్తక ప్రదర్శనకు ఎన్నో రెట్లుండే బుక్ సిటీలో లూషన్, గోర్కీ వంటి మహామహుల చిత్రపటాలతోపాటు రవీంద్రుడి చిత్రపటాన్ని కూడా పెట్టారు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా వాసిగా ఆయన గురించి వారు గర్వపడతారు. టాగూర్ కమ్యూనిస్టు కారు. నోబెల్ బహుమతి పొందిన ఆయన ‘గీతాంజలి’ని చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దిగ్గజాలలో ఒకరైన చెన్ డుగ్జియు చైనా భాషలోకి 1915లోనే అనువాదం చేశారు. భారతదేశంలో చైనాపై అధ్యయనానికి ‘విశ్వభారతి’లో రవీంద్రుడు ఏర్పాటు చేసిన చైనా భవనం తొలి భారత-చైనా సాంస్కృతిక సంబంధాలకు ఎంతగానో దోహదపడింది. తాన్యున్ వంటి చైనా మేధావులు, ఉపాధ్యాయులు ఈ చైనా భవనంలో చాలా కాలం గడిపారు. చైనా నాగరికత, ఆధునిక అభివృద్ధి గురించి అర్థం చేసుకోవడానికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడింది. బ్రిటిషు ఇండియాలో ఎక్కువగా పండించే నల్లమందును చైనాపై రుద్దడాన్ని టాగూర్ తన ఇరవయ్యవ ఏటనే వ్యతిరేకించారు. ‘చీనీ మార్నరే బేబస్’ అంటే ‘చైనాలో ప్రజలను చంపే వ్యాపారం’ అన్న శీర్షికన నల్లమందు వ్యాపారంపై 1881లోనే వ్యాసం రాశారు. చైనా సందర్శనకు ముందే టాగూర్‌కు ప్రముఖుడిగా గుర్తింపు ఉంది. రెండు నాగరికతల మధ్య ప్రేమ, సోదర ప్రియత్వం వెల్లివిరియాలనీ, పరస్పర ప్రయోజనాలను పొందే సంబంధాలను కొనసాగించాలనీ చైనా పర్యటన సందర్భంగా ఆ మహాకవి ఆకాంక్షించారు. ‘మీ నుంచి కొన్ని కలలు పుట్టుకొస్తాయి. మీనుంచి వచ్చే ప్రేమ సందేశం విభేదాలను తొలగిస్తుందని భావిస్తున్నా. ఏది సాధ్యమో అది చేశా. స్నేహితులను సంపాదించుకున్నా’ అని చైనాలో తన చివరి మాటగా టాగూర్ అన్న మూడు దశాబ్దాల తరువాత పంచశీల సూత్రాలపై ఉభయ దేశాలూ సంతకాలు చేశాయి. (వ్యాసకర్త : రాఘవశర్మ 9493226180)