బ్రస్సెల్స్లో ఇన్ఫోసిస్ ఉద్యోగి అదృశ్యం
న్యూఢిల్లీ: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో మంగళవారం బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత భారత్కు చెందిన రాఘవేంద్ర గణేశన్ ఆచూకీ తెలియడం లేదు. బ్రస్సెల్స్ నగరంలో రాఘవేంద్ర ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు. రాఘవేంద్ర ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే అతని జాఢ ఇంకా తెలియరాలేదని బ్రెజిల్లో భారత రాయబారి మంజీవ్ పూరి చెప్పారు. రాఘవేంద్రను సంప్రదించేందుకు అతని స్నేహితులు కూడా ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
రాఘవేంద్ర ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. రాఘవేంద్ర అదృశ్యం కావడానికి గంట ముందు తల్లితో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పారు. బెల్జియంలోని భారతీయులకు అన్న విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాంబు పేలుళ్లలో గాయపడిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది ఇద్దరు కోలుకుంటున్నారని సుష్మా వెల్లడించారు. బ్రస్సెల్స్లో మంగళవారం ఎయిర్పోర్ట్లో, మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 34 మంది మరణించగా, మరో 200 మంది గాయపడిన సంగతి తెలిసిందే.