raghunatha palem
-
అల్లుడు హైడ్రామా..!
రఘునాథపాలెం: మండలంలోని హరియాతండా సమీపంలో మంచుకొండ – పంగడి ప్రధాన రహదారి పక్కన చెట్టును ఢీకొన్న కారు ప్రమాదంలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు మృతిచెందిన విషయం విదితమే. కానీ, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పథకం ప్రచారం జరిగిన హత్యా? లేక నిజంగానే ప్రమాదం జరిగిందా? అనే అంశంపై పలువురు పలు రకాల వాదనలు వినిపిస్తున్నారు. మంగళవారం రాత్రి కారు ప్రమాదంలో దుర్మరణం చెందిన తల్లీకూతుర్ల అంత్యక్రియలు బుధవారం మండలంలోని బావోజీతండాలో పోలీసుల సమక్షంలో నిర్వహించారు. ఆది నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న మృతురాలి తండ్రి, హరిసింగ్, తల్లి పద్మ, సోదరుడు, సోదరితో పాటు కుటంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేశారు. మృతురాలి భర్త, ఫిజియోథెరపిస్ట్ అయిన బోడా ప్రవీణ్ కారణమని, ఆయన్ను తీసుకొచ్చిన తర్వాతనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని భీష్మించారు. మరో యువతితో వివాహేతర సంబంధం నెరుపుతున్న ప్రవీణ్‌ను భార్య కుమారి ప్రశి్నస్తున్న నేపథ్యంలోనే తల్లీ కూతుర్లను హతమార్చి యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తున్నాడని వందలాది మంది ఆస్పత్రికి చేరుకుని నిరసన తెలిపారు. ప్రవీణ్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రఘునాథపాలెం సీఐ శ్రీహరి, ఎస్ఐలు, పోలీసులు జోక్యం చేసుకొని పోస్టుమార్టం నివేదిక అనంతరం విచారణ చేపట్టి చర్యలు చేపడుతామని మృతుల కుంటుంబ సభ్యులకు నచ్చజెప్పి పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రవీణ్ తరఫు బంధువులు సైతం అక్కడికి వచ్చేందుకు భయపడ్డారు. సాయంత్రం 4 గంటల తర్వాత మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బావోజీతండాకు తరలించేందుకు వాహ నం ఎక్కించారు. కాగా, పోస్టుమార్టంలో ఏం తేలిందనే విషయం డాక్టర్లు చెప్పకుండానే ఎలా వెళ్లారని, ఈ విషయం తేలేవరకు మృతదేహాలను తీసుకెళ్లమంటూ మళ్లీ అందోళన చేశారు. మృతదేహాలను దించి శవాల గదిలోకి తరలించారు. మళ్లీ పోలీసులు కలగజేసుకుని, సర్దిచెప్పి మృతదేహాలను పోలీసు బందోబస్తు నడుమ బావోజీతండాకు తరలించి ఇద్దరు చిన్నారులను పూడ్చిపెట్టారు. కుమారి మృతదేహాన్ని దహనం చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు విలపించిన తీరు చూసి అక్కడివారంతా కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యంగా చిన్నారుల మృతదేహాలను చూసిన గ్రామస్తులంతా గుండెలవిసేలా రోదించారు. ఏం జరిగి ఉంటుంది? కారు ప్రమాదంలో డాక్టర్ ప్రవీణ్ గాయాలతో బయటపడటం, భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంపై కుమారి తల్లితండ్రులు అనుమానిస్తున్నారు. కొన్నేళ్లుగా అల్లుడు తమ కుమార్తెను సరిగా చూసుకోవడం లేదని, వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కారుకు ప్రమాదం జరిగినప్పుడు తల్లీకూతుర్లు వెనుక సీట్లో చనిపోయి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత సమీపంలోని హరియాతండావాసులు అక్కడికి చేరుకునే సరికి ప్రవీణ్ ముందు సీట్లో, కుమారి, ఇద్దరు చిన్నారులు వెనుక సీట్లు మృతి చెంది ఉన్నారని గుర్తించారు. కారు ముందు భాగం చెట్టును ఢీకొడితే వెనుక ఉన్న వాళ్లు ఎలా మృతిచెందారనే చర్చ సాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు విషయం తెలుస్తుందని, కారులో ఎవరు ఎక్కడ కూర్చున్నారో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, కారు ప్రమాదంలో గాయపడిన బోడా ప్రవీణ్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
విషాదం: వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి
సాక్షి, ఖమ్మం: వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక మూల వరుస ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఏ వీధిలో చూసిన గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపిస్తున్నాయి. రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెంటుకుంటున్నాeయి. అంబర్‌పేట ఘటన మరవకముందే ఖమ్మం జిల్లాలో కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. ఈ విషాదం రఘునాథపాలెం పుఠానితండాలో సోమవారం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు బానోతు భరత్(5) పై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి.. మీదపడి కరవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తల్లిదండడ్రులు చిన్నారిని ఖమ్మంలోని రెండు, మూడు ఆసుపత్రులకు తీసుకువెళ్లగా సిరియస్‌గా ఉండటంతో ఎవరూ ఆడ్మిట్ చేసుకోలేదు. దీంతో.. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కాగా బానోతు రవీందర్, సంధ్య దంపతులకు భరత్ చిన్న కుమారుడు. బాలుడు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కార్పొరేటర్‌పై దాడికి యత్నం.. కారు దహనం
సాక్షి, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ ధరావత్ రామ్మూర్తి నాయక్‌పై రఘునాథపాలెం మండలం కైకొండాయిగూడెం గ్రామంలో మంగళవారం దాడి యత్నం జరగడం, అతడి ఫార్చునర్ కారును తగలబెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గత నెల 18వ తేదీన కైకొండాయిగూడెంకు చెందిన తేజావత్ ఆనంద్(23) అనే యువకుడు బైపాస్ రోడ్డు వెంట గల కార్పొరేటర్ రామ్మూర్తి ఫంక్షన్హాల్లో వెల్డింగ్ పనులకు వెళ్లి..అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఖమ్మంరూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో కార్పొరేటర్‌కు, మృతుడి కుటుంబ సభ్యులకు మధ్య చర్చలు జరగ్గా విఫలమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం తన డివిజన్ పరిధిలోని కైకొండాయిగూడెం హైస్కూల్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించి..ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు అడ్డగించగా..కోపోద్రిక్తుడైన కార్పొరేటర్ అసభ్యపదజాలంతో దూషించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు కార్పొరేటర్‌పై దాడికి ప్రయత్నించగా ప్రాణభయంతో..పాఠశాలలోని ఓ గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. స్థానికులు బయటి నుంచి తాళం వేసేశారు. అక్కడ ఏం జరుగుతుందోననే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన కుమారుడి మృతికి కారణాలు తెలపాలని తల్లి తేజావత్ విజయ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కార్పొరేటర్ రామ్మూర్తి సైతం తనపై దాడి యత్నం, కారు దహనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు ధ్వంసం, దహనం ఇలా.. పోలీసులు అక్కడికి చేరుకుని రామ్మూర్తి నాయక్‌ను, స్థానిక గ్రామ పెద్ద గుర్రం వెంకటరామయ్యతో కలిసి బందోబస్తు నడుమ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత టూ టౌన్ సీఐ గోపి ఆందోళనకారులను సముదాయించి కార్పొరేటర్ కారును డ్రైవర్ ద్వారా పంపిస్తుండగా..ఆందోళనకారులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. భయాందోళన చెందిన డ్రైవర్ దిగి పారిపోగా..ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. పోలీసుల సమాచారంతో ఫైరింజన్ అక్కడికి చేరుకోగా..అప్పటికే దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. ఒక ఏసీపీ, ముగ్గురు సీఐలు, పోలీసు బలగాలతో ఉన్న సమయంలోనే కారును తగలబెట్టడం చూస్తే గ్రామస్తుల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు. గది నుంచి రామ్మూర్తినాయక్‌ను తరలిస్తున్న పోలీసులు (వృత్తంలో వ్యక్తి) 3గంటలు భయం..భయం: బడిలో హడలిన ఉపాధ్యాయులు గొడవతో కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కైకొండాయిగూడెం ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిలోకి వెళ్లి తల దాచుకున్నారు. గ్రామస్తులు వందల సంఖ్యలో అక్కడ గుమికూడడడంతో ఆన్లైన్ క్లాసుల కోసం వచ్చిన ఉపాధ్యాయులు కూడా భయంతో మరో గదిలోకి వెళ్లగా..అందులోకే రామ్మూర్తి నాయక్ వెంట వచ్చిన గుర్రం వెంకట్రామయ్య కూడా వెళ్లి దాక్కున్నాడు. పరిస్థితిని హెచ్ఎం డీఈఓకు ఫోన్లో వివరించారు. ఆ తర్వాత డయల్ 100కు చేస్తే అది గుంటూరుకు కలిసింది. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నాక వీరంతా బయటకు వచ్చారు. కార్పొరేటర్‌ను ప్రశ్నించడం, దాడికి యత్నం, దాక్కోవడం, గ్రామంలో కారు ధ్వసం ఇలా..ఉదయం 10:30నుంచి మధ్యాహ్నం 2వరకు ఉద్రిక్తత నెలకొంది. -
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి !
రఘునాధపాలెం, న్యూస్‌లైన్: ఆభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిపై కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు లైగింకదాడికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునేలా ఒక వికలాంగుడు చిన్నారిని ముద్దాడుతున్నట్లు నటించి.. తన మూడుచక్రాల బండిపై చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి ఈఘోరానికి ఒడిగట్టాడు. దారుణమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం మంచుకొండలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. మిట్టపల్లి శివ, శ్రీలత దంపతులకు ఇద్దరు సంతానం. శివ సెంట్రింగ్ పనికోసం చెన్నై వెళ్లగా.. ఇద్దరు కూతుర్లతో తల్లి మంచుకొండలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. వారి ఇంటికి సమీపంలోనే తోట నర్సింహరావు అనే వికలాంగుడు వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడు. శివ కూతుర్లను తరచూ తన మూడు చక్రాల బండిపై తిప్పుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా పెద్ద కూతురు(4)ను బండిపై ఎక్కించుకుని ఇంటికి దూరంగా చీకటి ప్రాంతంలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని గ్రామస్తులు చెపుతున్నారు. ఇంట్లో అడుకుంటున్న కూతురు కనిపించకపోవడంతో తల్లి ఇంటిపక్క వాళ్లను ఆరా తీసింది. నర్సింహరావు తన బండిపై చిన్నారిని తీసుకెళ్లాడని చెప్పడంతో ఆమె వెతుక్కుంటూ వెళ్తుండగా, దూరంగా పాప ఏడుపు వినిపించింది. అక్కడికి వెళ్లే సరికి మద్యం మత్తులో తన వంటిపై వస్త్రాలు లేకుండా పడిఉన్న నరిసింహరావును, పక్కనే ఏడుస్తున్న చిన్నారిని గుర్తించారు. నరిసింహరావును కొట్టి అక్కడే తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోరం చూసిన తల్లి శ్రీలత పిట్స్ వచ్చి పడిపోవడంతో ఆమెను కూడా 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని ఎస్ఐ గణేష్ స్టేషన్‌కు తరలించారు. కామాంధుఢిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.