పథకం ప్రకారం జరిగిన హత్యా?
నిజంగానే ప్రమాదం జరిగిందా?
పోలీసుల పర్యవేక్షణలో
తల్లీ, కూతుర్ల అంత్యక్రియలు
రఘునాథపాలెం: మండలంలోని హరియాతండా సమీపంలో మంచుకొండ – పంగడి ప్రధాన రహదారి పక్కన చెట్టును ఢీకొన్న కారు ప్రమాదంలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు మృతిచెందిన విషయం విదితమే. కానీ, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పథకం ప్రచారం జరిగిన హత్యా? లేక నిజంగానే ప్రమాదం జరిగిందా? అనే అంశంపై పలువురు పలు రకాల వాదనలు వినిపిస్తున్నారు. మంగళవారం రాత్రి కారు ప్రమాదంలో దుర్మరణం చెందిన తల్లీకూతుర్ల అంత్యక్రియలు బుధవారం మండలంలోని బావోజీతండాలో పోలీసుల సమక్షంలో నిర్వహించారు. ఆది నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న మృతురాలి తండ్రి, హరిసింగ్, తల్లి పద్మ, సోదరుడు, సోదరితో పాటు కుటంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేశారు.
మృతురాలి భర్త, ఫిజియోథెరపిస్ట్ అయిన బోడా ప్రవీణ్ కారణమని, ఆయన్ను తీసుకొచ్చిన తర్వాతనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని భీష్మించారు. మరో యువతితో వివాహేతర సంబంధం నెరుపుతున్న ప్రవీణ్‌ను భార్య కుమారి ప్రశి్నస్తున్న నేపథ్యంలోనే తల్లీ కూతుర్లను హతమార్చి యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తున్నాడని వందలాది మంది ఆస్పత్రికి చేరుకుని నిరసన తెలిపారు. ప్రవీణ్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రఘునాథపాలెం సీఐ శ్రీహరి, ఎస్‌ఐలు, పోలీసులు జోక్యం చేసుకొని పోస్టుమార్టం నివేదిక అనంతరం విచారణ చేపట్టి చర్యలు చేపడుతామని మృతుల కుంటుంబ సభ్యులకు నచ్చజెప్పి పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ప్రవీణ్ తరఫు బంధువులు సైతం అక్కడికి వచ్చేందుకు భయపడ్డారు. సాయంత్రం 4 గంటల తర్వాత మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బావోజీతండాకు తరలించేందుకు వాహ నం ఎక్కించారు. కాగా, పోస్టుమార్టంలో ఏం తేలిందనే విషయం డాక్టర్లు చెప్పకుండానే ఎలా వెళ్లారని, ఈ విషయం తేలేవరకు మృతదేహాలను తీసుకెళ్లమంటూ మళ్లీ అందోళన చేశారు. మృతదేహాలను దించి శవాల గదిలోకి తరలించారు. మళ్లీ పోలీసులు కలగజేసుకుని, సర్దిచెప్పి మృతదేహాలను పోలీసు బందోబస్తు నడుమ బావోజీతండాకు తరలించి ఇద్దరు చిన్నారులను పూడ్చిపెట్టారు. కుమారి మృతదేహాన్ని దహనం చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు విలపించిన తీరు చూసి అక్కడివారంతా కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యంగా చిన్నారుల మృతదేహాలను చూసిన గ్రామస్తులంతా గుండెలవిసేలా రోదించారు.
ఏం జరిగి ఉంటుంది?
కారు ప్రమాదంలో డాక్టర్ ప్రవీణ్ గాయాలతో బయటపడటం, భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంపై కుమారి తల్లితండ్రులు అనుమానిస్తున్నారు. కొన్నేళ్లుగా అల్లుడు తమ కుమార్తెను సరిగా చూసుకోవడం లేదని, వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కారుకు ప్రమాదం జరిగినప్పుడు తల్లీకూతుర్లు వెనుక సీట్లో చనిపోయి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత సమీపంలోని హరియాతండావాసులు అక్కడికి చేరుకునే సరికి ప్రవీణ్ ముందు సీట్లో, కుమారి, ఇద్దరు చిన్నారులు వెనుక సీట్లు మృతి చెంది ఉన్నారని గుర్తించారు.
కారు ముందు భాగం చెట్టును ఢీకొడితే వెనుక ఉన్న వాళ్లు ఎలా మృతిచెందారనే చర్చ సాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు విషయం తెలుస్తుందని, కారులో ఎవరు ఎక్కడ కూర్చున్నారో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, కారు ప్రమాదంలో గాయపడిన బోడా ప్రవీణ్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment