వడ్లగింజలో బియ్యపుగింజ
అక్షర తూణీరం
‘‘స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావ స్తోంది. అయినా మనలో దేశభక్తి మొలకెత్తలేదు. ఇది ఎప్పటికి పెరిగి పెద్దదై ఫలించేను?’’ అం టూ ఒక పెద్దాయన వాపోయాడు. ఇలాంటి నిట్టూర్పులు విన్నప్పుడు నిస్పృహ కలుగుతుం ది. జరుగుతున్న వాటిని ప్రత్యక్షంగా కంటున్నపు డూ, వింటు న్నపుడూ మరీ దిగులేస్తుంది.
నిన్న మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాలు చూశాం. నిర్వహణకి నిమిషానికి పదివేలకు పైగా ఖర్చవుతుందంటారు. నిమిషం కాదు కదా, ఒక్కక్షణం కూడా సద్వినియోగం కాలే దు. భారతరత్న అబ్దుల్ కలాం మరణానికి సంతాప సూచకంగా సభ వాయిదా పడింది. ఆ ఒక్కరోజు మాత్రమే సద్వినియోగమయిం దనిపించింది. నిండు సభలో పెద్దలుగా పేరు బడ్డవారు అలా ఎందుకు అరుచుకుంటున్నా రో, కరుచుకుం టున్నారో ప్రజలకు అర్థం కాదు. చాలా రికామిగా ఉన్న సీనియర్ సిటిజ నులు పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలు చూ స్తూ బీపీలు పెంచుకుంటున్నారు. మధ్యత రం, యువతరం ఇలాంటి ప్రసారాలు చూడడం, ఇలాంటివి చదవడం ఎన్నడో మానేశారు. ప్రశాంతంగా ఉన్నారు.
ఒకప్పుడు ఎన్.టి.ఆర్. ఉన్నట్టుండి ‘కేంద్రం మిథ్య’ అని ఒక మాట లోకం మీదకు విసిరితే అందరూ కలవరపడ్డారు. అలా అనకూడదన్నారు. అపరాధమన్నారు. ఇప్పుడు సామాన్యుడికెలా అనిపిస్తోంది? అందరూ కలసి అల్లరి చేస్తున్నారు. ఆడుకుంటున్నారు. అసలు సమస్యల్ని కలసిక ట్టుగా కూడబలుక్కుని మరీ దాటవేస్తున్నారన్నది సామాన్యుడి అభిప్రా యం. ‘‘మనకి డిక్టేటరే తగు’’ అని కోట్లాది మంది తమలో తాము నిత్యం తీర్మానించుకుంటున్నారు. ఇది శుభసూచకం కాదు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడానికి మాత్రమే పార్లమెంటు క్షేత్రంగా మిగిలింది.
ప్రజాస భలు అవతరించి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటి వరకూ ‘స్పీకర్’కి సరైన అధికార స్వరం రాలేదు. సందర్భం వచ్చినపుడు ఒక రోజో, పది రోజులో సభ నుం చి సస్పెండ్ చేయడం కాదు, శాశ్వతంగా సభ్యత్వాన్ని రద్దు చేయగల అధి కారం స్పీకర్‌కి ఉండాలి. సభా నిర్వహణకి సంబంధించి అనేక సవరణలు చేసుకోవాలి. అడ్డుకున్న వారిని సభలోంచి బయటకు పంపడం కాదు, వారిని సభలోనే ఉంచి వారి సీట్లల్లో సమున్నతంగా నిలబెట్టా లి. వారు దేశప్రజలకు ఎత్తుగా కనిపించాలి. సభను ఎలాంటి లావాదేవీలు జరగకుండా చేసినందుకుగాను, సభ్యులందరికీ మూడు నెలల గౌరవ వేతనాన్ని కత్తిరించి, నిర్వహణ ఖర్చుని కొంతైనా పూడ్చాలి. ఇలాంటి సంస్క రణలను చేస్తే సరే, లేదంటే మరో మంచి మా ర్గం ఉంది. అది పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారా లను నిలిపివేయడం. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మర్నాడు కావలసినవారు చక్కని పార్లమెంటరీ భాషలో సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుసుకుంటారు.
ఇది ఆసేతు హిమాచలం జెండా పండుగ జరుపుకునే మహోజ్వల ఘట్టం. గౌరవ సభ్యులు దేశమాత సాక్షిగా ఒక్కక్షణం ఆలోచించండి. ఆశ తో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజల కోసం ఏమి చేశాం, ఏమి సాధించాం, ఏమి శోధించామని ఒక్కసారి ప్రశ్నించుకోండి. అప్పటికీ మీకు నిద్ర, ఆకలి మామూలుగానే ఉంటే మీరు మీ ఓటర్ల రుణం తీర్చుకున్నట్టే.
సమున్నతంగా ఎగిరే జెండా మన జాతి గౌరవాన్ని సదా కాపాడు గాక! దేశాభిమానాన్ని రగుల్చు గాక! భారతదేశం వర్థిల్లు గాక! జైహింద్.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)