Railway Inquiry
-
పట్టాలు తప్పిన ‘సీమాంచల్’
సోన్పూర్(బిహార్): బిహార్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 29 మంది గాయాలపాలయ్యారు. బిహార్‌లోని జోగ్బనీ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్‌కు చేరాల్సిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం వేకువజామున పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ‘నంబర్ 12487 జోగ్బనీ–ఆనంద్ విహార్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ కిషన్‌గంజ్ జిల్లా జోగ్బనీ నుంచి వస్తుండగా తెల్లవారు జామున 4 గంటల సమయంలో రైలు పట్టాల్లో పగుళ్ల కారణంగా సహదాయ్ బుజుర్గ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక జనరల్ బోగీ, ఒక ఏసీ కోచ్, మూడు స్లీపర్ కోచ్‌లతోపాటు మరో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి’ అని రైల్వే శాఖ పేర్కొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 29 మంది క్షతగాత్రులయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ముజఫర్‌పూర్, పట్నాలోని ఆస్పత్రులకు తరలించాం. మిగతా వారికి వైశాలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం’ అని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పని బోగీలకు మరికొన్నిటిని జత చేసి ఉదయం 10 గంటల సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఈస్ట్ జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ లతీఫ్ ఖాన్‌ను రైల్వే శాఖ ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. -
రైలులో కలుషితాహారం.. 40 మందికి అస్వస్థత
ఖరగ్‌పూర్/పశ్చిమ బెంగాల్: పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఐఆర్సీటీసీ సరఫరా చేసిన అల్పాహారం తిని నలభై మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 14మంది ఖరగ్‌పూర్‌లోని రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పూరి నుంచి బయల్దేరిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్ దాటిన తర్వాత అల్పాహారంగా ఆమ్లెట్, బ్రెడ్ తీసుకున్నామని బాధితులు చెప్పారు. అల్పాహారం తీసుకున్న అనంతరం వాంతులు, కడుపులో నొప్పి మొదలైందని వారు తెలిపారు. రైలు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా ఖరగ్‌పూర్ రైల్వే ఆస్పత్రిలో చేర్పించారని పేర్కొన్నారు. కాగా, రైలు ప్రయాణంలో నాణ్యమైన సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పే రైల్వే శాఖ ఈ విషయం వెలుగు చూడడంతో చర్యలకు ఉపక్రమించింది. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఐఆర్సీటీసీ పంపిణీ చేసిన బ్రేక్‌ఫాస్ట్ తిని 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 14 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నార’ని ఆగ్నేయ రైల్వే జోన్ ప్రజా సంబంధాల అధికారి సంజయ్ ఘోష్ తెలిపారు. ‘ఆహార పదార్థాల నమూనాలు సేకరించాం. బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామ’ని ఖరగ్‌పూర్ డివిజన్ మేనేజర్ రాబిన్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెండర్ వద్ద కాకుండా బయటి వ్యక్తుల నుంచి ఆహార పదార్థాలేవైనా కొన్నారా అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. భోజన వసతి అనుకున్నాం.. ఆస్పత్రి పాలయ్యాం ‘పూరి పర్యటనకు వచ్చాం. భోజన వసతి ఉంటుందని శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు పయనమయ్యాం. కానీ ఇలా ఆస్పత్రి పాలవుతామనుకోలేద’ని బెంగాల్‌కు చెందిన రూపమ్ సేన్ గుప్తా వాపోయారు. రైలులో ఐఆర్సీటీసీ సరఫరా చేసిన ఆహారాన్నే కొన్నామని ఆయన తెలిపారు. -
ఎస్ఎంఎస్ తో రైల్వే సమాచారం
రైల్వే ఎంక్వైరీకి ఫోన్ చేసి సరైన సమాచారం పొందలేక ఇబ్బంది పడుతున్నారా? మీరు వెళ్లాలనుకుంటున్న ట్రైన్ పేరు, నంబరు, టైమ్ టేబుల్, టికెట్ ధర, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే 139 నంబరుకు ఎస్ఎమ్మెస్ చేసి సులభంగా సమాచారం పొందవచ్చు. ఎస్సెమ్మెస్ ఎలా చేయాలి? పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. - సాక్షి, ఒంగోలు ఆన్లైన్ విధానంలో ట్రైన్ పేరు, ట్రైన్ నంబరు కోసం... టీఎన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ పేరు లేక ట్రైన్ నంబరు ఎంటర్ చేయండి. ఉదా: TN <TRIAN NAME> OR TN <TRIAN NUMBER> ఆ పేరున ఉన్న అన్ని ట్రైన్ల నంబర్లు, ట్రైన్ల పేరు మీ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. టికెట్ ధర తెలుసుకోవాలంటే... ఫేర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు స్పేస్ ప్రయాణం తేదీ, నెల, సంవత్సరం టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎక్కే స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ దిగదలుచుకున్న స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ ఇచ్చి ప్రయాణించే తరగతి స్పేస్ కేటగిరిని ఎంటర్ చేయాలి. ఉదా: FARE <TRIAN NUMBER> <DOJ-*-*-*-D-D-MMYY> <STATION FROM: STD CODE > <STATION TO: STD CODE> <CLASS> <QUOTA> ఇక్కడ మీకు ట్రైన్ పేరు, ఎక్కడి నుంచి ఎక్కడికి, అన్ని తరగతులు ధరలు కనిపిస్తాయి. ట్రైన్ టైమ్ టేబుల్ కావాలంటే... టైమ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు ఎంటర్ చేయాలి. ఉదా: TIME <TRIAN NUMBER> ట్రైన్ పేరు, ఎక్కడి నుంచి బయలు దేరుతుంది, ఎక్కడికి వెళ్తుంది, వారంలో ఎన్ని సార్లు అందుబాటులో ఉంటుంది, ఏ తరగతులు అందుబాటులో ఉంటాయి తదితర వివరాలు మీకు తెలుస్తాయి. ట్రైన్లో సీట్ ఉందా లేదా, వెయిటింగ్ లిస్ట్ తెలుసుకోవాలంటే.. సీట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబర్ స్పేస్ ప్రయాణం తేదీ నెల సంవత్సరం టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎక్కే స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ దిగదలుచుకున్న స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ ఇచ్చి ప్రయాణించే తరగతి స్పేస్ కేటగిరిని ఎంటర్ చేయాలి. ఉదా: EAT <DOJ-*-*-*-D-D-MMYY> <STATION FROM: STD CODE > <STATION TO: STD CODE> <CLASS> <QUOTA> ఇక్కడ మీకు అన్ని తరగతులలో అందుబాటులో ఉన్న వివరాలు, వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉందో తెలుస్తుంది. ట్రైన్ రాకపోకల సమయం కోసం ఎడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు స్పేస్ స్టేషన్ ఎస్టీడీ కోడ్ ఎంటర్ చేయాలి. ఉదా: AD <TRIAN NUMBER> <STATION STD CODE'> మీరు తెలుసుకోవాలనుకున్న ట్రైన్ టైమ్ టేబుల్ తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ ఎంక్వైరీ కోసం.. పీఎన్ఆర్ స్పేస్ ఇచ్చి పది సంఖ్యల పీఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేయాలి. ఉదా: PNR <PNR TEN DIGIT NUMBER> మీరు రిజర్వ్ చేసుకున్న టికెట్ స్టేటస్ తెలుస్తుంది.