సోన్‌పూర్(బిహార్): బిహార్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 29 మంది గాయాలపాలయ్యారు. బిహార్‌లోని జోగ్‌బనీ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్‌కు చేరాల్సిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం వేకువజామున పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ‘నంబర్ 12487 జోగ్‌బనీ–ఆనంద్ విహార్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ కిషన్‌గంజ్ జిల్లా జోగ్‌బనీ నుంచి వస్తుండగా తెల్లవారు జామున 4 గంటల సమయంలో రైలు పట్టాల్లో పగుళ్ల కారణంగా సహదాయ్ బుజుర్గ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక జనరల్ బోగీ, ఒక ఏసీ కోచ్, మూడు స్లీపర్ కోచ్‌లతోపాటు మరో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి’ అని రైల్వే శాఖ పేర్కొంది.
ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 29 మంది క్షతగాత్రులయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ముజఫర్‌పూర్, పట్నాలోని ఆస్పత్రులకు తరలించాం. మిగతా వారికి వైశాలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం’ అని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పని బోగీలకు మరికొన్నిటిని జత చేసి ఉదయం 10 గంటల సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఈస్ట్ జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ లతీఫ్ ఖాన్‌ను రైల్వే శాఖ ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment