కాశీలోనే అంత్యక్రియలు
కొవ్వూరు/నిడదవోలు : బీహార్‌లోని కై మూర్ జిల్లా మహన్య ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఆరుగురు జిల్లా వాసులకు కాశీలోనే సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దుర్ఘటనలో కొవ్వూరుకు చెందిన మాచవరపు సత్యనారాయణ (58),ఆయన తల్లి పద్మావతి(72), పెద కుమారుడు మాచవరపు పవన్ కుమార్ (23), నిడదవోలు పట్టణం రాయపేటకు చెందిన అత్తిలి శ్రీరామ్ (65), ఆయన భార్య సరస్వతీ దేవి(62), ఆయన సోదరి రుక్మిణీ (72) మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే.
వీరి మృతదేహాలకు మహన్య ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఉదయం పోస్టుమార్టం పూర్తిచేసిన అధికారులు సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబీకులు వారి మృతదేహాలను కాశీకి తీసుకెళ్లి రాత్రి అక్కడే అంత్యక్రియలు జరిపారు. ఇదే ప్రమాదంలో త్రీవంగా గాయపడిన సత్యనారాయణ భార్య లక్ష్మీ కళావతిని కాశీ నుంచి విమానంలో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు టికెట్ తీయగా, తీవ్రగాయాలతో ఉన్న ఆమెను విమానంలో తరలించేందుకు ఎయిర్ పోర్టు అధికారులు నిరాకరించడంతో వారణాసిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమె కాలు, పక్కటెముకలకు విరిగినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కళావతికి అక్కడి వైద్యులు ఒక ఆపరేషన్ చేసినట్లు పేర్కొన్నారు. ఈమెకు మరో ఆపరేషన్ చేయాల్సి ఉండడంతో వైద్యులు హైదరాబాద్ తీసుకువెళ్ల వచ్చునని సూచించినట్లు వివరించారు.