railway police station
-
యువకుడు ఆత్మహత్య
కడప అర్బన్ : కడప రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో కడప–రాజంపేట మార్గం మంటపంపల్లె సమీపంలో అల్లం రెడ్డెయ్య (22) తాను ప్రేమించిన అమ్మాయిని కాదని, పెద్దలు మరో అమ్మాయితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారని రైలు కిందపడి బుధవారం మృతి చెందాడు. రైల్వే ఎస్ఐ శ్యాం సుందర్‌రెడ్డి, బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజంపేట పరిధిలోని మన్నూరుకు చెందిన అల్లం రెడ్డెయ్య వెంకట రమణ, సరస్వతిల ఏకైక కుమారుడు. ఇతను తన తండ్రితోపాటు కువైట్‌లో ఉండి ఇటీవలే స్వదేశానికి వచ్చాడు. యువకుడు ఓ యువతిని ప్రేమించసాగాడు. ఆ యువతిని కాదని, తల్లిదండ్రులు తాము కుదిర్చిన అమ్మాయి తో వివాహం చేయడానికి ప్రయత్నించారు. 24 గంటల్లో వివాహం జరుగుతుందనగా ఈనెల 19వ తేదీ సాయంత్రం తనకు డ్రస్ టైట్‌గా ఉందని, మార్చుకుని వస్తానని ఇంటి నుంచి మోటారుసైకిల్‌పై వెళ్లాడు. రాత్రి పొద్దుపోయే వరకు రాకపోయేసరికి తల్లిదండ్రులు, బంధువులకు అనుమానం వచ్చింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే పోలీసులు మోటారు సైకిల్ మంటపంపల్లె సమీపంలో పడి ఉందని, ఆ నెంబరు ప్రకారం అడ్రస్ తీసుకుని విచారించారు. మోటారు సైకిల్ సమీపంలోనే ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందడంతో దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడు తమ కుమారుడు రెడ్డెయ్యేనని తల్లిదండ్రులు గుర్తించారు. బోరున విలపించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రైలు పట్టాలు రక్తసిక్తం...
కాచిగూడ/ సికింద్రాబాద్: నగరంలోని రైలుపట్టాలు మంగళవారం రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో పట్టాలు దాటుతున్న ఇద్దరిని రైలు ఢీకొనడంతో మృతి చెందారు. రైలు ఢీకొని మేస్త్రీ మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైల్వే సీఐ లింగన్న కథనం ప్రకారం... వనస్థలిపురానికి చెందిన మేస్త్రీ చిలుక శ్రీరాం(45) కాచిగూడ - మలక్‌పేట రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో ఆటో డ్రైవర్.... అత్తవారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ సాహెబ్రావు కథనం ప్రకారం... నేరేడ్మెట్ వినాయక్‌నగర్‌కు చెందిన బుక్క లక్ష్మణ్ (35) ఆటో డ్రైవర్. ఇతను మద్యానికి బానిస కావడంతో ఆరేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయిన భార్య కాపురానికి రావడంలేదు. కాగా, లక్ష్మణ్ సోమవారం మరోమారు అత్తగారింటి వెళ్లి భార్యను కాపురానికి రావాలని కోరగా ఆమె ససేమిరా అంది. తిరుగుప్రయాణంలో పీకలదాకా మద్యం తాగిన లక్ష్మణ్ మౌలాలి అమ్ముగూడ రైల్వేస్టేషన్ల పరిధిలో రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. -
రైళ్లలో దొంగతనాలకు అడ్డుకట్ట
తణుకు అర్బన్, న్యూస్‌లైన్ : ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ ద్వారా రైళ్లలో 90 శాతం మేర దొంగతనాలకు అడ్డుకట్ట వేసినట్లు విజయవాడ డివిజన్ రైల్వే ఎస్పీ డాక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. రైల్వే పోలీస్స్టేషన్ల తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన తణుకు స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని క్రైం జోన్ ఏరియాలను గుర్తించి పూర్తి భద్రత ఏర్పాటు చేశామన్నారు. రైళ్లను ఆపి దొంగతనాలకు పాల్పడే ముఠాలపై ప్రత్యేక దృష్టిసారించామని, ప్రతి రైల్లో గస్తీకి నలుగురు ఆర్మీ పోలీసులను వినియోగిస్తున్నట్లు తెలిపారు . గత సంవత్సరం విజయవాడ డివిజన్ పరిధిలో రూ.14 లక్షల విలువైన నగదు, వస్తువులను దొంగలు అపహరించగా ఈ ఏడాది ఆ మొత్తం రూ. 4 లక్షలకు తగ్గిందని రైల్వే ఎస్పీ చెప్పారు. గత తొమ్మిది నెలల్లో వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న దొంగల నుంచి రూ.1.50 కోట్లు విలువ చేసే 4 కేజీల 500 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామన్నారు . డివిజన్ పరిధిలో అధికారులు, సిబ్బంది 820 మంది ఉండాల్సి ఉండగా 530 మంది ఉన్నారని, వారందరూ బాధ్యతాయుతంగా పనిచేయడంతో క్రైం రేటు తగ్గిందన్నారు. రైల్వే డీఎస్పీ ఎస్వీవీ ప్రసాదరావు, భీమవరం సీఐ దుర్గారావు, తాడేపల్లిగూడెం, భీమవరం ఎస్సైలు ఆర్ఎస్ శ్రీనివాసరావు, ఏఎల్ఎస్ రవికుమార్, తణుకు హెచ్‌సీ ఏవీ ప్రసాదరావు ఆయన వెంట ఉన్నారు.