తణుకు అర్బన్, న్యూస్‌లైన్ :
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ ద్వారా రైళ్లలో 90 శాతం మేర దొంగతనాలకు అడ్డుకట్ట వేసినట్లు విజయవాడ డివిజన్ రైల్వే ఎస్పీ డాక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. రైల్వే పోలీస్‌స్టేషన్‌ల తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన తణుకు స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని క్రైం జోన్ ఏరియాలను గుర్తించి పూర్తి భద్రత ఏర్పాటు చేశామన్నారు. రైళ్లను ఆపి దొంగతనాలకు పాల్పడే ముఠాలపై ప్రత్యేక దృష్టిసారించామని, ప్రతి రైల్లో గస్తీకి నలుగురు ఆర్మీ పోలీసులను వినియోగిస్తున్నట్లు తెలిపారు
. గత సంవత్సరం విజయవాడ డివిజన్ పరిధిలో రూ.14 లక్షల విలువైన నగదు, వస్తువులను దొంగలు అపహరించగా ఈ ఏడాది ఆ మొత్తం రూ. 4 లక్షలకు తగ్గిందని రైల్వే ఎస్పీ చెప్పారు. గత తొమ్మిది నెలల్లో వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న దొంగల నుంచి రూ.1.50 కోట్లు విలువ చేసే 4 కేజీల 500 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామన్నారు
.
డివిజన్ పరిధిలో అధికారులు, సిబ్బంది 820 మంది ఉండాల్సి ఉండగా 530 మంది ఉన్నారని, వారందరూ బాధ్యతాయుతంగా పనిచేయడంతో క్రైం రేటు తగ్గిందన్నారు. రైల్వే డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాదరావు, భీమవరం సీఐ దుర్గారావు, తాడేపల్లిగూడెం, భీమవరం ఎస్సైలు ఆర్‌ఎస్ శ్రీనివాసరావు, ఏఎల్‌ఎస్ రవికుమార్, తణుకు హెచ్‌సీ ఏవీ ప్రసాదరావు ఆయన వెంట ఉన్నారు.
రైళ్లలో దొంగతనాలకు అడ్డుకట్ట
Published Fri, Sep 13 2013 2:24 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement