సాక్షి, పశ్చిమగోదావరి : ఎన్నికల ఫలితాలపై కాసిన పందెం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పందెం ఓడిపోవడంతో ఎదుటి పార్టీ ఒత్తిడిని తట్టుకోలేని అతడు బలవన్మరణానికి యత్నించడం కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన తణుకులో చోటుచేసుకుంది. తణుకుకు చెందిన ఇంటూరి సందీప్(30) ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని రూ. 50 లక్షలు పందెం కట్టాడు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం నేపథ్యంలో అతడు పందెం ఓడిపోయాడు. దీంతో తన వద్ద రూ. 20 లక్షలు మాత్రమే ఉన్నాయని.. వాటితో సర్దుకోవాల్సిందిగా రెండవ పార్టీతో మొరపెట్టుకున్నాడు. కానీ వాళ్లు మొత్తం డబ్బులు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేయడంతో ఒత్తిడి తట్టుకోలేక.. నిన్న రాత్రి పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
కాగా సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ లగడపాటి రాజగోపాల్, యెల్లో మీడియా మాత్రం టీడీపీ గెలుపు ఖాయమంటూ తప్పుడు సర్వేలను ప్రజలపై రుద్దారు. దీంతో సందీప్ వంటి ఎంతో మంది వ్యక్తులు వీరి మాటలు నమ్మి..టీడీపీ విజయంపై పందేలు కాసి దారుణంగా నష్టపోయారు. ఇక ఈ ఎన్నికల్లో రికార్డు విజయం సొంతం చేసుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment