పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు, ఇన్‌సెట్‌లో నిందితుడు కోర్ల శ్రీనివాసు
సాక్షి, తణుకు (పశ్చిమ గోదావరి): ఫర్నిచర్ స్కీం పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఆపై బోర్డు తిప్పేసిన సంఘటన తణుకు పట్టణంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో వేల్పూరు రోడ్డులో శ్రీ ఫర్నీచర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అధినేత కోర్ల శ్రీనివాసుపై పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీనివాస్ ఏజెంట్లు, లబ్ధిదారుల నుంచి రూ. కోటి పైగా వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. కేవలం స్కీం పేరుతోనే కాకుండా పెద్ద ఎత్తున అప్పులు చేసి ఊరు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నిందితుడి ఆచూకీ కోసం అటు పోలీసులు ఇటు లబ్ధిదారులు గాలిస్తున్నారు. ఆదివారం రాత్రి శ్రీనివాసు భార్య ప్రసన్నను బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత...
దాదాపు రూ. కోటికి పైగా వసూళ్లకు పాల్పడి అనంతరం ఐపీ ప్రకటించిన కోర్ల శ్రీనివాసు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆయన భార్య ప్రసన్న ఆదివారం రాత్రి స్థానిక తేతలి వైజంక్షన్ వద్ద హైదరాబాదు బస్సు ఎక్కే ప్రయత్నంలో బాధితులు ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో ఘర్షణకు దిగిన బాధితులు ఆమెను తీసుకుని తణుకు రూరల్ పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న ఏజెంట్లు, బాధితులు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
కొందరు మహిళలు అయితే పెట్రోలు డబ్బా, పురుగుమందు డబ్బాలు చేతబట్టుకుని తాము ఆత్మహత్య చేసుకుంటామని బైఠాయించారు. ప్రసన్న ద్వారా నిందితుణ్ని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో పట్టణ ఎస్సై డి.రవికుమార్ రంగంలోకి దిగి శ్రీనివాసు భార్య ప్రసన్నను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే శ్రీనివాసుపై కేసు నమోదు చేశామని త్వరలో నిందితుణ్ని అరెస్టు చేస్తామని సీఐ చైతనక్యకృష్ణ తెలిపారు.
రూ. 12 లక్షలు కట్టాను
స్కీం పేరుతో ఫర్నీచర్ ఇతర వస్తువులు ఇస్తానని చెప్పడంతో నాతోపాటు మరికొందరితో స్కీంలో డబ్బులు కట్టించాను. ఇప్పటివరకు మొత్తం రూ. 12 లక్షలు శ్రీనివాసుకు చెల్లించాను. గత ఏప్రిల్‌లో బోర్డు తిప్పేసిన ఆయన ఊరు విడిచి వెళ్లిపోయాడు. దీంతో బాధితులంతా నాపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. నిందితుడి నుంచి సొమ్ములు రికవరీ చేసి ఆదుకోవాలి.
– రామానుజం కోదండరాం, బాధితుడు
ఆత్మహత్యే శరణ్యం
ఎంతో నమ్మించి నా దగ్గర స్కీం కోసమని చెప్పి రూ. 3.80 లక్షలు కట్టించుకున్నారు. నేనే కాకుండా మా చుట్టుపక్కల మహిళలతోపాటు సొమ్ములు కట్టించాను. కట్టిన సొమ్ములకు ఎలాంటి ఫర్నీచర్ ఇవ్వలేదు. శ్రీనివాసు పారిపోయిన నాటి నుంచి నాపై ఒత్తిడి పెరుగుతోంది. అతని వద్ద నుంచి సొమ్ములు రికవరీ చేయాలి. లేకపోతే ఆత్మహత్యే శరణ్యం.
– నమ్మి నాగలక్ష్మి, బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment