Railway zones
-
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడే ఉన్నాం : రైల్వే మంత్రి
-
రైల్వే జోన్ వస్తే ఏం జరుగుతుంది?
-
జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యం
సాక్షి, విశాఖపట్నం: ‘జోనూ రాదు.. గీనూ రాదు..’ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వ్యంగ్యాస్త్రం.. ‘నాకు ఐదు కేజీల బరువు తగ్గాలని ఉంది.. అవకాశం ఇస్తే జోన్ కోసం వారం రోజులు దీక్ష చేస్తా’ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ వెటకారం! ఇది గత జూన్‌లో ఢిల్లీలో తీరిగ్గా కూర్చుని విశాఖకు రైల్వేజోన్‌పై టీడీపీ ఎంపీలు మాట్లాడుకున్న మాటల వ్యవహారం. ఇలా హేళనగా మాట్లాడిన ఎంపీల గుంపులో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ సంభాషణను ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. పార్టీ ‘ఇమేజీ’ని ఇది బాగా డ్యామేజి చేస్తోందన్న భయంతో అప్పట్లో సీఎం నష్ట నివారణ చర్యలకు దిగారు. వెనువెంటనే ఎంపీలతో కౌంటర్లు ఇప్పించారు. తామేదో సరదాగా మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేశారని కొందరు, తాము అనని మాటలను జోడిం చారని ఇంకొందరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తమ ఎంపీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కుట్ర చేసి వీడియోలను బయటకు పంపారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తమ ఎంపీల పరువు మంటగలిపేందుకు బీజేపీలాంటి పార్టీలు కుతంత్రాలు చేస్తున్నాయని ఆక్రోశించారు. ఇలా నెపాన్ని ఇతరుల మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారు. ఇది చాలదన్నట్టు రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ జులై 4న ఆ పార్టీ ఎంపీలతో జ్ఞానాపురంలో ఒకరోజు దీక్ష చేయించారు. ఈ తీరు చూసి విశాఖ వాసులు విస్తుపోయారు. బాబు మనసులో మాటలే.. విశాఖకు రైల్వేజోన్‌పై టీడీపీ నేతలకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఆ పార్టీ ఎంపి జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. .చంద్రబాబునాయుడు మనసులోని మాటే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన మనస్సులో మాటలా బయట పెట్టారు. చంద్రబాబు ధర్మ పోరాటదీక్ష దొంగదీక్ష అని జేసీ మాటలను బట్టి ఆర్ధమవుతుంది. రైల్వేజోన్, ప్రత్యేకహోదా ఆంశాన్ని సర్వ నాశనం చేసినది చంద్రబాబే . ముఖ్యమంత్రి దిగజారుడు ధోరణి దీనితో ఆర్ధమవుతుంది. ఇదంతా నూటికి నూరు శాతం చంద్రబాబు ప్లానే. బాబుకే చిత్తశుద్ధి ఉంటే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి.– కొయ్య ప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు జేసీ క్షమాపణ చెప్పాలి విశాఖ రైల్వే జోన్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నోరు ఉంది కదాని మాట్లాడడం సరికాదు. విశాఖకు రైల్వేజోన్‌పై, ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి. ప్రత్యేక రైల్వే జోన్ వచ్చేంత వరకు పొరాటం చేస్తాం. జేసి వ్యాఖ్యలు చూస్తే, అవి చంద్రబాబు నాయుడే పలికించినట్టు అనుమానంగా ఉంది. – ఎన్. రవీంద్ర రెడ్డి, విశాఖపట్నం జేసీ నోట అవహేళన.. సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత విశాఖకు రైల్వే జోన్‌పై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఢిల్లీలో తాజాగా మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘విశాఖకు రైల్వే జోన్ వస్తే దమ్మిడీ ప్రయోజనం ఉండదు. జోన్ వస్తే రూ.10 కోట్ల భవనం, ఓ పది మంది గుమస్తాలు వస్తారు తప్ప ఇంకేమీ ఒరగదు. తెలిసో తెలియకో మా టీడీపీ నేతలంతా జోన్ కావాలి.. జోన్ కావాలి అంటూ నినాదాలు చేస్తున్నారు.’ అంటూ హేళనగా మాట్లాడారు. ఆ వేదికపై ఎనిమిది నెలల క్రితం జోన్‌పై వెటకారంగా మాట్లాడిన ఎంపీలు అవంతి శ్రీనివాస్, మురళీమోహన్‌లతో పాటు ఆ పార్టీ ఎంపీలు అశోక్‌గజపతిరాజు, ఎంపీలు రామ్మోహన్నాయుడు, సుజనా చౌదరి, మాగంటి బాబు, కనకమేడల రవీంద్రకుమార్ తదితరులున్నారు. ఉత్తరాంధ్రకు రావలసిన రైల్వే జోన్‌పై జేసీ అత్యంత హేయంగా మాట్లాడుతుంటే ఉత్తరాంధ్ర ఎంపీలు ఒక్కరంటే ఒక్కరూ స్పందించకుండా చోద్యం చూశారు. విశాఖకు రైల్వే జోన్‌పై టీడీపీకి, ఆ పార్టీ ఎంపీలకు ఎంతటి చిత్తశుద్ధి ఉందో తరచూ వారు చేస్తున్న వ్యంగ్యాస్త్రాలను బట్టి తేటతెల్లమవుతోందని విశాఖ వాసులు మండిపడుతున్నారు. -
ప్రత్యేక జోన్ అనుమానమే !
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు రెండు రైల్వే జోన్ల ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర విభజన బిల్లులో ప్రస్తావించారు. కానీ దీనికి రైల్వే శాఖ అంత సుముఖంగా లేదని తెలుస్తోంది. విభజన అంశం పూర్తిగా రాష్ట్రానికే సంబంధించింది కనుక.. దానిని ఆధారం చేసుకుని రైల్వే జోన్‌ను విభజించాల్సిన అవసరం లేదని ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారులు కేంద్రానికి స్పష్టం చేశారు. దీనికి దక్షిణ మధ్య రైల్వేనే ఉదాహరణగా చూపారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి ఐదు రాష్ట్రాల్లోని ప్రాంతాలు (పాక్షికంగా) వస్తున్నప్పటికీ పాలనాపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతోందని పేర్కొన్నారు. తూర్పుకోస్తా రైల్వే పరిధిలో ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలను ద.మ.రైల్వే పరిధిలో విలీనం చేయటమో, ఆ మూడింటిని కలిపి ఓ జోన్‌గా మార్చటమో చేయాలనే దీర్ఘకాల డిమాండును మరోసారి తెరపైకి తెచ్చిన సీమాంధ్ర ప్రాంత నేతలు.. ఆ మూడింటితోపాటు పూర్తి సీమాంధ్ర ప్రాంతాన్ని ఒక జోన్‌గా మార్చాలని ఇప్పుడు కోరుతున్నారు. వారిని సంతృప్తిపరిచే క్రమంలో కేంద్రం, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఈ అంశాన్ని చేర్చింది. అది కేవలం వారిని సంతృప్తి పరచడానికే పరిమితం అయ్యే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్రలో ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్తగా మరిన్ని ఓడరేవులు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తే ఆదాయాన్ని పెంచుకోవచ్చనేది నేతల వాదన. కానీ ఒకే జోన్‌గా ఉండి కూడా ఆ ఆదాయాన్ని అందిపుచ్చుకునే వీలుంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. కొత్త జోన్ ఏర్పాటు వల్ల సిబ్బంది సంఖ్య పెరిగి జీతాల ఖర్చు, మౌలిక వసతుల ఏర్పాటుకు ఖర్చు మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని వాదన. కోచ్ ఫ్యాక్టరీ తూచ్... తెలంగాణ ప్రాంతంలో కొత్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించే అంశాన్ని బిల్లులో చేర్చారు. కానీ ఇది కూడా కంటితుడుపు చర్యగానే కానుందని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు నాలుగేళ్లక్రితం వరంగల్ జిల్లా కాజీపేటలో రైల్వే వ్యాగన్ యూనిట్ ఏర్పాటుకు రైల్వే పచ్చజెండా ఊపింది. కానీ అది ఈరోజు వరకు కూడా కాగితాలకే పరిమితమైంది. రెండు దశాబ్దాల క్రితం ఇదే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరైనా.. దాన్ని నాటి రాజకీయ అవసరాల దృష్ట్యా రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పంజాబ్‌కు తరలించారు. దాని బదులే వ్యాగన్ యూనిట్‌ను మంజూరు చేసినా.. ఏర్పాటు చేయలేదు. ప్రధాని స్థాయిలో ప్రత్యేక సిఫారసు ఉన్న ప్రాంతాలకే కోచ్ ఫ్యాక్టరీ మంజూరవుతుంటుంది. సాధారణంగా రైల్వే మంత్రులుగా ఉన్నవారు తమ రాష్ట్రానికి వాటిని మంజూరు చేయించుకుంటారు. అలాంటిది ఏమాత్రం ఒత్తిడి తీసుకురాగలిగే రాజకీయ శక్తి లేని తెలంగాణ లాంటి ప్రాంతానికి అంతటి భారీ ప్రాజెక్టు రావటం దాదాపు అసాధ్యమని అంటున్నారు. గత బడ్జెట్లో.. రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలుకు కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావాలని తీవ్రంగా యత్నించినా కేంద్రం ససేమిరా అన్న విషయం తెలిసిందే. ప్రత్యేక ర్యాపిడ్ రైల్, రోడ్ అనుసంధానం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు ర్యాపిడ్ రైలు, రోడ్డు మార్గం ఏర్పాటుకు కేంద్రం ప్రత్యేక ప్రాజెక్టుకింద నిధులు మంజూరు చేస్తే అది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. దీన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సి ఉంటుందని రైల్వే, ఆర్అండ్బీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అతిముఖ్యమైన రైల్వే డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులు మంజూరైనా వాటికి అవసరమైన నిధులను కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాని ఉదంతాలెన్నో ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా మొక్కుబడిగా ఈ అంశాన్ని కూడా ప్రతిపాదిస్తే.. ఇతర వాటిలా అదీ పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో చేరుతుందని వారు అంటున్నారు.