ప్రత్యేక జోన్ అనుమానమే !
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు రెండు రైల్వే జోన్ల ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర విభజన బిల్లులో ప్రస్తావించారు. కానీ దీనికి రైల్వే శాఖ అంత సుముఖంగా లేదని తెలుస్తోంది. విభజన అంశం పూర్తిగా రాష్ట్రానికే సంబంధించింది కనుక.. దానిని ఆధారం చేసుకుని రైల్వే జోన్‌ను విభజించాల్సిన అవసరం లేదని ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారులు కేంద్రానికి స్పష్టం చేశారు. దీనికి దక్షిణ మధ్య రైల్వేనే ఉదాహరణగా చూపారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి ఐదు రాష్ట్రాల్లోని ప్రాంతాలు (పాక్షికంగా) వస్తున్నప్పటికీ పాలనాపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతోందని పేర్కొన్నారు.
తూర్పుకోస్తా రైల్వే పరిధిలో ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలను ద.మ.రైల్వే పరిధిలో విలీనం చేయటమో, ఆ మూడింటిని కలిపి ఓ జోన్‌గా మార్చటమో చేయాలనే దీర్ఘకాల డిమాండును మరోసారి తెరపైకి తెచ్చిన సీమాంధ్ర ప్రాంత నేతలు.. ఆ మూడింటితోపాటు పూర్తి సీమాంధ్ర ప్రాంతాన్ని ఒక జోన్‌గా మార్చాలని ఇప్పుడు కోరుతున్నారు. వారిని సంతృప్తిపరిచే క్రమంలో కేంద్రం, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఈ అంశాన్ని చేర్చింది.
అది కేవలం వారిని సంతృప్తి పరచడానికే పరిమితం అయ్యే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్రలో ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్తగా మరిన్ని ఓడరేవులు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తే ఆదాయాన్ని పెంచుకోవచ్చనేది నేతల వాదన. కానీ ఒకే జోన్‌గా ఉండి కూడా ఆ ఆదాయాన్ని అందిపుచ్చుకునే వీలుంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. కొత్త జోన్ ఏర్పాటు వల్ల సిబ్బంది సంఖ్య పెరిగి జీతాల ఖర్చు, మౌలిక వసతుల ఏర్పాటుకు ఖర్చు మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని వాదన.
కోచ్ ఫ్యాక్టరీ తూచ్...
తెలంగాణ ప్రాంతంలో కొత్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించే అంశాన్ని బిల్లులో చేర్చారు. కానీ ఇది కూడా కంటితుడుపు చర్యగానే కానుందని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు నాలుగేళ్లక్రితం వరంగల్ జిల్లా కాజీపేటలో రైల్వే వ్యాగన్ యూనిట్ ఏర్పాటుకు రైల్వే పచ్చజెండా ఊపింది. కానీ అది ఈరోజు వరకు కూడా కాగితాలకే పరిమితమైంది. రెండు దశాబ్దాల క్రితం ఇదే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరైనా.. దాన్ని నాటి రాజకీయ అవసరాల దృష్ట్యా రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పంజాబ్‌కు తరలించారు. దాని బదులే వ్యాగన్ యూనిట్‌ను మంజూరు చేసినా.. ఏర్పాటు చేయలేదు.
ప్రధాని స్థాయిలో ప్రత్యేక సిఫారసు ఉన్న ప్రాంతాలకే కోచ్ ఫ్యాక్టరీ మంజూరవుతుంటుంది. సాధారణంగా రైల్వే మంత్రులుగా ఉన్నవారు తమ రాష్ట్రానికి వాటిని మంజూరు చేయించుకుంటారు. అలాంటిది ఏమాత్రం ఒత్తిడి తీసుకురాగలిగే రాజకీయ శక్తి లేని తెలంగాణ లాంటి ప్రాంతానికి అంతటి భారీ ప్రాజెక్టు రావటం దాదాపు అసాధ్యమని అంటున్నారు. గత బడ్జెట్‌లో.. రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలుకు కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావాలని తీవ్రంగా యత్నించినా కేంద్రం ససేమిరా అన్న విషయం తెలిసిందే.
ప్రత్యేక ర్యాపిడ్ రైల్, రోడ్ అనుసంధానం
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు ర్యాపిడ్ రైలు, రోడ్డు మార్గం ఏర్పాటుకు కేంద్రం ప్రత్యేక ప్రాజెక్టుకింద నిధులు మంజూరు చేస్తే అది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. దీన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సి ఉంటుందని రైల్వే, ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అతిముఖ్యమైన రైల్వే డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులు మంజూరైనా వాటికి అవసరమైన నిధులను కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాని ఉదంతాలెన్నో ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా మొక్కుబడిగా ఈ అంశాన్ని కూడా ప్రతిపాదిస్తే.. ఇతర వాటిలా అదీ పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో చేరుతుందని వారు అంటున్నారు.