సాక్షి, విశాఖపట్నం: ‘జోనూ రాదు.. గీనూ రాదు..’ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వ్యంగ్యాస్త్రం.. ‘నాకు ఐదు కేజీల బరువు తగ్గాలని ఉంది.. అవకాశం ఇస్తే జోన్ కోసం వారం రోజులు దీక్ష చేస్తా’ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ వెటకారం! ఇది గత జూన్‌లో ఢిల్లీలో తీరిగ్గా కూర్చుని విశాఖకు రైల్వేజోన్‌పై టీడీపీ ఎంపీలు మాట్లాడుకున్న మాటల వ్యవహారం. ఇలా హేళనగా మాట్లాడిన ఎంపీల గుంపులో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ సంభాషణను ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. పార్టీ ‘ఇమేజీ’ని ఇది బాగా డ్యామేజి చేస్తోందన్న భయంతో అప్పట్లో సీఎం నష్ట నివారణ చర్యలకు దిగారు. వెనువెంటనే ఎంపీలతో కౌంటర్లు ఇప్పించారు. తామేదో సరదాగా మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేశారని కొందరు, తాము అనని మాటలను జోడిం చారని ఇంకొందరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తమ ఎంపీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కుట్ర చేసి వీడియోలను బయటకు పంపారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తమ ఎంపీల పరువు మంటగలిపేందుకు బీజేపీలాంటి పార్టీలు కుతంత్రాలు చేస్తున్నాయని ఆక్రోశించారు. ఇలా నెపాన్ని ఇతరుల మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారు. ఇది చాలదన్నట్టు రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ జులై 4న ఆ పార్టీ ఎంపీలతో జ్ఞానాపురంలో ఒకరోజు దీక్ష చేయించారు. ఈ తీరు చూసి విశాఖ వాసులు విస్తుపోయారు.
బాబు మనసులో మాటలే..
విశాఖకు రైల్వేజోన్‌పై టీడీపీ నేతలకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఆ పార్టీ ఎంపి జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. .చంద్రబాబునాయుడు మనసులోని మాటే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన మనస్సులో మాటలా బయట పెట్టారు. చంద్రబాబు ధర్మ పోరాటదీక్ష దొంగదీక్ష అని జేసీ మాటలను బట్టి ఆర్ధమవుతుంది. రైల్వేజోన్, ప్రత్యేకహోదా ఆంశాన్ని సర్వ నాశనం చేసినది చంద్రబాబే . ముఖ్యమంత్రి దిగజారుడు ధోరణి దీనితో ఆర్ధమవుతుంది. ఇదంతా నూటికి నూరు శాతం చంద్రబాబు ప్లానే. బాబుకే చిత్తశుద్ధి ఉంటే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి.– కొయ్య ప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు
జేసీ క్షమాపణ చెప్పాలి
విశాఖ రైల్వే జోన్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నోరు ఉంది కదాని మాట్లాడడం సరికాదు. విశాఖకు రైల్వేజోన్‌పై, ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి. ప్రత్యేక రైల్వే జోన్ వచ్చేంత వరకు పొరాటం చేస్తాం. జేసి వ్యాఖ్యలు చూస్తే, అవి చంద్రబాబు నాయుడే పలికించినట్టు అనుమానంగా ఉంది.
– ఎన్. రవీంద్ర రెడ్డి, విశాఖపట్నం
జేసీ నోట అవహేళన..
సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత విశాఖకు రైల్వే జోన్‌పై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఢిల్లీలో తాజాగా మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘విశాఖకు రైల్వే జోన్ వస్తే దమ్మిడీ ప్రయోజనం ఉండదు. జోన్ వస్తే రూ.10 కోట్ల భవనం, ఓ పది మంది గుమస్తాలు వస్తారు తప్ప ఇంకేమీ ఒరగదు. తెలిసో తెలియకో మా టీడీపీ నేతలంతా జోన్ కావాలి.. జోన్ కావాలి అంటూ నినాదాలు చేస్తున్నారు.’ అంటూ హేళనగా మాట్లాడారు. ఆ వేదికపై ఎనిమిది నెలల క్రితం జోన్‌పై వెటకారంగా మాట్లాడిన ఎంపీలు అవంతి శ్రీనివాస్, మురళీమోహన్‌లతో పాటు ఆ పార్టీ ఎంపీలు అశోక్‌గజపతిరాజు, ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, సుజనా చౌదరి, మాగంటి బాబు, కనకమేడల రవీంద్రకుమార్ తదితరులున్నారు. ఉత్తరాంధ్రకు రావలసిన రైల్వే జోన్‌పై జేసీ అత్యంత హేయంగా మాట్లాడుతుంటే ఉత్తరాంధ్ర ఎంపీలు ఒక్కరంటే ఒక్కరూ స్పందించకుండా చోద్యం చూశారు. విశాఖకు రైల్వే జోన్‌పై టీడీపీకి, ఆ పార్టీ ఎంపీలకు ఎంతటి చిత్తశుద్ధి ఉందో తరచూ వారు చేస్తున్న వ్యంగ్యాస్త్రాలను బట్టి తేటతెల్లమవుతోందని విశాఖ వాసులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment