railyway station
-
వందే భారత్‌లు సరే.. మరి వాటి పరిస్థితి ఏంటి?
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో టాప్ ప్రీమియర్ కేటగిరీలోకి వచ్చే వందేభారత్ రైలు సికింద్రాబాద్–విశాఖ మధ్య ఇటీవలే ప్రారంభమై ఎనిమిదిన్నర గంటల్లో గమ్యం చేరుతోంది. ఆ వెంటనే సికింద్రాబాద్–తిరుపతి, కాచిగూడ–బెంగళూరు, సికింద్రాబాద్–పుణే మధ్య మరో మూడు వందేభారత్ రైళ్లు మంజూరయ్యాయి. కోచ్ ఫ్యాక్టరీ నుంచి కొత్త రైళ్లు రాగానే ఆ మూడు పట్టాలెక్కుతాయని ప్రజలు భావిస్తున్నారు. మరి నిజంగా ఇంత తొందరగా ఆ రైళ్లు పట్టాలెక్కుతాయా..? 130 కి.మీ. సామర్థ్యం ఉంటేనే ఇలా ఉంది.. వందేభారత్ రైలు గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. (పరీక్ష సమయంలో 180కి.మీ. వేగం కూడా అందుకుంది). అయితే, ఇటీవల పట్టాలెక్కిన సికింద్రాబాద్–విశాఖపట్నం రైలు మాత్రం సగటున గంటకు 90 కి.మీ. మాత్రమే పరుగెడుతోంది. ఆ మార్గంలోని ట్రాక్ వేగ సామర్థ్యం గంటకు 130 కి.మీ. మాత్రమే ఉంది. మూడో లైన్ పనులు, ఇతర సిగ్నలింగ్ అవాంతరాలతో ఆ వేగాన్ని అడపాదడపా అందుకోవటం మినహా నిరంతరాయంగా ప్రయాణించటం సాధ్యం కావడంలేదు. గంటకు 130 కి.మీ. వేగానికి సరిపడా ట్రాక్‌ను పటిష్టపరిచిన మార్గంలోనే ఇలా ఉంటే.. అసలు ఆమేరకు ట్రాక్ పటిష్టం కాని సికింద్రాబాద్–పుణె, బెంగుళూరు, తిరుపతి మార్గాల్లో వందేభారత్ పరుగు ఎలా సాధ్యమన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. శతాబ్ది సాగటమే కష్టంగా ఉంటే.. సికింద్రాబాద్ నుంచి పుణేకు వికారాబాద్–వాడి–సేడం–సోలాపూర్ మీదుగా వెళ్లాలి. ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి వాడి వరకు 130 కి.మీ. స్పీడ్‌కు తగ్గట్టుగా కూడా ట్రాక్‌ను పటిష్టం చేయలేదు. అలాంటిది దాదాపు 180 కి.మీ. మేర సామర్థ్యం పెంచాలంటే చాలా సమయం పడుతుంది. శతాబ్ది రైలు ఆ మార్గంలో సగటున 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. ఈ మార్గంలో వందేభారత్ నడిచినా దాని వేగం దాదాపు అంతే ఉండనుంది. వందేభారత్ మంజూరైన నేపథ్యంలో సికింద్రాబాద్ –వాడి మధ్య ట్రాక్‌ను పటిష్ట పరిచే పనులు ఇప్పుడు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతిదీ అదే పరిస్థితి.. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు మూడు మార్గాలున్నాయి. కర్నూలు మీదుగా ఉన్న మార్గంలో ట్రాక్ పటిష్టం చేసే పనులు జరగలేదు. వాడి నుంచి రేణిగుంట వరకు పనులు జరిగినా.. నగరం నుంచి వాడి వరకు పనులు పూర్తికానందున ఆ మార్గం కూడా ఇప్పటికిప్పుడు కుదరదు. ఇక గూడురు మీదుగా వెళ్లే మార్గంలో.. సికింద్రాబాద్–కాజిపేట–విజయవాడ–గూడూరు వరకు 130కి.మీ. స్పీడ్‌కు తగ్గట్టుగా ట్రాక్‌ను మార్చారు. గూడూరు నుంచి తిరుపతి వరకు చేయాల్సి ఉంది. ఈ దారిలో ప్రస్తుతం కృష్ణా ఎక్స్‌ప్రెస్ తిరుగుతోంది. వెరసి మూడు మార్గాల్లో 130 కి.మీ. వేగానికి సరిపడా పనులు పూర్తయిన మార్గం ఒక్కటి కూడా లేదు. డబ్లింగుకే దిక్కులేదాయె.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రధాన మార్గం అయిన కర్నూలు రూట్లో ఇప్పటివరకు ట్రాక్‌ను పటిష్ట పరిచే పనులే మొదలు కాలేదు. ఈ మార్గంలో ప్రస్తుతం డబ్లింగ్ పనులు నడుస్తున్నాయి. అవి పూర్తయితే గానీ ట్రాక్‌ను పటిష్టం చేసే పనులు ప్రారంభం కావు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. త్వరలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఆ రెండో మార్గాన్ని జాతికి అంకితం చేయనున్నారు. మహబూబ్‌నగర్–డోన్ మధ్య డబ్లింగ్ పనులు జరపాల్సి ఉంది. అలాగే, గుత్తి–ధర్మవరం–డోన్ మధ్యలో కొంతమేర జరగాల్సి ఉంది. వెరసి ఈ మార్గం ఇప్పటికిప్పుడు వందేభారత్‌కు అనువు కాదు. ఇక, బెంగుళూరుకు వాడి మీదుగా కూడా వెళ్లే అవకాశం ఉంది. ఆ మార్గంలో సికింద్రాబాద్ నుంచి వాడి వరకు పనులు పూర్తయితేనే సాధ్యం. ఇప్పటికే ఈ మార్గంలో ట్రాక్‌ను 130 కి.మీ.కు తగ్గట్టుగా మెరుగుపరిచి ఉంటే.. మంజూరైన మూడు వందేభారత్ రైళ్లు వెంటనే పట్టాలెక్కే అవకాశం ఉండేది. ఇప్పుడు దానికి తగ్గ వేగంతో ప్రయాణించాలంటే మాత్రం ట్రాక్‌ను పటిష్టం చేసే పనులు పూర్తయ్యే వరకు నిరీక్షించాల్సిందే. -
ఎవరీ రాణి కమలాపతి.. ఈమె పేరును ఆ రైల్వేస్టేషన్‌కు ఎందుకు పెట్టారు..?
నవంబర్ 15 ‘ఆదివాసీ గౌరవ దినోత్సవం’ సందర్భంగా భోపాల్‌లోని ప్రసిద్ధ హబిబ్‌గంజ్ రైల్వేస్టేషన్‌ను ‘రాణి కమలాపతి స్టేషన్’గా పేరు మార్చారు. దాంతో రాణి కమలాపతి ఎవరు అని దేశంలో చాలా మంది ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపూర్వ సౌందర్యవతి అయిన గోండు రాణిగా రాణి కమలాపతి చరిత్రలో నిలిచి ఉంది. రాణి కమలాపతి రైల్వేస్టేషన్ భోపాల్ వెళితే రాణి కమలాపతి గురించి అనేక కథలు వినిపిస్తాయి. భోపాల్‌లో భిల్లుల తర్వాత గోండులే అత్యధిక గిరిజన జనాభా. దేశంలో గోండులు దాదాపు కోటీ ఇరవై లక్షల మంది ఉన్నారని అంచనా. వారి సంస్కృతి, వారి కథా నాయకులు, వారిలో జన్మించిన ధీర వనితలు ఇన్నాళ్లు అడపా దడపా మాత్రమే వెలుగులోకి వస్తున్నా ఇటీవల కాలంలో రాజకీయ కారణాల రీత్యా కూడా కొన్ని పేర్లు బయటకు రావాల్సి వస్తోంది. అలా రాణి కమలాపతి ఇప్పుడు దేశానికి çకుతూహలం కలిగిస్తోంది. దానికి కారణం మొన్నటి ‘ఆదివాసీ గౌరవ దినోత్సవం’ సందర్భంగా భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అక్కడి హబిబ్‌గంజ్ రైల్వేస్టేషన్‌కు ‘రాణి కమలాపతి’ పేరును పెట్టడమే. ఇంతకీ ఎవరీమె? ముద్దుల భార్య 18వ శతాబ్దంలో భోపాల్ ప్రాంతం గోండు రాజ్యం. నిజాం షా అనే గోండు రాజు సెహోర్ జిల్లాలోని గిన్నోర్ ఘర్ కోట నుంచి ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతనికి 7 గురు భార్యలని కాదు ముగ్గురు భార్యలని కథనాలు ఉన్నాయి. వారిలో ఒక భార్య రాణి కమలాపతి. కమలావతికి అపభ్రంశం ఈ పేరు. కమలాపతి అపూర్వ సౌందర్యరాశి. ఆమె సౌందర్యానికి ఆరాధకుడైన నిజాం షా ఆమె కోసం భోపాల్‌లో ఒక 7 అంతస్తుల కోట కట్టించాడని ఒక కథనం. ఆ కోట ఇప్పుడు భోపాల్‌లో ఉంది. 5 అంతస్తులు నీట మునిగి రెండు పైకి కనిపిస్తూ ఉంటాయని అంటారు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ కోటలో ఇంకా కమలాపతి ఆత్మ తిరుగాడుతుందని విశ్వసిస్తారు. భర్త చావుకు బదులు గోండు రాజ్యం మీద, కమలాపతి మీద కన్నేసిన మరిది వరసయ్యే చైన్ సింగ్ అనే వ్యక్తి నిజాం షాకు విషం పెట్టి చంపుతాడు. అతడు తనను లోబరుచుకుంటాడని భావించిన కమలాపతి పసిబిడ్డైన తన కుమారుడు నావెల్ షాను తీసుకొని మారు పేరుతో కోటను విడిచి దేశం పట్టింది. కొన్నాళ్లకు ఆమె గోండులకు విశ్వాస పాత్రుడైన యుద్ధవీరుడు మహమ్మద్ ఖాన్‌ను కలిసింది. తన భర్త హంతకుడైన చైన్ సింగ్‌ను చంపమని ఆమె కోరిందని, అందుకు వెయ్యి రూపాయల సుపారీ ఇచ్చిందని ఒక కథనం. ఆ సుపారీ ధనంలో కూడా ఒక వంతే చెల్లించి మిగిలిన దానికి భోపాల్‌లోని కొంత భాగం ఇవ్వజూపిందని అంటారు. మరో కథనంలో ఆమెకు సంబంధం లేకుండానే ఆమె బాధను చూసి మహమ్మద్ ఖానే స్వయంగా గిన్నోర్‌ఘర్ కోట మీద దాడి చేసి చైన్ సింగ్‌ను హతమారుస్తాడు. అంతే కాదు, తానే ఇప్పుడు భోపాల్‌లో ఉన్న కమలాపతి మహల్‌ను కట్టించి కమలాపతికి ఇచ్చాడు. కథ మలుపు ఇక్కడి నుంచే కథ మలుపు తిరిగింది. మహమ్మద్ ఖాన్ కమలాపతిని సొంతం చేసుకోవాలని ఆశించాడు. ఈ సంగతి తెలిసిన కమలాపతి కుమారుడు 14 ఏళ్ల నావల్ షా ఆగ్రహంతో మహమ్మద్ ఖాన్ మీద యుద్ధానికి దిగుతాడు. ‘లాల్‌ఘాటీ’ అనే ప్రాంతంలో జరిగిన ఆ యుద్ధంలో మరణిస్తాడు. కమలాపతి వర్గీయులు ఆ వెంటనే లాల్‌ఘాటీ నుంచి నల్లటి పొగను వదులుతారు (గెలిస్తే తెల్ల పొగ). మహల్ నుంచి ఆ పొగను చూసిన కమలాపతి తాము అపజయం పొందినట్టు గ్రహించి మహల్ ఒడ్డున ఉన్న సరస్సు గట్టును తెగ్గొట్టించింది. నీళ్లు మహల్‌ను ముంచెత్తాయి. కమలాపతి తన నగలు సర్వస్వం నదిలో వేసి జల సమాధి అయ్యింది. 1722లో ఆమె మరణం తర్వాత అక్కడి గోండు రాజ్యం అంతరించింది. గోండు రాణి కమలాపతి జీవితం సాహసంతో, ఆత్మాభిమానంతో, ఆత్మబలిదానంతో నిండినది. అందుకనే ఆమెను మధ్యప్రదేశ్‌లోనూ గోండులు అధికంగా ఉన్న రాష్ట్రాలలో అభిమానంగా తలుస్తారు. ఇప్పుడు ఆమె పేరు ఒక పెద్ద రైల్వే స్టేషన్‌కు పెట్టడం భావితరాలకు ఆమె స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. -
పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయండి
రాజమహేంద్రవరం సిటీ : పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలని సికింద్రాబాద్ చీఫ్ ఇంజనీర్ (నిర్మాణం)బ్రహ్మానందరెడ్డి పిలుపు నిచ్చారు. స్వచ్చత సప్తాహ్ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్లో శనివారం ప్రారంభించారు. మొదటి రోజు స్టేషన్ ఆవరణ, రైల్వే ఉద్యోగుల కాలనీల్లో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ఉన్న వాటిని ట్రిమ్మింగ్ చేసే కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛత సప్తాహ్‌లో స్వచ్ఛ స్టేషన్, స్వచ్ఛ రైలు, స్వచ్ఛ నీరు, స్వచ్ఛ పరిశర్, స్వచ్ఛ సహయోగ్, స్వచ్ఛ సంవాద్ కార్యాక్రమాలను రోజుకు ఒకటి చొప్పున నిర్వహిస్తామని స్టేషన్ మేనేజర్ భమిడిపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి తెలిపారు. స్టేషన్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ కేశవభట్ల శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ జాన్ విజయ్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.