గాలీ వాన బీభత్సం
- విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
- నేలమట్టమైన అరటి, పాలీహౌస్‌లు, నర్సరీలు
రాప్తాడు / పెనుకొండ రూరల్ / సోమందేపల్లి / పుట్లూరు / నార్పల / శింగనమల / కూడేరు :
జిల్లాలో మంగళవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో గాలీవానకు భారీ చెట్లతో పాటు 150 దాకా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దాదాపు వంద ఎకరాల్లో అరటి, బొప్పాయి చెట్లు నేలమట్టమయ్యాయి. పాలీహౌస్‌లు, నర్సరీలు సైతం దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు అపారనష్టం వాటిల్లింది.
రాప్తాడు మండలం బుక్కచెర్లలో వడగండ్ల వాన కురిసి దాదాపు 50 ఎకరాల్లో అరటి పంట ధ్వంసమైంది. సుమారు రూ.50 లక్షల మేరకు నష్టం సంభవించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, రఘనాథరెడ్డి, బి.నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, ఎలక నాగేంద్ర, చౌడక్క, నల్లమ్మ, నాగేంద్రరెడ్డి, జి.నారాయణరెడ్డి, పురుషోత్తంరెడ్డి, లక్ష్మయ్య, బి.ఎన్.నారాయణరెడ్డి, గొవర్ధన్‌రెడ్డి సాగుచేసిన అరటి తోటలు నేలమట్టం కావడంతో రైతులు బోరున విలపించారు. అలాగే రైతులు నాగేశ్వరమ్మ, నారాయణరెడ్డి ఏర్పాటు చేసుకున్న పాలిహౌస్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
దీంతో కీరాదోస పంటతో పాటు దాదాపు రూ.65 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు వాపోయారు. అలాగే ఐదెకరాల్లో బొప్పాయి పంట నేలకొరిగింది. అంతేకాక బుక్కచెర్ల, భోగినేపల్లి, పాలచెర్ల, ఎం.బండమీదపల్లి, పాలవాయి, ఎం.చెర్లోపల్లి తదితర గ్రామాల్లో దాదాపుగా 60 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో దాదాపు రూ.ఐదు లక్షల నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్‌కో డివిజన్ డీఈ నారాయణస్వామి నాయక్, ఏఈ నారాయణస్వామి తెలిపారు. ఏడు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపోయిందని, రాత్రికి రాత్రే నాలుగు గ్రామాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించామన్నారు. అలాగే రైతుల్ని ఆదుకుంటామని ఉద్యానవన హెచ్ఓ దస్తగిరి తెలిపారు. ఆయన నేలకూలిన పంటపొలాల్ని పరిశీలించారు. ఇక పెనుకొండ మండలం మావుటూరులో మైలారప్పకు చెందిన రేషం షెడ్డు కూలిపోవడంతో పాటు బాధితుడికి స్వల్పగాయాలయ్యాయి.
సోమందేపల్లిలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పుట్లూరు మండలం ఎల్లుట్ల, మడ్డిపల్లి, జంగంరెడ్డిపేట గ్రామాల్లో 15ఎకరాల్లో అరటిì తోటలు నేలకొరిగాయి. అలాగే నార్పల మండలం నాయనపల్లి, మద్దలపల్లి, నాయనపల్లి క్రాస్, వెంకటాంపల్లి గ్రామాల్లో పెనుగాలులకు పెద్ద వృక్షాలు విరిగి వాహనాలపై పడ్డాయి. షెడ్లు గాలికి ఎగిరి పోయాయి. అరటి, మామిడి చెట్లు విరిగాయి. నాయనపల్లి క్రాస్‌లో నర్సరీలకు అపారనష్టం జరిగింది. అలాగే శింగనమల మండలం సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం గ్రామంలో దాదాపు రూ.3 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. నాయనపల్లి క్రాస్ వద్ద దాదాపు 60 విద్యుత్ స్తంభాలు పడిపోయినట్లు ట్రాన్స్కోఏఈ ప్రసాద్ తెలిపారు. ఈ గ్రామంలోనే బోరువెల్ జీపుపై చెట్టు పడి నుజ్జునుజ్జయింది. విద్యుత్ స్తంభాలు ఇంటి మీదకు కూలిపోయాయి. పుట్లూరు,నార్పల మండలాల్లో దాదాపు 4 వేల వరకు అరటి చెట్లు కూలిపోయాయి. కూడేరు మండలం రామచంద్రాపురంలో రైతు తిమ్మారెడ్డికి చెందిన ఐదెకరాల అరటి నేలకొరిగింది.