rains lashes
-
వర్షాలు, వరదలతో అతలాకుతలం
సాక్షి, ముంబై: రాజధాని ముంబై నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, కొంకణ్, విదర్భ తదితర ప్రాంతాల్లో వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఔరంగాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కన్నడ తాలూకాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కన్నడ ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాలు, బురద కారణంగా ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వందలాది వాహనాలు ఘాట్ రోడ్డుపై ఇరుక్కుపోయాయి. శిథిలాలను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారు. మరోవైపు నాందేడ్, పర్బణీ జిల్లాల్లో కూడా వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. అదేవిధంగా కొంకణ్‌లోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు భారీ ఎత్తున కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు పంటలు నష్టపోయాయని వాపోతుండగా, మరికొన్ని ప్రాంతాల్లోని రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి : MHADA: శుభవార్త, ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు! చాలీస్‌గావ్‌లో వరద బీభత్సం జల్గావ్ జిల్లాలోని చాలీస్‌గావ్ తాలూకాలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండిపోయాయి. వరదల్లో పశువులతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయినట్టు తెలిసింది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మంగేష్ చవాన్ మీడియాకు అందించిన వివరాల మేరకు.. చాలీస్‌గావ్ తాలూకాలోని సుమారు 15 గ్రామాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల్లో సుమారు 500 నుంచి 600 పశువులు కొట్టుకుపోయినట్టు అనుమానిస్తున్నట్టు చెప్పారు. వరద నీటిలో ఇప్పటి వరకు ముగ్గురి శవాలు లభించగా, మొత్తం సుమారు 10 మంది వరకు కొట్టుకుపోయినట్టు స్థానికుల నుంచి సమాచారం అందిందని తెలిపారు. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉందన్నారు. తాలూకాలోని అనేక వంతెనలు ముంపునకు గురికావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. చదవండి : కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష! #WATCH | Maharashtra: Rain lashes various parts of Mumbai. Visuals from Bhandup. pic.twitter.com/uMInI9x3nQ — ANI (@ANI) August 31, 2021 -
Photo Story: ‘నీళ్ల’కంఠుడు.. పూర్తిగా మునిగిన శివాలయం
చుట్టూ గుట్టలు.. పచ్చని పొలాలు.. మధ్యలో అలుగు పారుతున్న ఊకచెట్టు వాగు.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం సమీపంలో కనువిందు చేస్తున్న జలదృశ్యమిది. వాగు మధ్యలోని శివుడి విగ్రహం చుట్టూ నీళ్లు పారుతున్న చిత్రం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. – కొత్తకోట రూరల్ (వనపర్తి జిల్లా) నిజామాబాద్ జిల్లా కందకుర్తిలోని గోదావరి నదిలో గల పురాతన శివాలయం వరదనీటిలో పూర్తిగా మునిగింది. నిజామాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురవడంతో కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతం గోదావరి, మంజీర, హరిద్ర నదుల వరద నీటితో జలకళను సంతరించుకుంది. – రెంజల్(బోధన్) సోమశిల సమీపంలోని కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఏపీలోని కర్నూలు జిల్లా సరిహద్దులో గల సంగమేశ్వరాలయం నీట మునిగింది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వదులుతుండడంతో నది నీళ్లు గుడిని తాకాయి. మంగళవారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం దాదాపు 4 అడుగుల మేర గుడి నీటిలో మునిగింది. సోమశిల, మంచాలకట్ట, అమరగిరి ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు. – కొల్లాపూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా) -
ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు
న్యూస్‌లైన్ నెట్వర్క : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తూర్పు గోదావరి, శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి, సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.ఈ వర్షాలకు కాకినాడలో మెయిన్ రోడ్డుతో పాటు పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోనసీమలోని ఆత్రేయపురం, కొత్తపేట, తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు మండలాల్లో పాలుపోసుకుని గింజ గట్టిపడే దశలో ఉన్న వరి చేలు నేలకొరిగాయి. అయితే ప్రస్తుత వర్షాల వల్ల పెద్దగా నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాలు డెల్టాతో పాటు మెట్టలో వరి, కొబ్బరి, పత్తి, ఇతర వాణిజ్య పంటల రైతులకు ఊరటనిచ్చాయి. శ్రీకాకుళం జిల్లా అంతటా సోమవారం ఉదయం నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంలో కుండపోతగా వాన కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీలు పూడిపోవడంతో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి సైతం నీళ్లుచేరాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షంతో రైతులు నారుమళ్ల సాగుకు సిద్ధమవుతున్నారు. చీని, నిమ్మ, మామిడి తదితర ఉద్యానవన పంటలకు ఈవర్షం ఉపయోగకరంగా మారింది. తిరుమలలో ఆదివారం ఉదయం మొదలైన వాన సోమవారం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. శ్రీవారి ఆలయం, కాటేజీలు, రోడ్లు, పార్కులు జలమయమయ్యాయి. శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు వర్షంలో తడుస్తూనే వెళ్లారు. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. ఘాట్‌రోడ్లలో పొగమంచు కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. కాగా, విజయనగరం జిల్లా తెర్లాం మండలం లోచర్ల గ్రామంలో సోమవారం పిడుగుపడి గొర్రెల కాపరి నీలాతి లచ్చయ్య(58) మృతి చెందారు.