
సాక్షి, ముంబై: రాజధాని ముంబై నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, కొంకణ్, విదర్భ తదితర ప్రాంతాల్లో వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఔరంగాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కన్నడ తాలూకాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కన్నడ ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాలు, బురద కారణంగా ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వందలాది వాహనాలు ఘాట్ రోడ్డుపై ఇరుక్కుపోయాయి. శిథిలాలను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారు. మరోవైపు నాందేడ్, పర్బణీ జిల్లాల్లో కూడా వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. అదేవిధంగా కొంకణ్‌లోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు భారీ ఎత్తున కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు పంటలు నష్టపోయాయని వాపోతుండగా, మరికొన్ని ప్రాంతాల్లోని రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి : MHADA: శుభవార్త, ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు!
చాలీస్‌గావ్‌లో వరద బీభత్సం
జల్‌గావ్ జిల్లాలోని చాలీస్‌గావ్ తాలూకాలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండిపోయాయి. వరదల్లో పశువులతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయినట్టు తెలిసింది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మంగేష్ చవాన్ మీడియాకు అందించిన వివరాల మేరకు.. చాలీస్‌గావ్ తాలూకాలోని సుమారు 15 గ్రామాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల్లో సుమారు 500 నుంచి 600 పశువులు కొట్టుకుపోయినట్టు అనుమానిస్తున్నట్టు చెప్పారు. వరద నీటిలో ఇప్పటి వరకు ముగ్గురి శవాలు లభించగా, మొత్తం సుమారు 10 మంది వరకు కొట్టుకుపోయినట్టు స్థానికుల నుంచి సమాచారం అందిందని తెలిపారు. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉందన్నారు. తాలూకాలోని అనేక వంతెనలు ముంపునకు గురికావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.
చదవండి : కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష!
#WATCH | Maharashtra: Rain lashes various parts of Mumbai. Visuals from Bhandup. pic.twitter.com/uMInI9x3nQ
— ANI (@ANI) August 31, 2021
Comments
Please login to add a commentAdd a comment