అందాల రాక్షసి
గ్లామర్ విలన్స్
మీ డ్రీమ్‌రోల్ ఏంటి అని అడిగితే నెగిటివ్ రోల్ చేయాలి అంటుంటారు హీరోయిన్లు.
ఎందుకంటే నిజమైన ప్రతిభని అలాంటి పాత్రలే వెలికి తీస్తాయని.
అది ముమ్మాటికీ నిజమే అని నిరూపించారు ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మలు.
విలనీని అద్భుతంగా పండించి వారేవా అనిపించుకున్నారు వీరంతా!
ప్రియాంకాచోప్రా
ప్రియాంక ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమెకు ఓ నెగిటివ్ రోల్ ఉపయోగపడిందన్న విషయం చాలా మందికి తెలియదు. ‘ఐత్రాజ్’లో అక్షయ్ కుమార్‌ని ప్రేమించి మోసగించి, అతడికి పెళ్లైపోయినా మళ్లీ ఎంటరై ముప్పు తిప్పలు పెడుతుంది. ఆ పాత్రలో ఆమె నటన అద్భుతం.
ఊర్మిళ
ఊర్మిళ అనగానే గ్లామర్ డాల్ అనేస్తారు చాలామంది. కానీ ‘ప్యార్ తూనే క్యా కియా’ సినిమా చూస్తే అలా అనడానికి నోరు రాదు. తాను కోరుకున్నవాణ్ని దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగించే అమ్మాయిగా అందులో తన నటన ఆ రేంజ్లో ఉంటుంది మరి!
కాజోల్
సాత్వికమైన నటనకు కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తుంది కాజోల్. అమాయకమైన ప్రేయసిగా, అన్ని విధాలా అనుకూలమైన అర్ధాంగిగా అతికినట్టు సరిపోతుంది. అలాంటి కాజోల్ ‘గుప్త్’ సినిమాలో తన స్వార్థం కోసం హత్యలు సైతం చేస్తుంది. అందరినీ హడలెత్తిస్తుంది. పోలీసుల్ని పరుగులెత్తిస్తుంది. అలాంటి పాత్రలో ఆమెను చూసి మొదట షాకైన ఆడియెన్స్, విలనీని ఇంత బాగా పండించగలదా అంటూ ఆశ్చర్యపోయారు.
బిపాసాబసు
అందాలు ఒలికించడంలో బిపాసాను కొట్టేవాళ్లే లేరు. అలాగే... బాలీవుడ్ హీరోయిన్లలో నెగిటివిటీని పండించడంలో కూడా బిప్స్‌ని బీటవుట్ చేసేవాళ్లు లేరు. భర్త ఆస్తిని దక్కించుకోవడానికి ఓ అమాయక లాయర్ని ప్రేమలోకి లాగి, పిచ్చివాణ్ని చేసే మాయలాడిగా ‘జిస్మ్’లో అదరగొట్టేసింది. కోరుకున్నది సాధించుకోవడానికి ఆత్మలతో సైతం సావాసం చేసి, చెల్లెలి జీవితాన్నే చిన్నాభిన్నం చేసే క్రూరురాలిగా ‘రాజ్ 3’లో దుమ్ము రేపింది.