raj koti
-
హర్ష్ నటనకు అభిమానిగా మారాను.. వెంకటేష్‌లా నటించాడు
Sehari Movie Unit Appriciates Hero Harsh Kanimulli: 'సెహరి సినిమాలో’ హర్ష్ తండ్రి పాత్ర చేశాను. హర్ష్లో చాలా ఈజ్ ఉంది. ‘నువ్వు నాకు నచ్చావ్’లో వెంకటేశ్ తరహాలో సహజ నటన పండించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పండగలాంటి సినిమా ‘సెహరి' అని సంగీత దర్శకుడు కోటి అన్నారు. హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సెహరి'. అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ట్రైలర్ విడుదల చేశారు. దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ 'వర్క్ షాప్ సమయంలోనే హర్ష్ నటనకి అభిమానిగా మారిపోయాను. అందరి కృషితో సినిమా బాగా వచ్చింది' అన్నారు. ‘'చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ చూడదగ్గ సినిమా ఇది’' అని అద్వయ జిష్ణురెడ్డి అన్నారు. ‘'ఆద్యంతం ఎంటర్టైన్ చేసే సినిమా ‘సెహరి’' అన్నారు హర్ష్. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. బుధవారం రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. -
పల్లెటూరి వాళ్లం కదా! అభిమానాలు ఎక్కువ..
చీరలకు గంజి పెట్టి, ఆరేస్తూ, మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ, మనసు హాయిగా ఉండటం కోసం కూనిరాగాలు తీస్తున్న బేబీని సెల్‌ఫోనులో బంధించి, సోషల్ మీడియాలో ఉంచితే, ఆ వీడియో బేబీని త్రసీమకు పరిచయం చేసింది. సింగర్ రఘు కుంచె ఆ పల్లెకోయిల మీద లక్ష్మీభూపాలతో ఒక పాట రాయించి, ఆ పాటను చిత్రీకరించి యూట్యూబ్‌లో ఉంచారు. ఆ పాటకు పాతిక లక్షలకు పైగా వ్యూస్ చ్చాయి. ఇప్పుడు ‘పలాస’ చిత్రంతో తొలిసారిగా నేపథ్యగాయనిగా గళం విప్పిన ఈ పల్లె కోయిల పసల బేబీ మదిలోని రాగాలివి. ‘పలాస’ సినిమా కోసం బాలు గారితో గొంతు కలిపే అవకాశం రావడం నాకు దొరికిన అదృష్టం. పెద్ద పండుగ. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ అదృష్టం దక్కుతుంది. ఈ పాట ముందర నాతో విడిగా పాడించారు. నేను పాడుతున్నప్పుడు నాతో బాలుగారు పాడుతున్న విషయం నాకు తెలియదు. ట్రాక్ కోసం నేను రఘుగారు కలిసి పాడాం. బాలుగారితో నేను పాడుతున్నానని చెప్పడానికి రఘు గారు సంశయించారు. పాట పూర్తయిపోయింది. ఆయన దగ్గరకువెళ్లి ఈ పాట వినిపించగానే, నా గొంతు విని ‘ఎవరు పాడారు?’ అని ఆయన అడిగారట. రఘుగారు నా పేరు చెప్పారట. ప్రొఫెషనల్‌గా పాడానని బాలుగారు దీవించారట. పల్లెపాటల అమ్మాయితో పాడటం తనకు సంతోషంగా ఉందని కూడా బాలుగారు అన్నారట. చదువు, సంధ్య, సంగీత జ్ఞానం లేని నాకు బాలుగారితో పాడే వరం లభించింది. ఇందుకు ముందుగా నేను కోటి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. శత ‘కోటి’ వందనాలు ‘మట్టిమనిషినండి నేను’.. అనే పాటనే లక్ష్మీభూపాలగారితో రాయించి, రఘు కుంచెగారు ట్యూన్ చేసి, నా మీద షూటింగ్ చేసి నాతో పాడించి, నన్ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయనకు శతకోటి దనాలు. పాటకు నన్ను అంటు కట్టారు. నన్నొక మొక్కలా నాటి, నీళ్లు పోసినందుకు ఆయన ఋణం తీర్చుకోలేను. ఇటీవలే ‘రాణు మోండల్’ అనే బెంగాలీ యాచకురాలు రైల్వే ప్లాట్ ఫామ్ మీద పాడిన షోర్ చిత్రంలోని ‘ఏక్ ప్యార్ క నగ్మా హై’ పాటతో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. నాకూ అవకాశాలు వస్తే్త మరింత బాగా పాడి, మరింతమందికి చేరువ కావాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఒక విషయం. కోటిగారు నన్ను హైదరాబాద్ రప్పించి, పెద్దపెద్దవాళ్లందరికీ నన్ను పరిచయం చేశారు. అంతవరకు నాకు హైదరాబాద్ అంటేనే తెలియదు. ఇక్కడితో ఆగకుండా నన్ను దుబాయ్ కూడా తీసుకువెళ్లారు. విమానం ఎలా ఎక్కాలో కూడా నాకు తెలియదు. అక్కడ కదిలే మెట్లు ఎక్కుతున్నప్పుడు నేను పడిపోతుంటే, ఆయన చెయ్యి ఇచ్చి నాకు అండగా నిలిచారు. పల్లెటూరి వాళ్లం కదా! మాకు అభిమానాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా మాట్లాడకపోయినా కూడా చాలా బాధ పడతాం. కోటిగారు నాకు ఎన్నో పాటలు పంపుతున్నారు, నేను పాడి వాటిని ఆయనకు పంపితే, ఆయన తప్పులు సరిచేస్తున్నారు. ఇప్పుడు మరింత బాగా పాడేందుకు ప్రయత్నిస్తున్నాను. రాసుకుని సాధన చేస్తున్నాను ఎవరు ఏ పాట అడిగితే ఆ పాట బాగా సాధన చేసి వేదికల మీద పాడుతున్నాను. కోటిగారి సలహా మీద తెలుగు బాగా చదవగలుగుతున్నాను. ప్రతి పాట రాసుకుని చదువుతూ పాడుతున్నాను. నేను వందేళ్లు బతక్కపోయినా పరవాలేదు, ఒక మంచి పాట పాడి నాలోని గాయకురాలిని చిరస్మరణీయం చేయాలన్నదే నా కోరిక. ‘తీపి రాగాల తోటి మా ఊరు దాటి మీ కోసమొచ్చాను. యాతమేసి తోడాను నాలో ఉన్న రాగాలను’ నన్ను సినిమా పరిశ్రమ అక్కున చేర్చుకుని, నా చేత ఇంకా ఇంకా తోడించమని అర్థిస్తున్నాను. అందరూ ప్రోత్సహించాలి... బేబీ గాత్రంలో పలికే గమకాల వల్ల ఆవిడ ఏ పాట పాడినా చక్కగా ఉంటోంది. అది దేవుడు ఇచ్చిన వరం. రఘు కుంచె పాడించిన మొదటి పాట బాగా హిట్ అయింది. ఆవిడను సినీ పరిశ్రమలోని సంగీత దర్శకులు పాడించి, ప్రోత్సహించి పెద్ద స్థాయికి తీసుకురావాలన్నదే నా కోరిక. ఆవిడ చదువుకోలేదు, చిన్నతనం నుంచి పాటలు పాడిన జ్ఞానమే ఆవిడను ఈ స్థాయికి తీసుకు వచ్చింది. ఆవిడకు నేను అక్షరాభ్యాసం చేశాను. ఒక టీచర్ ని పెట్టి అక్షరాలు నేర్పిస్తున్నాను. నాన్నగారి (సాలూరి రాజేశ్వరరావు) పాటల లింకులు పంపిస్తుంటే అన్నీ బాగా నేర్చుకుని పాడుతున్నారు. దోషాలు ఉంటే సరిచేస్తున్నాను. బాగా సాధన చేసి వేదికల మీద పాడుతున్నారు. – కోటి, సంగీత దర్శకులు – వైజయంతి పురాణపండ -
సందర్భం వేటూరి సుందరరామమూర్తి వర్ధంతి తేనెపాటల పూదోట
‘ఆరేసుకోబోయి పారేసు’కున్న అల్లరి పాటకు (‘అడవిరాముడు’ - 1977) తెలుగు ప్రేక్షకులతో ఈలలు, కేరింతలు, కేకలు వేయించిన ఘనత వేటూరి సుందరరామమూర్తిది. అదే సినిమాలో ఆయన ‘కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ వేసిన వైనం ఆ స్థాయి గుర్తింపునకు నోచుకుందా అంటే సందేహమే. జనామోదం అలానే ఉంటుంది మరి. ‘నిన్న మొన్న తుళ్లి తుళ్లి తూనీగల్లే ఎగిరిన పిల్లదానికొచ్చింది కళ, పెళ్లికళ’ అంటూ సుతారంగా, సున్నితంగా సంపెంగ రెక్కలతో సరాగమాడిన గీతర్షి ఆయన. 1974లో గీత రచయితగా పరిచయమైనా, ఆయన ఘన సినీ యానం మాత్రం అలా 1977లో ప్రారంభమైంది. ఒక్కసారి వెనక్కి చూస్తే, 1978లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ సుందరరామమూర్తి ప్రతిభకు నిలువెత్తు అద్దమైంది. ఆ తరువాత మూడు దశాబ్దాల పాటు ఆయన పాటల తేరు ఊరేగడానికి ఆ సినిమా ఓ రహదారి అయింది. పడికట్టు పదాల దొంతరలు వదిలేసి, ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక... ఏరు దారెటు పోతుందో ఎవరినీ అడగక...’ అంటూ ఒకింత వేదాంతంతో వేటూరి తానేమిటో ఆవిష్కరించుకున్నారు. ఇక అంతే... పదేళ్ల పాటు ఎన్నెన్ని సినిమాలకు ఆయన సింగిల్‌కార్డు గేయ రచయితగా నిలిచారో లెక్క లేదు. చక్రవర్తి, ఇళయరాజా, కీరవాణి, రాజ్‌కోటి... ఎందరో సంగీత దర్శకులు ఏరి కోరి ఆయనే కావాలని తమ బాణీలకు పాటలు రాయించుకున్నారు. కె. విశ్వనాథ్ నుంచి కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి, ఇవాళ్టి శేఖర్ కమ్ముల, గుణశేఖర్‌ల దాకా ఎందరో దర్శకులకు ఆయన హాట్‌ఫేవరెట్. మూడు దశాబ్దాలకు పైగా ఆయన కలం అందించిన పాటలు దాదాపు 5,000 పైనే ఉంటాయని ఓ అంకెల అంచనా. ‘రాయక నిర్మాతలను ఏడిపించే’ గుణం ఆయనకు అసలుండేది కాదు. 1970లలో సినిమా నిర్మాణంలో పెరిగిన వేగం, వ్యాపారాత్మక పాటల కోసం నిర్మాతలు రోజులూ వారాలూ ఎదురుచూసే ధోరణికి స్వస్తి చెప్పింది. అనుకున్నది తడవుగా సన్నివేశానికి అతికే పాటలు, ఇచ్చిన ట్యూన్‌కు అనుగుణంగా చెక్కిన పద సముదాయం గుబాళించే పాటలు వెంట వెంటనే రాయాల్సి వచ్చిన సంక్లిష్ట సంధిలో తన కోసం సిద్ధమైన సింహాసనాన్ని వేటూరి సరైన సమయంలో అధిరోహించారు. ట్యూన్ వినిపిస్తే అరగంటలో ఆయన ఫోనులోనే పాట వినిపించేవారని చెప్పుకుంటారు. ‘శంకరాభరణం’ లాంటి క్లాసిక్స్‌కి, ‘వేటగాడు’, ‘జగదేకవీరుడు - అతిలోకసుందరి’ వంటి ఫక్తు ఫార్ములా సినిమాలకు సమాంతరంగా సాహితీ గౌరవం కలిగిన పాటలు రాస్తూ, ఆయన తన ప్రతిభను ప్రపంచానికి స్పష్టం చేశారు. ‘ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము...’ అని ఒక చేత్తో రాస్తున్న కాలంలోనే ‘ఆకుచాటు పిందె తడిసె... కోక మాటు పిల్ల తడిసె’ అంటూ యువతరానికి చక్కిలిగిలి పెట్టే పాటలు మరో చేత్తో రాసి చలాయించుకున్నారు. ‘అచ్చెరువున... విచ్చిన కన్నులతో’ రసహృదయుల్ని తన్మయానికి లోను చేశారు. అలవోకగా, అతి సుందరంగా మాటలతో ప్రయోగాలు చేసి పాటలల్లిన మాంత్రికుడు ఆయన. మైనా పిట్టలు ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన’ సోయగాన్ని ఆయన ‘సితార’లో అక్షరబద్ధం చేస్తే ఇళయరాజా స్వరమాలిక కూర్చి అజరామరం చేశారు. ‘వానకారు కోయిలనై /తెల్లవారి వెన్నెలనై / ఈ ఎడారి దారులలో / ఎడద నేను పరిచానని/కడిమి వోలె నిలిచానని’ అంటూ ఆయన లిఖించిన ‘మేఘసందేశం’ ఎన్నేళ్లు గడిచినా ఆ పరిమళాన్ని పోగొట్టుకోదు. ‘కలలారని పసిపాప / తలవాల్చిన ఒడిలో తడినీడలు పడనీకే / ఈ దేవత గుడిలో’అని లేబ్రాయపు ప్రియురాలికి ఆయన చేరవేసిన ‘గీతాంజలి’ ఎన్నటికీ సుమదళ సుకుమారమే. ‘ఎన్నెల్లుతేవే/ ఎదమీటిపోవే’ అంటూ ‘పంతులమ్మ’కు ఆయన శ్రుతి చేసిన పున్నాగపూల సన్నాయి సినీ సంగీత ప్రియుల వీనులకు విందు చేస్తూనే ఉంటుంది. అంతర్లీనంగా ‘వీణ వేణువైన మధురిమ’లా పల్లవిస్తూనే ఉంటుంది. ఆయనకే తెలిసిన ‘ఎడారి కోయిల’లు, ‘తెల్లారని రేయి’లు కోకొల్లలు. కడలి తరంగమంత జీవన విషాదాన్ని ‘బ్రతుకంటే మృతి కంటే చేదైన ఒక తీపి పాట...’ అంటూ సంక్షిప్తీకరించడం సుందరరామమూర్తి కంటే వేరెవరికి తెలుసు? ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి’ అన్న జీవన క్రోడీకరణ ఆయనకే సాధ్యం. వెరసి ఒక గంధర్వ కవిత్వపు కుంచె భువిపై దిగి, 1936 నుండి 2010 దాకా 74 ఏళ్ల పాటు ‘వేదం’లా, ‘అణువణువున నాదం’లా, ‘పంచప్రాణాల నాట్యవినోదం’లా విలసిల్లి, ‘నిర్వాణ సోపానమధిరోహించి’ంది. అక్షరాలా అమృతమూర్తి వేటూరి సుందరరామమూర్తి. - తిరువాయపాటి రాజగోపాల్