సందర్భం వేటూరి సుందరరామమూర్తి వర్ధంతి తేనెపాటల పూదోట
‘ఆరేసుకోబోయి పారేసు’కున్న అల్లరి పాటకు (‘అడవిరాముడు’ - 1977) తెలుగు ప్రేక్షకులతో ఈలలు, కేరింతలు, కేకలు వేయించిన ఘనత వేటూరి సుందరరామమూర్తిది. అదే సినిమాలో ఆయన ‘కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ వేసిన వైనం ఆ స్థాయి గుర్తింపునకు నోచుకుందా అంటే సందేహమే. జనామోదం అలానే ఉంటుంది మరి. ‘నిన్న మొన్న తుళ్లి తుళ్లి తూనీగల్లే ఎగిరిన పిల్లదానికొచ్చింది కళ, పెళ్లికళ’ అంటూ సుతారంగా, సున్నితంగా సంపెంగ రెక్కలతో సరాగమాడిన గీతర్షి ఆయన. 1974లో గీత రచయితగా పరిచయమైనా, ఆయన ఘన సినీ యానం మాత్రం అలా 1977లో ప్రారంభమైంది.
ఒక్కసారి వెనక్కి చూస్తే, 1978లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ సుందరరామమూర్తి ప్రతిభకు నిలువెత్తు అద్దమైంది. ఆ తరువాత మూడు దశాబ్దాల పాటు ఆయన పాటల తేరు ఊరేగడానికి ఆ సినిమా ఓ రహదారి అయింది. పడికట్టు పదాల దొంతరలు వదిలేసి, ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక... ఏరు దారెటు పోతుందో ఎవరినీ అడగక...’ అంటూ ఒకింత వేదాంతంతో వేటూరి తానేమిటో ఆవిష్కరించుకున్నారు. ఇక అంతే... పదేళ్ల పాటు ఎన్నెన్ని సినిమాలకు ఆయన సింగిల్‌కార్డు గేయ రచయితగా నిలిచారో లెక్క లేదు. చక్రవర్తి, ఇళయరాజా, కీరవాణి, రాజ్‌కోటి... ఎందరో సంగీత దర్శకులు ఏరి కోరి ఆయనే కావాలని తమ బాణీలకు పాటలు రాయించుకున్నారు. కె. విశ్వనాథ్ నుంచి కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి, ఇవాళ్టి శేఖర్ కమ్ముల, గుణశేఖర్‌ల దాకా ఎందరో దర్శకులకు ఆయన హాట్‌ఫేవరెట్. మూడు దశాబ్దాలకు పైగా ఆయన కలం అందించిన పాటలు దాదాపు 5,000 పైనే ఉంటాయని ఓ అంకెల అంచనా.
‘రాయక నిర్మాతలను ఏడిపించే’ గుణం ఆయనకు అసలుండేది కాదు. 1970లలో సినిమా నిర్మాణంలో పెరిగిన వేగం, వ్యాపారాత్మక పాటల కోసం నిర్మాతలు రోజులూ వారాలూ ఎదురుచూసే ధోరణికి స్వస్తి చెప్పింది. అనుకున్నది తడవుగా సన్నివేశానికి అతికే పాటలు, ఇచ్చిన ట్యూన్‌కు అనుగుణంగా చెక్కిన పద సముదాయం గుబాళించే పాటలు వెంట వెంటనే రాయాల్సి వచ్చిన సంక్లిష్ట సంధిలో తన కోసం సిద్ధమైన సింహాసనాన్ని వేటూరి సరైన సమయంలో అధిరోహించారు.
ట్యూన్ వినిపిస్తే అరగంటలో ఆయన ఫోనులోనే పాట వినిపించేవారని చెప్పుకుంటారు. ‘శంకరాభరణం’ లాంటి క్లాసిక్స్‌కి, ‘వేటగాడు’, ‘జగదేకవీరుడు - అతిలోకసుందరి’ వంటి ఫక్తు ఫార్ములా సినిమాలకు సమాంతరంగా సాహితీ గౌరవం కలిగిన పాటలు రాస్తూ, ఆయన తన ప్రతిభను ప్రపంచానికి స్పష్టం చేశారు. ‘ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము...’ అని ఒక చేత్తో రాస్తున్న కాలంలోనే ‘ఆకుచాటు పిందె తడిసె... కోక మాటు పిల్ల తడిసె’ అంటూ యువతరానికి చక్కిలిగిలి పెట్టే పాటలు మరో చేత్తో రాసి చలాయించుకున్నారు. ‘అచ్చెరువున... విచ్చిన కన్నులతో’ రసహృదయుల్ని తన్మయానికి లోను చేశారు. అలవోకగా, అతి సుందరంగా మాటలతో ప్రయోగాలు చేసి పాటలల్లిన మాంత్రికుడు ఆయన.
మైనా పిట్టలు ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన’ సోయగాన్ని ఆయన ‘సితార’లో అక్షరబద్ధం చేస్తే ఇళయరాజా స్వరమాలిక కూర్చి అజరామరం చేశారు.
‘వానకారు కోయిలనై /తెల్లవారి వెన్నెలనై / ఈ ఎడారి దారులలో / ఎడద నేను పరిచానని/కడిమి వోలె నిలిచానని’ అంటూ ఆయన లిఖించిన ‘మేఘసందేశం’ ఎన్నేళ్లు గడిచినా ఆ పరిమళాన్ని పోగొట్టుకోదు.
‘కలలారని పసిపాప / తలవాల్చిన ఒడిలో
తడినీడలు పడనీకే / ఈ దేవత గుడిలో’అని లేబ్రాయపు ప్రియురాలికి ఆయన చేరవేసిన ‘గీతాంజలి’ ఎన్నటికీ సుమదళ సుకుమారమే.
‘ఎన్నెల్లుతేవే/ ఎదమీటిపోవే’
అంటూ ‘పంతులమ్మ’కు ఆయన శ్రుతి చేసిన పున్నాగపూల సన్నాయి సినీ సంగీత ప్రియుల వీనులకు విందు చేస్తూనే ఉంటుంది. అంతర్లీనంగా ‘వీణ వేణువైన మధురిమ’లా పల్లవిస్తూనే ఉంటుంది.
ఆయనకే తెలిసిన ‘ఎడారి కోయిల’లు, ‘తెల్లారని రేయి’లు కోకొల్లలు. కడలి తరంగమంత జీవన విషాదాన్ని ‘బ్రతుకంటే మృతి కంటే చేదైన ఒక తీపి పాట...’ అంటూ సంక్షిప్తీకరించడం సుందరరామమూర్తి కంటే వేరెవరికి తెలుసు? ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి’ అన్న జీవన క్రోడీకరణ ఆయనకే సాధ్యం.
వెరసి ఒక గంధర్వ కవిత్వపు కుంచె భువిపై దిగి, 1936 నుండి 2010 దాకా 74 ఏళ్ల పాటు ‘వేదం’లా, ‘అణువణువున నాదం’లా, ‘పంచప్రాణాల నాట్యవినోదం’లా విలసిల్లి, ‘నిర్వాణ సోపానమధిరోహించి’ంది. అక్షరాలా అమృతమూర్తి వేటూరి సుందరరామమూర్తి.
- తిరువాయపాటి రాజగోపాల్