శ్రావణ శోభ
నెల్లూరు(బృందావనం): శ్రావణమాస తొలి శుక్రవారాన్ని పురస్కరించుకొని నగరంలోని అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో పూజలను నిర్వహించి నోములను ఆచరించారు. ఆలయాల్లో భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. గీ నగరంలోని రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారికి లక్షకుంకుమార్చనను విశేషంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో కుప్చచ్చి సుబ్బారావు, ఆలూరు శిరోమణిశర్మ పర్యవేక్షణలో 20 మంది రుత్విక్కులతో కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరిగింది.
ఆలయ మండపంలో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం విశేషహారతులు, రాత్రి అమ్మవారికి పల్లకీసేవ కనులపండువగా జరిగింది. తీర్థప్రసాదాలకు ఉభయకర్తలుగా సోమవారపు సూర్యనారాయణరావు, విజయలక్ష్మి దంపతులు, గంగాభవాని, మధుకర్ వ్యవహరించారు. ఈఓ వెండిదండి శ్రీనివాసరెడ్డి, దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త రత్నం జయరామ్ పర్యవేక్షించారు.
రాజరాజేశ్వరి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి శివశంకరరావు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. మూలాపేటలోని భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవారికి విశేషపూజలను నిర్వహించారు. రాత్రి పల్లకీసేవ, ఊంజల్‌సేవను వేడుకగా జరిపారు. ఆలయ అర్చకులు బాలాజీశర్మ, శ్రీరామకవచం కోటేశ్వరశర్మ, శ్రీశైలం భార్గవశర్మ, ధూర్జటి వేణుగోపాలశర్మ, తదితరుల ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఉభయకర్తలుగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు వ్యవహరించారు. ఈఓ ఆరంబాకం వేణుగోపాల్ పర్యవేక్షించారు.
మూలాపేటలోని ఇరుకళల పరమేశ్వరి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చన నిర్వహిం చారు. ఉభయకర్తలుగా సూర్యప్రకాశ్‌రావు, విజయశ్రీ దంపతులు వ్యవహరించారు. అమ్మవారికి సాయంత్రం పూలంగిసేవ, చందనా లంకారం, రాత్రి పల్లకీసేవను నిర్వహించారు. ఉభయకర్తలుగా రాజేశ్వరరావు, అరుణ దంపతులు వ్యవహరించారు. ఈఓ వేమూరి గోపీ పర్యవేక్షించారు. పప్పులవీధిలోని మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారికి క్షీరాభిషేకం, రాత్రి ఊంజల్‌సేవను నిర్వహించారు. ఈఓ గుమ్మినేని రామకృష్ణ పర్యవేక్షించారు.