Rajakars
-
సెప్టెంబర్ 17 : BRS పునరుజ్జీవనం vs BJP విమోచనం
సెప్టెంబర్ 17 వచ్చిందంటే రాజకీయ పార్టీలు కొత్త వివాదాన్ని తీసుకొస్తున్నాయి. చరిత్రలో ఇలా జరిగింది.. ఇది మా వాదన అంటూ ఒక్కో రకంగా చెప్పుకుంటున్నాయి. నిజంగా ఏం జరిగిందన్నది మరుగునపడి పార్టీలు తీసుకొస్తున్న కొత్త వాదన మీద వర్తమానం నడుస్తోంది. నాడు ఏం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తోన్న రాజకీయనాయకులు జరిగిన దానికి తమదైన భాష్యం చెప్పుకుంటున్నాయి. సాక్షికి ఇచ్చిన వ్యాసాల్లో రెండు విరుద్ధ భావాలను పంచుకున్నాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. బీఆర్ఎస్ తరపున మంత్రి శ్రీనివాసగౌడ్, బీజేపీ తరపును విద్యాసాగర్‌రావు అందించిన ప్రత్యేక వ్యాసాలు ఇవి. BRS : పునరుజ్జీవనం : ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యమంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. కృష్ణా–గోదావరీ జలాలను తెలంగాణలోని చేను చెల్కలను తడపడానికీ, చెరువులను నింపడానికీ, తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమానికీ ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. అలా చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రతిష్ఠాత్మకమైనది ‘పాలమూరు–రంగారెడ్డి.’ తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు.’ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష, ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా–గోదావరీ జలాలను చేను చెల్కలకు, చెరువులను నింపడానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమాన్ని ప్రథమ ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ఉన్న దక్కన్ పీఠభూమి శిఖరంగా ఉన్న తెలంగాణను ఆకుపచ్చ సీమగా మలిచే బృహత్తర కార్యక్రమాన్ని కేసీర్ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సమాంతరంగా నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెంపు ప్రాతిపదికగా ప్రజల భాగ స్వామ్యంతో చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ అపూర్వ ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక సామాజిక సాంస్కృతిక వికాసం పునరుజ్జీవం పొందుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల దాష్టీకాల వలన తెలంగాణ సంక్షుభితంగా మారింది. పాలమూరు జిల్లాలో మానవ జీవన విధ్వంసం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ మనిషికి మనుగడకు మహా యుద్ధమే జరిగింది. ‘నీరు పల్లమెరుగు’ అనే కాలం చెల్లిన నమూనాతో తెలంగాణలో అత్యధిక చెరువులు ఉన్న ఉమ్మడి పాలమూరుపై నిర్లక్ష్యం చేసి బిరా బిరా కృష్ణమ్మను రానివ్వకుండా దగా చేశారు. తమ కళ్ళముందు పారుతున్న నీటిని కూడా చెరువులో నిల్వ కాకుండా చేశారు. అదే కృష్ణా– గోదావరులతో కోస్తా ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చుకున్నారు. గతి తప్పిన రుతువులు, బోర్ బావులతో వ్యవసాయం బావురుమన్నది. నీరు లభ్యం కాని స్థితిలో తీవ్ర దుర్భిక్షం నడుమ జీవితం నిత్య మరణంగా మారిన నేపథ్యంలో బతకడానికి దేశ విదేశాలలో వలస కూలీలుగా కట్టు బానిస జీవితం వెల్లబోస్తున్న దైన్యానికి పాలమూరు ప్రజానీకం నెట్టబడింది. మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని అంతిమ విజయతీరం వైపు చేర్చడానికి కేసీఆర్ చేపట్టిన అనేక ప్రజాస్వామ్య ఉద్యమ వ్యూహాల్లో భాగంగా 2009 లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుండి ఎన్నికైనారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు, భోగోళిక స్థితిగతులను అవగాహన చేసుకున్నారు. జీవ వైవిధ్యానికి అనువుగా నల్ల రేగళ్లు, ఎర్ర చెల్కలు, ఇసుక భూములు ఉన్నాయక్కడ. నీరు అందితే దక్కన్ అన్నపూర్ణగా విలసిల్లే భవిష్యత్ ఉందని నిర్ధారించుకున్నారు. వలసలు వెళ్లిన ఇక్కడి ప్రజలు తిరిగి రావడమే కాదు, పక్క ప్రాంతాల నుండి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చే దశకు చేరుకోవాలని కోరుకున్నారు. ఈ ప్రాంత లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించిన సంతోషంలో కృతజ్ఞతను చాటుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలనుకున్నారు. పాలమూరును పడావు పెట్టి కృష్ణా నీటిని తరలించుకుపోయిన అప్పటి ప్రాంతీయ ద్రోహులను ఎండగట్టారు. 2014లో రాష్ట్ర సాకారం తర్వాత ఉద్యమ క్రమంలోనే రూపకల్పన చేసుకున్న ఉత్తర తెలంగాణ కోసం ‘కాళేశ్వరం’, దక్షణ తెలంగాణ కోసం ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కార్యాచరణ ప్రారంభించారు. చైనా నిర్మించిన సుప్రసిద్ధ ‘త్రీ గార్జెస్’ ప్రాజెక్ట్ కంటే గొప్పగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ సాంకేతికతతో, ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ అద్భుతాలతో కూడిన ‘పాలమూరు –రంగారెడ్డి' సాగునీటి ప్రాజెక్ట్‌కు 2015 జూన్ 11న శంఖు స్థాపన చేశారు. శ్రీశైలం ఎగువ భాగాన కొల్లాపుర్ మండలం ‘ఎల్లూరు’ గ్రామం వద్ద వర్షాకాలంలో 120 టీఎంసీల కృష్ణా జలాలను తరలిస్తూ పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండలో 30 వేల ఎకరాల భూమికి సాగునీరు, అలాగే 1,228 గ్రామాలకి త్రాగునీరు అందించడం దీని లక్ష్యం. కృష్ణమ్మ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా నార్లాపూర్ అంజనగిరి, ఏదుల వీరాంజనేయ, వట్టెం వెంకటాద్రి, కరివేన కురుమూర్తి జలాశయాల గుండా ప్రవహించి లిఫ్ట్ ద్వారా రంగారెడ్డిలోని ఉద్దండాపూర్, లక్ష్మీ దేవిపల్లి జలాశయాలకు చేరుతుంది. సెప్టెంబర్ 16న ‘రంగారెడ్డి–పాలమూరు’ ప్రాజెక్ట్‌ను కొల్లాపూర్ మండలంలో ‘సింగోటం’ వద్ద కేసీర్ ప్రజలకి అంకితం చేస్తున్నారు. నీటి శబ్దం, నీటి స్పర్శ మానవ భావోద్వేగాలకు ప్రతీకగా ఇక్కడ జరిగే ఉద్వేగ మహత్తర అంకిత సభకు ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల సర్పంచ్‌లతో పాటు అశేష ప్రజానీకం తరలి రానున్నారు. కృష్ణమ్మ నీటిని కలశాలలో తీసుకొని వెళ్లి ఆయా గ్రామ దేవాలయాల స్వామి పాదాలకు అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆనతి కాలంలోనే తెలంగాణలో 78 శాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయాన్ని పండుగగా మార్చే గౌరవప్రద జీవన భూమికను కేసీఆర్ పోషిస్తున్నారు. పరవళ్ళు తొక్కుతూ వస్తున్న నీటిని, కళ్ళ ముందునుంచి పారిపోతున్న నీటిని దోసిళ్ళతో ఒడిసిపట్టుకుంటున్న సంస్కృతిని సాగుచేస్తున్నారు. జీవన సంక్షోభం ద్వారా వచ్చిన ఆత్మన్యూనత స్థానంలో అభివృద్ధి సుభిక్ష ఆత్మ గౌరవ పతాకాన్ని జన మనో కేతనంగా మార్చిన యుగ కర్తగా నిలిచిపోతారు కేసీఆర్. పాలమూరు బిడ్డగా, ఇక్కడి ప్రజల విధేయుడిగా, కేసీఆర్ ఉద్యమ సహచరుడిగా, ప్రభుత్వ పాలనలో తన అనుచరుడిగా ఇతిహాసాన్ని తలపించే పాలమూరు పునరుజ్జీవన చరిత్ర నిర్మాణంలో నేనూ ఒకడిగా ఉండడం పరమానందంగా ఉంది. నిరసనోళ్ల శ్రీనివాస గౌడ్ - వ్యాసకర్త రాష్ట్ర మంత్రివర్యులు ------------- BJP : విమోచనం : హైదరాబాదు సంస్థానంలో ఉన్న వారందరూ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి సామాజికంగా, సాంస్కృతికంగా కలిసి వున్నారు. ఈ సంస్థానాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనీ, ఉర్దూను అధికార భాషగా రుద్దాలనీ నిజాం విషపూరితంగా ఆలోచించిన తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. భారత ప్రభుత్వం ‘పోలీసు చర్య’ను మొదలుపెట్టి, ప్రజలకు ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించింది. హైదరాబాద్ సంస్థాన విమోచనకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిస్తే ‘భారత ప్రభుత్వ దౌత్యం, సామాన్య ప్రజల త్యాగం, యుద్ధం, విలీనం’ లాంటివి చరిత్ర పుటలలో కనబడుతాయి. ఆనాడు, తెలంగాణా, మరాఠ్వాడ, కర్ణాటకలో విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఇప్పటికీ వీటి భయానక ఛాయలు కనబడతాయి. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ వారికీ, నిజాముకూ మధ్య జరిగిన ఒప్పందానికి వ్యతిరేకంగా 1800 సంవత్సరంలోనే స్వాతంత్య్ర పోరాటం పురుడు పోసుకుంది. హిందువులు, ముస్లింలు కలిసి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హిందూ – ముస్లిం ఐక్యతకు ఇది దర్పణం. ఆంగ్లేయులు సంపదను విచ్చలవిడిగా దోచుకొని దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేశారు. 1857 జూలై 17న మౌల్వి అల్లాఉద్దిన్, తుర్రేభాజ్ ఖాన్ నాయకత్వంలో వందలాది మంది హిందూ, ముస్లింలు కోఠీలో గల బ్రిటిష్ రెసిడెన్సీపై దాడిచేశారు. ఫలితంగా తుర్రేభాజ్ ఖాన్‌ను హతమార్చి శవాన్ని కోఠీలో వేలాడదీశారు. అల్లాఉద్దిన్ అండమాన్ జైళ్లో 1884లో కన్నుమూశారు. అప్పుడే పుంజుకున్న రాంజీ గోండ్ తిరుగుబాటు తరువాత, వీరులను ప్రభుత్వం నిర్మల్ పట్టణంలో మఱి -
చరిత్ర వక్రీకరణ మహానేరం
చరిత్రను వక్రీకరించడం జనసంహారం చేసే ఆయుధాల కన్నా ప్రమాదకరం. అది ప్రజలను తరతరాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. చరిత్ర ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది భావి తరాలకు మార్గదర్శి. తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక అవసరాలకు చరిత్రను ఒక సాధనంగా చూడటమనేది స్వార్థ చింతన. చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేయడమనేది ఒక రాజకీయ దృక్పథంగా మారిపోవడం విషాదం. ప్రస్తుతం తెలంగాణ సమాజం అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ విమోచన, విలీనం, విద్రోహం, సమైక్యత అనే వాదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిష్పాక్షిక దృష్టితో చూడాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరికీ ఉంది.తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తోన్న శక్తుల సంఖ్య గణ నీయంగా పెరిగిపోతున్నది. అందుకుగానూ అసత్యాలను, అర్ధ సత్యాలను తమ అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. సమత, మమత, కరుణ, ప్రేమలకు ప్రతీకగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్వేషపు విషంతో నింపాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషాప్రాంతాల కలయిక. హిందూ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాల సమ్మేళనంతో కలిసి నడిచిన గంగా–జమునా తెహెజీబ్. హైదరాబాద్ రాజ్యం కేవలం ముస్లింలు పాలించినది కాదు. రాజ్యానికి కేంద్రం నిజాం అయితే, గ్రామీణ ప్రాంతాలు హిందూ సామాజిక వర్గానికి చెందిన జమీం దారులు, జాగీర్దారుల కబంధ హస్తాల్లో ఉండేవి. నిజానికి పరోక్షంగా నిజాంలు సాగించిన దుర్మార్గాల కన్నా, ఎందరో జమీందారులు, జాగీర్దారులు సాగించిన అమానుషాలు ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిజాం పాలన అనగానే కేవలం నిజాం గుర్తుకు రావడమే సహజంగా జరుగుతోంది. ‘మానుకోట’(ఇప్పటి మహబూబాబాద్) జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి లాంటి జమీందారులు జరిపిన దారుణాలు మనం చరిత్రలో మరెక్కడా చూడం. వీటన్నింటికీ రజాకార్ల దాడులు, దౌర్జన్యాలు తోడయ్యాయి. హిందూ జమీందార్లు, ముస్లిం రజాకార్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రజాకార్ ఉద్యమం 1938లో ప్రారంభమైంది. కానీ 1947 నుంచి దౌర్జన్యాలకు వేదికగా తయారైంది. రజాకార్ అంటే స్వయం సేవకులు అని అర్థం. రజాకార్లలో కొందరు హిందువులు కూడా ఉండేవారు. ప్రభుత్వానికి అండగా ఉండడానికి రజాకార్లను వినియోగించాలన్న కొందరు ముస్లిం జమీదారుల ఒత్తిడికి తలొగ్గి వారికి ప్రత్యేకమైన అధికారాలను ప్రకటించారు. దీనితో రజాకార్లు కమ్యూనిస్టులపైనా, ఇతర ఉద్యమకారులపైనా దాడులు కొనసాగించారు. 1947 జూలై 30 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు రజాకార్లు విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన మాట నిజం. వాళ్ళను ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా నిలి చింది కమ్యూనిస్టులే. జమీందారుల, భూస్వాముల దౌర్జన్యాలకు పరాకాష్ఠగా నిలిచిన దొడ్డి కొమరయ్య హత్యతో అంటే 1946 జూలై 4న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రమైంది. ఆనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి హైదరాబాద్ స్వతంత్ర పాలనా ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసు కొన్నప్పకీ అన్ని విషయాల్లో స్వేచ్ఛగానే నిర్ణయాలు తీసుకునేది. బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తన సైన్యాన్ని హైదరాబాద్‌లో ఉంచింది. అదే మనం ఇప్పుడు చూస్తోన్న హైదరా బాద్‌లోని కంటోన్మెంట్. 1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం అన్ని సంస్థానాలను భారత యూనియన్‌లో కలపాలని అడిగింది. అందరూ ఒప్పుకున్నారు. కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు తాము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకున్నాయి. అందుకుగానూ భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం ఒక ఒడంబడికను కుదుర్చు కున్నాయి. దానినే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధ నలను పెట్టింది. అందులో ఒకటి, ఇప్పటివరకూ బ్రిటిష్ పాలనలో లేని సంస్థానం అటు పాకిస్తాన్‌లోగానీ, ఇటు భారతదేశంలో గానీ చేర వచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే నిజాం స్వతంత్ర పాకి స్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. భారతదేశంతో మాత్రం స్నేహంగా ఉండడానికి అంగీకరించాడు. 1947లో ఉనికిలోకి వచ్చిన రజాకార్ల దాడులను ఆసరాగా తీసుకొని భారత ప్రభుత్వం నిజాం మీద ఆంక్షలను పెంచింది. ఆర్థికంగా దిగ్బంధనం చేసింది. భారత ప్రభుత్వం పెంచుతోన్న ఒత్తిడిని తట్టుకోలేక నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం కొన సాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలనీ, తాము స్వతంత్రంగా కొనసాగే అవకాశం కల్పించాలనీ నివేదించింది. అది 1948 ఆగస్టు 21న చర్చలకు వచ్చింది. ఆ అభ్యర్థనను స్వీకరించాలా లేదా అనేది చర్చకు వచ్చినప్పుడు అందులో ఉన్న పది దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా, కెనడా, కొలంబియా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా అభ్యర్థనను స్వీకరించ డానికి తమ మద్దతును తెలియజేశాయి. రష్యా, చైనా, ఉక్రెయిన్ తటస్థంగా ఉన్నాయి. ఇది 1948 సెప్టెంబర్ 16న జరిగింది. అయితే దానిని ఒక రెండు రోజులు వాయిదా వేయాలని భారత ప్రభుత్వ ప్రతినిధులు తెరవెనుక కథ నడిపారు. అప్పటికే భారత సైన్యం హైదరాబాద్‌లో సైనిక చర్యలను ప్రారంభించింది. దాదాపు హైదరా బాద్ సంస్థానం పూర్తిగా ఆక్రమణకు గురైంది. తెల్లారితే సెప్టెంబర్ 17. ఆరోజు హైదరాబాద్‌ను హస్తగతం చేసుకున్నారు. సెప్టెంబర్ 17 మధ్యాహ్నంకల్లా నిజాం చేత భారత ప్రతినిధి కె.ఎం.మున్షీ ఒక ప్రకటన చేయించారు. హైదరాబాద్ ప్రభుత్వం తరఫున భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామనేది అందు లోని ప్రధానాంశం. సెప్టెంబర్ 12న మొదలుపెట్టిన సైనికదాడి మొదటి లక్ష్యం ఐక్యరాజ్య సమితి నుంచి ఫిర్యాదును వెనక్కి తీసుకునేటట్టు చేయడం. సైనిక చర్య జరిగిన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సైన్యం చేతిలో గానీ, అక్కడక్కడా జరిగిన ఘర్షణల్లోగానీ 25 వేల నుంచి 30 వేల మంది వరకు మరణించినట్టు నిజాం ప్రభుత్వం నియమించిన సుందర్‌లాల్ కమిటీ నివేదిక వెల్లడించింది. ఇది ఒక ఘట్టం. దీనినే మనం విమోచన అంటున్నాము. విమోచన అంటే శత్రువును పదవీ చ్యుతుడిని చేయాలి. కానీ అలా జరగలేదు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుమీదనే 1950 జనవరి 26 వరకు ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాతనే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో అధికారికంగా భాగమైంది. 1948 సెప్టెంబర్ 17న నిజాంను లొంగదీసుకున్న తరువాత భారత సైన్యం కమ్యూనిస్టులపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలను దోచుకున్న దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దార్లు కమ్యూనిస్టుల పోరాటంతో ఊళ్ళొదిలి పెట్టారు. భారత సైన్యం రావడంతో, కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ పల్లెలకు వచ్చారు. భారత సైన్యం, భూస్వాములు, గూండాలు కలిసి ఊరూరునీ వల్లకాడుగా మార్చేశారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ సాయుధ పోరాట విరమణ వరకూ దాదాపు 4 వేల మంది కమ్యూనిస్టులతో పాటు, వేలాది మంది సాధారణ ప్రజలు చనిపోయారు. మరి 1948 సెప్టెంబర్ 17న విమోచన అయితే, 1951 వరకు భారత సైన్యం తెలంగాణ పల్లెలపై ప్రకటించిన యుద్ధం ఎవరి విమోచనం కోసం జరిగింది? కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది నిజాం బలవంతపు లొంగుబాటుగానే చరిత్ర మనకు చెబుతున్నది. ఆ తర్వాత మూడేళ్ళ పాటు తెలంగాణ పల్లెల్లో నెత్తురు ప్రవహించింది. అందువల్ల మనం సెప్టెంబర్ 17న జరపాల్సింది సంబురాలు కాదు. మనల్ని మనం సింహావలోకనం చేసుకోవడమే. రజాకార్ల దౌర్జన్యా లనూ, అమానుషాలనూ ఎండగట్టాల్సిన సమయమిదే. కానీ భారత సైన్యం జరిపిన నరమేధాన్ని తక్కువ చేసి చూడటం ముమ్మాటికీ సరికాదు. తెలంగాణ ప్రజలు అటు నిజాం రాజు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల దోపిడీ, దౌర్జన్యాలకు బలైపోయారు. రజాకార్ల అమానుషాలను అనుభవించారు. అదేవిధంగా భారత సైన్యం చేసిన విధ్వంసాన్ని, వినాశనాన్ని కూడా చవిచూశారు. ఇదే వాస్తవం. ఇదే నగ్న సత్యం. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా..
* సైనిక చర్యకు తలవంచిన ఏడో నిజాం * రజాకార్ల ఆగడాలు అంతమైన రోజు * స్వేచ్ఛావాయువులు పీల్చిన హైదరాబాదీలుభారత్ వశమైన హైదరాబాద్ సంస్థానం * ‘సెప్టెంబర్ 17’ ప్రత్యేకం సాక్షి, సిటీబ్యూరో: 1947లో దేశానికి స్వాతంత్య్ర వచ్చినా హైదరాబాదీలు మాత్రం రజాకార్ల ఆగడాలకు బలయ్యారు. వారి వేధింపు లను భరించలేక విసిగి వేసారి పోయారు. విముక్తి కోసం కలలుగన్నారు. వారు అనుకున్నట్టుగానే 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజు లొంగుబాటుతో ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీల్చారు. భారత సైన్యం నలువైపుల నుంచి హైదరాబాద్‌ను ముట్టడించడంతో ఎట్టకేలకు ఏడో నిజాం వెన్నుచూపాడు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంతో జనమంతా పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. మువ్వన్నెల జెండాలతో పరుగులు తీశారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 తెల్లవారుజామున ‘ఆపరేషన్ పోలో’ పేరిట సైనిక చర్యకు దిగింది. అప్పటి హోంమంత్రి సర్ధార్ వల్లబ్భాయి పటేల్ ఆదేశాల మేరకు భారత సైన్యం నాలుగు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ.రుద్ర మద్రాస్ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది. అయినా చివరి క్షణం వరకు నిజాం ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగించింది. సెప్టెంబర్ 14న: దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్ , వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ దాడిని ఎదిరించలేక నిజాం సైనికులు పరుగులు తీశారు. కనిపించిన రోడ్లను, వంతెనలను ధ్వంసం చేశారు. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఆకాశంలో తిరుగుతున్న భారత యుద్ధ విమానాలకు తమ ఉనికి తెలిస్తే బాంబులు వేస్తారనే భయంతో రజాకార్లు ఇళ్లల్లో లైట్లు ఆర్పేయాలని హెచ్చరించారు. సెప్టెంబర్ 16న: ఆ రోజు రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల వశమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి సైన్యాన్ని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. కానీ సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న: ఆ రోజు సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించడంతో నగర వాసుల్లో ఉత్సాహం ఉరకలేసింది. అడుగడుగునా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌కు భారత సైన్యం కవాతు చేసింది. అదే రోజు సాయంత్రం రేడియో ప్రసంగంతో.. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటల సమయంలో నిజాం హైదరాబాద్ రేడియోలో ప్రసంగించారు. ‘నా ప్రియమైన ప్రజలారా!.. నా ప్రభుత్వం రాజీనామా ఇచ్చింది. ఈ పని ఇదివరకే చేయాల్సింది. ఆలస్యమైనందుకు విచారిస్తున్నా. యుద్ధం నుంచి నా సైన్యాన్ని విరమించుకుంటున్నా. ఐక్యరాజ్యసమితిలో పెట్టిన కేసు కూడా ఉపసంహరించుకుంటున్నా’ అని ప్రకటించారు. ఆ మరుసటి రోజు ఆయన గవర్నర్ జనరల్ రాజగోపాలాచారిని క లిశారు.