Telangana News: తెలంగాణ - పునరుజ్జీవనం వర్సెస్‌ విమోచనం!
Sakshi News home page

సెప్టెంబర్‌ 17 : BRS పునరుజ్జీవనం vs BJP విమోచనం

Published Sat, Sep 16 2023 11:50 AM | Last Updated on Sat, Sep 16 2023 2:38 PM

Sep 17 is a big oontroversy after political opinions - Sakshi

సెప్టెంబర్‌ 17 వచ్చిందంటే రాజకీయ పార్టీలు కొత్త వివాదాన్ని తీసుకొస్తున్నాయి. చరిత్రలో ఇలా జరిగింది.. ఇది మా వాదన అంటూ ఒక్కో రకంగా చెప్పుకుంటున్నాయి. నిజంగా ఏం జరిగిందన్నది మరుగునపడి పార్టీలు తీసుకొస్తున్న కొత్త వాదన మీద వర్తమానం నడుస్తోంది. నాడు ఏం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తోన్న రాజకీయనాయకులు జరిగిన దానికి తమదైన భాష్యం చెప్పుకుంటున్నాయి. సాక్షికి ఇచ్చిన వ్యాసాల్లో రెండు విరుద్ధ భావాలను పంచుకున్నాయి బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు. బీఆర్‌ఎస్‌ తరపున మంత్రి శ్రీనివాసగౌడ్‌, బీజేపీ తరపును విద్యాసాగర్‌రావు అందించిన ప్రత్యేక వ్యాసాలు ఇవి.

BRS : పునరుజ్జీవనం :  

ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యమంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. కృష్ణా–గోదావరీ జలాలను తెలంగాణలోని చేను చెల్కలను తడపడానికీ, చెరువులను నింపడానికీ, తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమానికీ ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది.  అలా చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రతిష్ఠాత్మకమైనది ‘పాలమూరు–రంగారెడ్డి.’ 

తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్‌ లైన్‌ ‘నీళ్లు, నిధులు, నియామకాలు.’ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష, ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా–గోదావరీ జలాలను చేను చెల్కలకు, చెరువులను నింపడానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమాన్ని ప్రథమ ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ఉన్న దక్కన్‌ పీఠభూమి శిఖరంగా ఉన్న తెలంగాణను ఆకుపచ్చ సీమగా మలిచే బృహత్తర కార్యక్రమాన్ని కేసీర్‌ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.

నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సమాంతరంగా నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెంపు ప్రాతిపదికగా ప్రజల భాగ స్వామ్యంతో చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’ అపూర్వ ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక సామాజిక సాంస్కృతిక వికాసం పునరుజ్జీవం పొందుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల దాష్టీకాల వలన తెలంగాణ సంక్షుభితంగా మారింది. పాలమూరు జిల్లాలో మానవ జీవన విధ్వంసం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ మనిషికి మనుగడకు మహా యుద్ధమే జరిగింది.

‘నీరు పల్లమెరుగు’ అనే కాలం చెల్లిన నమూనాతో తెలంగాణలో అత్యధిక చెరువులు ఉన్న ఉమ్మడి పాలమూరుపై నిర్లక్ష్యం చేసి బిరా బిరా కృష్ణమ్మను రానివ్వకుండా దగా చేశారు. తమ కళ్ళముందు పారుతున్న నీటిని కూడా చెరువులో నిల్వ కాకుండా చేశారు. అదే కృష్ణా– గోదావరులతో కోస్తా ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చుకున్నారు. గతి తప్పిన రుతువులు, బోర్‌ బావులతో వ్యవసాయం బావురుమన్నది. నీరు లభ్యం కాని స్థితిలో తీవ్ర దుర్భిక్షం నడుమ జీవితం నిత్య మరణంగా మారిన నేపథ్యంలో బతకడానికి దేశ విదేశాలలో వలస కూలీలుగా కట్టు బానిస జీవితం వెల్లబోస్తున్న దైన్యానికి పాలమూరు ప్రజానీకం నెట్టబడింది.

మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని అంతిమ విజయతీరం వైపు చేర్చడానికి కేసీఆర్‌ చేపట్టిన అనేక ప్రజాస్వామ్య ఉద్యమ వ్యూహాల్లో భాగంగా 2009 లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్‌ నగర్‌ నుండి ఎన్నికైనారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు, భోగోళిక స్థితిగతులను అవగాహన చేసుకున్నారు. జీవ వైవిధ్యానికి అనువుగా నల్ల రేగళ్లు, ఎర్ర చెల్కలు, ఇసుక భూములు ఉన్నాయక్కడ. నీరు అందితే దక్కన్‌ అన్నపూర్ణగా విలసిల్లే భవిష్యత్‌ ఉందని నిర్ధారించుకున్నారు. వలసలు వెళ్లిన ఇక్కడి ప్రజలు తిరిగి రావడమే కాదు, పక్క ప్రాంతాల నుండి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చే దశకు చేరుకోవాలని కోరుకున్నారు.

ఈ ప్రాంత లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించిన సంతోషంలో కృతజ్ఞతను చాటుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలనుకున్నారు. పాలమూరును పడావు పెట్టి కృష్ణా నీటిని తరలించుకుపోయిన అప్పటి ప్రాంతీయ ద్రోహులను ఎండగట్టారు. 2014లో రాష్ట్ర సాకారం తర్వాత ఉద్యమ క్రమంలోనే రూపకల్పన చేసుకున్న ఉత్తర తెలంగాణ కోసం ‘కాళేశ్వరం’, దక్షణ తెలంగాణ కోసం ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కార్యాచరణ ప్రారంభించారు.

చైనా నిర్మించిన సుప్రసిద్ధ ‘త్రీ గార్జెస్‌’ ప్రాజెక్ట్‌ కంటే గొప్పగా స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సాంకేతికతతో, ఎలక్ట్రో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అద్భుతాలతో కూడిన ‘పాలమూరు –రంగారెడ్డి' సాగునీటి ప్రాజెక్ట్‌కు 2015 జూన్‌ 11న శంఖు స్థాపన చేశారు. శ్రీశైలం ఎగువ భాగాన కొల్లాపుర్‌ మండలం ‘ఎల్లూరు’ గ్రామం వద్ద వర్షాకాలంలో 120 టీఎంసీల కృష్ణా జలాలను తరలిస్తూ పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండలో 30 వేల ఎకరాల భూమికి సాగునీరు, అలాగే 1,228 గ్రామాలకి త్రాగునీరు అందించడం దీని లక్ష్యం.

కృష్ణమ్మ నీరు గ్రావిటీ కెనాల్‌ ద్వారా నార్లాపూర్‌ అంజనగిరి, ఏదుల వీరాంజనేయ, వట్టెం వెంకటాద్రి, కరివేన కురుమూర్తి జలాశయాల గుండా ప్రవహించి లిఫ్ట్‌ ద్వారా రంగారెడ్డిలోని ఉద్దండాపూర్, లక్ష్మీ దేవిపల్లి జలాశయాలకు చేరుతుంది. సెప్టెంబర్‌ 16న ‘రంగారెడ్డి–పాలమూరు’ ప్రాజెక్ట్‌ను కొల్లాపూర్‌ మండలంలో ‘సింగోటం’ వద్ద కేసీర్‌ ప్రజలకి అంకితం చేస్తున్నారు.

నీటి శబ్దం, నీటి స్పర్శ మానవ భావోద్వేగాలకు ప్రతీకగా ఇక్కడ జరిగే ఉద్వేగ మహత్తర అంకిత సభకు ప్రాజెక్ట్‌ పరిధిలోని గ్రామాల సర్పంచ్‌లతో పాటు అశేష ప్రజానీకం తరలి రానున్నారు. కృష్ణమ్మ నీటిని కలశాలలో తీసుకొని వెళ్లి ఆయా గ్రామ దేవాలయాల స్వామి పాదాలకు అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆనతి కాలంలోనే తెలంగాణలో 78 శాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయాన్ని పండుగగా మార్చే గౌరవప్రద జీవన భూమికను కేసీఆర్‌ పోషిస్తున్నారు.

పరవళ్ళు తొక్కుతూ వస్తున్న నీటిని, కళ్ళ ముందునుంచి పారిపోతున్న నీటిని దోసిళ్ళతో ఒడిసిపట్టుకుంటున్న సంస్కృతిని సాగుచేస్తున్నారు. జీవన సంక్షోభం ద్వారా వచ్చిన ఆత్మన్యూనత స్థానంలో అభివృద్ధి సుభిక్ష ఆత్మ గౌరవ పతాకాన్ని జన మనో కేతనంగా మార్చిన యుగ కర్తగా నిలిచిపోతారు కేసీఆర్‌. పాలమూరు బిడ్డగా, ఇక్కడి ప్రజల విధేయుడిగా, కేసీఆర్‌ ఉద్యమ సహచరుడిగా, ప్రభుత్వ పాలనలో తన అనుచరుడిగా ఇతిహాసాన్ని తలపించే పాలమూరు పునరుజ్జీవన చరిత్ర నిర్మాణంలో నేనూ ఒకడిగా ఉండడం పరమానందంగా ఉంది.


నిరసనోళ్ల శ్రీనివాస గౌడ్‌
- వ్యాసకర్త రాష్ట్ర మంత్రివర్యులు

-------------

BJP : విమోచనం :  

హైదరాబాదు సంస్థానంలో ఉన్న వారందరూ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి సామాజికంగా, సాంస్కృతికంగా కలిసి వున్నారు. ఈ సంస్థానాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనీ, ఉర్దూను అధికార భాషగా రుద్దాలనీ నిజాం విషపూరితంగా ఆలోచించిన తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. భారత ప్రభుత్వం ‘పోలీసు చర్య’ను మొదలుపెట్టి, ప్రజలకు ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించింది.

హైదరాబాద్‌ సంస్థాన విమోచనకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిస్తే ‘భారత ప్రభుత్వ దౌత్యం, సామాన్య ప్రజల త్యాగం, యుద్ధం, విలీనం’ లాంటివి చరిత్ర పుటలలో కనబడుతాయి. ఆనాడు, తెలంగాణా, మరాఠ్వాడ, కర్ణాటకలో విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఇప్పటికీ వీటి భయానక ఛాయలు కనబడతాయి. హైదరాబాద్‌ సంస్థానంలో బ్రిటిష్‌ వారికీ, నిజాముకూ మధ్య జరిగిన ఒప్పందానికి వ్యతిరేకంగా 1800 సంవత్సరంలోనే స్వాతంత్య్ర పోరాటం పురుడు పోసుకుంది. హిందువులు, ముస్లింలు కలిసి బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హిందూ – ముస్లిం ఐక్యతకు ఇది దర్పణం.

ఆంగ్లేయులు సంపదను విచ్చలవిడిగా దోచుకొని దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేశారు. 1857 జూలై 17న మౌల్వి అల్లాఉద్దిన్, తుర్రేభాజ్‌ ఖాన్‌ నాయకత్వంలో వందలాది మంది హిందూ, ముస్లింలు కోఠీలో గల బ్రిటిష్‌ రెసిడెన్సీపై దాడిచేశారు. ఫలితంగా తుర్రేభాజ్‌ ఖాన్‌ను హతమార్చి శవాన్ని కోఠీలో వేలాడదీశారు. అల్లాఉద్దిన్‌ అండమాన్‌ జైళ్లో 1884లో కన్నుమూశారు. అప్పుడే పుంజుకున్న రాంజీ గోండ్‌ తిరుగుబాటు తరువాత, వీరులను ప్రభుత్వం నిర్మల్‌ పట్టణంలో మఱి<చెట్టుకు ఉరితీసింది. అదే ఉరిల మఱిగా పేరొందింది. జల్‌ – జమీన్‌ – జంగల్‌ కోసం గిరిజనులు జరిపిన పోరాటం, దానికి నాయ కత్వం వహించిన కుమ్రం భీం ఆత్మార్పణ ప్రజల స్వాభిమానాన్ని తట్టిలేపాయి.

విభజించు, పాలించు అన్న బ్రిటిష్‌ వారి చర్యల వల్ల 1927లోనే ముస్లింల కోసం నిజాం ‘అంజుమన్‌ – ఎ – తబ్లిక్‌ – ఎ –ఇస్లాం’ పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. దానికి బహాదూర్‌  యార్‌ జంగ్‌ నాయకుడు. అదే రంగులు మార్చి ‘మజ్లీస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లమీన్‌’  అయింది. హైదరాబాదు సంస్థానంలో ఉన్న వారందరూ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి సామాజికంగా, సాంస్కృతికంగా కలిసి వున్నారు. ఇందులో 86 శాతం హిందువులు, పన్నెండున్నర శాతం ముస్లింలు, ఒకటిన్నర శాతం క్రైస్తవులు, ఇతరులు. అత్యధికులు తెలుగు, మరాఠీ, కన్నడ మాట్లాడేవారు. ఉర్దూ కేవలం పాలకులు, వారికి సంబంధించిన వారికే పరిమితమై ఉండేది. నిజాం ఈ సంస్థానాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనీ, ఉర్దూను ప్రజలందరిపైన అధికార భాషగా రుద్దాలనీ విషపూరితంగా ఆలోచించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

బ్రిటిష్‌వారు దేశం వదిలి వెళ్లేముందు తీసుకువచ్చిన బలహీన చట్టాన్ని ఆసరాగా తీసుకొని నిజాము హైదరాబాదు సంస్థానాన్ని ఒక స్వతంత్ర దేశంగా పేర్కొని, దానికి తనను సార్వభౌమునిగా ప్రకటించుకున్నాడు. దీనికి అదనంగా మత దురహంకారి ఖాసిం రజ్వి నిజాముకు మద్దతిస్తూ ఒక చేత్తో ఖురాన్, మరో చేత్తో తల్వార్‌ పట్టుకొని ఢిల్లీపై తమ జండాని ఎగురవేస్తానని ప్రగల్భాలు పలికాడు. 1947 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్‌ 1948 వరకు నడిచిన హైదరాబాదు సంస్థాన చరిత్ర ఉద్వేగభరితమైనది.

మానభంగాలు, దోపిడీలు నిత్యకృత్యాలయినాయి. దౌత్యపరంగా ఆలోచించి భారత ప్రభుత్వమే 1948 నవంబర్‌ 29న నిజాముతో యథాత«థ ఒప్పందాన్ని చేసుకుంది. అయినా మతమార్పిడిలు చెయ్యాలనీ, ఉర్దూ తప్ప మరే భాష ఉండకూడదనీ నిజాము చర్యలు తీసుకున్నాడు. తబ్లీక్‌ అనే మతమార్పిడి ఉద్యమానికి ప్రతి తహసిల్‌ ఆఫీసులో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేశాడు. లక్షలాది మంది పోలీసులను, రజాకార్లను గ్రామాలపైకి ఉసిగొల్పాడు.

ఈ అనివార్య పరిస్థితులలో అతి సామాన్యులైన స్త్రీ, పురుషులు దృఢచిత్తులై పోరాడిన వారి త్యాగాలు అనితరసాధ్యం. ‘అనిల్‌ మాలిక్‌’ అనే ప్రమాదకరమైన నినాదం అప్పుడు ఉనికిలో ఉండేది. దీని అర్థం ముస్లింలు అందరూ ప్రభువులేనని. జైళ్ళల్లో బంధించబడ్డ సమర యోధులను రజాకార్ల చేత కొట్టించడానికి జైలు ద్వారాలను తెరిపించేవారు. నిజామాబాదు జైళ్లో దాశరథికి కూడా ఈ దుఃస్థితి తప్పలేదు. జైలు గోడలపైన ఆయన ‘కోటి రతనాల వీణ నా తెలంగాణ’ అని బొగ్గుతో రాసిన రాత ఇంకా మండుతూనే ఉంది.

ఈ క్రమంలో వరంగల్‌ జిల్లా బైరాన్‌ పల్లిలో రజాకార్లు మారణ హోమాన్ని సృష్టించారు. రజాకార్లు మొదటిసారి దాడికి వస్తే గ్రామస్థులు అడ్డుకున్నారు. పగబట్టిన రజాకార్లు రెండవసారి తరలి వచ్చినా బురుజు మీద ఉన్నవారు గ్రామ ప్రజలను భేరీ ద్వారా అప్రమత్తం చేశారు. మూడు, నాలుగు, అయిదవ సారి జరిగిన దాడి కూడా విఫలమైంది. అయిదు సార్లు ప్రతిఘటించడం వల్ల ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుంది.

1948 ఆగస్టు 25న తమ ప్రతాపం చూపించుకోవడానికి విదేశీ పత్రికా విలేఖరులను వెంట బెట్టుకొని, అధునాతనమైన ఆయుధాలతో దాడి జరిపారు. రజాకార్ల సైన్యం గ్రామం చుట్టుముట్టి ఎక్కడి వారిని అక్కడే పట్టుకున్నారు. అధునాతన ఆయుధాల ముందు గ్రామస్థుల నాటు తుపాకులు సరితూగ లేకపోయాయి. దుర్మార్గులైన నిజాం సైన్యం, దాదాపు 84 మందిని వరుసగా నిలబెట్టి ఒక్కొక్క గుండుకు ఎంతమంది చస్తారు అని లెక్కించిన పాశవిక ఆనందాన్ని పొందిన దుర్ఘటన బహుశా దేశంలో ఎక్కడా లేదు.

ఇటువంటి ఘటనల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 13 నాడు నిజామును నిలవరించ డానికి పోలీసు చర్యను మొదలుపెట్టి, ప్రజలను నిరంకుశ నిజాము కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 మాసాల 2 రోజులకు ఈ ప్రాంతంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే అవకాశం కల్పించి విలీన ప్రక్రియను పూర్తిచేశారు.


చెన్నమనేని విద్యాసాగర రావు
- వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement