rajamandri city
-
చెత్తతో ‘పవర్’ ఫుల్
సాక్షి, అమరావతి: మున్సిపాలిటీల్లో రోజురోజుకు పెరుగుతున్న చెత్తను.. ఉపయుక్తంగా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా చెత్త ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు సమీపంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను.. ప్రాసెస్ చేసేలా విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ గత నెలలో ఆదేశించారు. ఆ మేరకు ప్లాంట్ సామర్థ్యం, నిర్వహణపై రూపొందించిన నివేదికను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సమర్పించగా.. ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. దీంతో 7.5 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిద్ధమైంది. సమీప పట్టణ స్థానిక సంస్థల నుంచి రోజుకు సగటున 400 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 22 పట్టణ స్థానిక సంస్థల నుంచి చెత్త తరలింపు.. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 22 పట్టణ స్థానిక సంస్థలను క్లస్టర్‌గా ఏర్పాటు చేయనున్నారు. వీటి పరిధిలో రోజూ సుమారు 850 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంచనా వేసింది. ఇందులో 400 మెట్రిక్ టన్నులు పొడి వ్యర్థాలు కాగా, మిగిలింది తడి చెత్త. తడి వ్యర్థాలను ముమ్మిడివరం, అమలాపురంలో ఏర్పాటు చేసిన కంపోస్ట్ ప్లాంట్ల ద్వారా ఎరువుగా మారుస్తున్నారు. మిగిలిన చోట్ల ఉన్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్లాంట్లలో ఇనుము, గాజు, ప్లాస్టిక్, రబ్బర్ వంటివి వేరుచేస్తున్నారు. పునర్ వినియోగానికి, బయో ఎరువుగా మార్చేందుకు వీలులేని చెత్తను రాజమండ్రి వద్ద ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌కు తరలిస్తారు. పర్యావరణానికి హాని కలగకుండా.. దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టడం, నదీ జలాల్లో పడేయడం వంటి చర్యలు పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని నీతి ఆయోగ్ తేల్చింది. ఈ నేపథ్యంలో ఘన వ్యర్థాలను ఆధునిక పద్ధతుల్లో విద్యుత్‌గా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు అనుగుణంగా రూ.640 కోట్లతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో రెండు విద్యుత్ ప్లాంట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వీటిలో రోజూ సుమారు 1,600 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి దాదాపు 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఆయా ప్లాంట్లకు సమీపంలోని మున్సిపాలిటీల్లో సేకరించిన వ్యర్థాలను ఈ ప్లాంట్లకు తరలిస్తున్నారు. వీటి తరహాలోనే త్వరలో రాజమండ్రి వద్ద కూడా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
16న సీఎం పర్యటన
కలెక్టరేట్ (కాకినాడ), న్యూస్‌లైన్ : రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 16న రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పర్యటించనున్నారని కలెక్టర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. మండల, డివిజనల్ అధికారులతో కలెక్టరేట్ నుంచి ఆమె సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లూ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రచ్చబండ కార్యక్రమాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రామాణీకరించిన బ్యాక్ డ్రాప్‌లను మాత్రమే ప్రదర్శించాలన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి దరఖాస్తుకూ తప్పనిసరిగా రశీదు అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవలి భారీ వర్షాల వల్ల ఐదు రోజులకు పైబడి ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు 20 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. మూడు రోజులు ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు 10 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేయాలని సూచించారు. బాధితుల వివరాలు, పంట, ఇళ్లకు జరిగిన నష్టాల జాబితాను వారం రోజుల్లో పూర్తి చేయాలని, నమోదు సక్రమంగా చేయాలని చెప్పారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సమీక్షిస్తూ జిల్లాలో కొత్తగా అర్హత పొందిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో బి.యాదగిరి, సీపీఓ వి.మహీపాల్, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ చంద్రశేఖరరాజు, జేడీఏ ఎన్.విజయ్ కుమార్, జేడీ ఏహెచ్ లివింగ్స్టన్, మత్స్యశాఖ జేడీ గోవిందయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.