తన్నుకున్నారు
కోరుకొండ, న్యూస్‌లైన్ :ఏఐసీసీ పరిశీలకుల ఎదుటే రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ముష్ఠి యుద్ధానికి తెగబడ్డారు. బుధవారం సాయంత్రం కోరుకొండ హరేరామ సమాజంలో జరిగిన పార్టీ సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లు బాబి, ఏఐసీసీ పరిశీలకులుగా డాక్టర్ కె. సుధాకర్ (కర్ణాటక), జంగం గౌతమ్ తదితరులు వచ్చారు. కోరుకొండ, రాజానగరం, సీతానగరం మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు హాజరవగా అందరినీ వేదికపైకి వచ్చి అభిప్రాయాలు తెలపాలని పరిశీలకులు సూచించారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అంకం గోపి, మండల పార్టీ అధ్యక్షుడు దేశాల శ్రీను, పార్టీనాయకులు డాక్టర్ వడయార్, కురేళ్ల గంగరాజు తదితరులు మాట్లాడారు.
ఈసందర్భంగా అంకం గోపి, దేశాల శ్రీను వర్గీయుల మధ్య మాటా మాటా పెరిగి ఇరువర్గాలూ తోపులాటకు దిగాయి. పెద్దగా అరచుకుంటూ బాహాబాహీకి సిద్ధం కావడంతో పరిశీలకులు, ముఖ్యనాయకులు బయటకు పరుగులు తీశారు. కుర్చీలను ఎత్తి ఒకరిపై ఒకరు విసురుకుంటూ, పరస్పరం పిడిగుద్దులతో ఇరువర్గాలూ కలబడడంతో సభాప్రాంగణం అరుపులు, ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. మహిళలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరుగులు తీశారు. నాయకులు, పరిశీలకులు బయటికి రావడంతో వారి వెనకే వచ్చిన ఇరు వర్గాలూ హాలు బయట కూడా కొట్లాటకు దిగాయి. డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు శాంతపరిచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. తరువాత మీటింగ్ హాల్లోకి మండల వారీగా క్యాటగిరీలు, కులాలను బట్టి నాయకుల్ని వరుసగా లోపలికి పంపారు.
కొందరు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను కోరుతూ పరిశీలకులకు దరఖాస్తులు అందజేశారు. సమావేశం అనంతరం నేతలు బయటికి రాగానే ‘చిట్టూరి రవీంద్ర నాయకత్వం వర్థిల్లాల’ని కొందరు, అంకం గోపి నాయకత్వం వర్ధిల్లాలని మరికొందరు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పరిశీలకులు సుధాకర్, గౌతమ్ మాట్లాడుతూ సోనియా, రాహుల్‌లకు జై అనండని, జై కాంగ్రెస్ అని నినదించండని హితవు పలికారు. కాగా సమావేశానికి హాజరైన వారిలో టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యుడు చిట్టూరి రవీంద్ర, డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు బొల్లిన సుధాకర్, అయిల శ్రీను, కవల కృష్ణమూర్తి, వర్రే కాటంరాజు, ముసునూరి వీరబాబు, నక్కా సౌదామణి, కొంచ చంద్రభాస్కర్, ఓగేటి రవికుమార్, పేపకాయల విష్ణుమూర్తి, వేగిరాజు సునీత, నక్కా రాంబాబు తదితరులు ఉన్నారు.
సభ
రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు ప్రశాంతగా జరిగాయని, ఒక్క రాజానగరంలోనే ఇలా అయిందని కె. సుధాకర్, గౌతమ్, దొమ్మేటి తదితరులు చెప్పారు. సభ అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు టికెట్లు కోరుతూ 8 దరఖాస్తులు వచ్చాయన్నారు. సభలో జరిగిన ఘర్షణపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.