RAJANNA Brahmotsava
-
వైభవంగా రాజన్న కల్యాణోత్సవం..
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది. వేదమూర్తుల మంత్రోచ్ఛరణల మధ్య ఉదయం 10.50 గంటలకు కల్యాణం జరిపించారు. రాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఈ తంతు నిర్వహించారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో సుమారు రెండున్నర గంటలపాటు కల్యాణం జరిపించారు. కోవిడ్–19 నిబంధనల మే రకు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆలయంలోకి భక్తులు రాకుండా కట్టడిచేశారు. ఒకే క్యూలైన్ ద్వారా రాజన్న దర్శనానికి అనుమతించారు. అయినప్పటికీ, 50 వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. చేతిలో త్రిశూలం, తలపై జీలకర్ర, బాసింగాలతో శివ పార్వతులు శ్రీరాజరాజేశ్వరస్వామిని వివాహం చేసుకున్నారు. మాస్క్‌లు లేకుండా భక్తులు భారీసంఖ్యలో తరలిరావడంతోపాటు ఎక్కడా కోవిడ్ నిబంధనలు అమలు కాలేదు. -
వైభవంగా శివకల్యాణం
లక్ష మందికిపైగా భక్తుల హాజరు వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం వైభవంగా జరిపించారు. ఐదురోజులపాటు జరుపుకునే రాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు కల్యాణోత్సవం నిర్వహించారు. నగర పంచాయతీ తరఫున కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు స్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్తములు కల్యాణాన్ని కన్నులపండువగా జరిపించారు. ఉదయం 6 గంటలకు స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, అభిషేకాలు, పారాయణాలు, 6.50 గంటలకు తీర్థరాజపూజ, అవాహిత దేవతార్చనలు, వృషభ యాగం, ధ్వజారోహణం, ఎదుర్కోళ్ల కార్యక్రమం అనంతరం స్వామివారి కల్యాణం నిర్వహించారు. సాయంత్రం పురాణ ప్రవచనం, ప్రధాన హోమం, సప్తపది, లాజాహోమం, ఔపాసనం, బలిహరణ కార్యక్రమాల అనంతరం రాత్రి పెద్దసేవపై స్వామివారిని ఊరేగించారు. ఈసారి లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కల్యాణోత్సవం ముగియడంతో భక్తులు బయటికి వెళ్లే క్రమంలో ఉత్తర ద్వారం వద్ద తోపులాట చోటుచేసుకుంది. కార్యక్రమంలో ఈవో దూస రాజేశ్వర్, నగరపంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ భర్త లక్ష్మీరాజం, వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ, ఏసీ ఉమారాణి, ఏఈవోలు గౌరీనాథ్, దేవేందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, కౌన్సిలర్లు, పట్టణంలోని ప్రముఖులు పాల్గొన్నారు. -
14 నుంచి ‘రాజన్న’ బ్రహ్మోత్సవాలు
⇒ 15న కల్యాణోత్సవం ⇒ సన్నాహాలు చేస్తున్న అధికారులు వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చేనెల 14 నుంచి 18వరకు రాజన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించేందకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మహాశివరాత్రి ముగిసిన అనంతరం శివకల్యాణోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోం ది. 15న పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్ల కల్యాణోత్సవం, 16న సదస్యం, 17న సాయంత్రం ఉత్సవమూర్తుల రథోత్సవం, 18న అవబృత స్నానం, త్రిశూల యాత్ర, ఏకాదశవరణములతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయని అర్చకులు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా శైవ క్షేత్రాలలో ‘కారణాగమము’ అనుసరించి మహాశివరాత్రి పర్వదినం రోజునే కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. కానీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ‘స్మార్థ వైదిక’ పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి అనంతరం కామదహనం మరుసటి రోజున పార్వతీపరమేశ్వరుల వివాహం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఇరుకైన ప్రదేశంతో ఇబ్బందులు రాజన్న భక్తులు, శివపార్వతులు కల్యాణోత్సవంలో పాల్గొని శివుడిని వివాహమాడటం ఆనవాయితీగా వస్తోంది. ఆలయంలోని అద్దాల మంటపంలో శివకల్యాణోత్సవం జరిపిస్తారు. లక్షలాదిగా తరలివచ్చే శివపార్వతులకు ఈ స్థలం ఏ మూలనా సరిపోవడం లేదు. ఇరుకైన ప్రదేశంలో కల్యాణోత్సవం నిర్వహించడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు ఇప్పటికే శివపార్వతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాజన్న గుడిలో జరిగే ఉత్సవాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న క్రమంలో ఈసారి కల్యాణోత్సవ వేదికను మార్పు చేస్తారా..? లేక అదే ప్రాంతంలో కొనసాగిస్తారా అన్న సందేహాలు ప్రారంభమయ్యాయి.