
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది. వేదమూర్తుల మంత్రోచ్ఛరణల మధ్య ఉదయం 10.50 గంటలకు కల్యాణం జరిపించారు. రాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఈ తంతు నిర్వహించారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో సుమారు రెండున్నర గంటలపాటు కల్యాణం జరిపించారు. కోవిడ్–19 నిబంధనల మే రకు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆలయంలోకి భక్తులు రాకుండా కట్టడిచేశారు.
ఒకే క్యూలైన్ ద్వారా రాజన్న దర్శనానికి అనుమతించారు. అయినప్పటికీ, 50 వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. చేతిలో త్రిశూలం, తలపై జీలకర్ర, బాసింగాలతో శివ పార్వతులు శ్రీరాజరాజేశ్వరస్వామిని వివాహం చేసుకున్నారు. మాస్క్‌లు లేకుండా భక్తులు భారీసంఖ్యలో తరలిరావడంతోపాటు ఎక్కడా కోవిడ్ నిబంధనలు అమలు కాలేదు.