14 నుంచి ‘రాజన్న’ బ్రహ్మోత్సవాలు
⇒ 15న కల్యాణోత్సవం
⇒ సన్నాహాలు చేస్తున్న అధికారులు
వేములవాడ :
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చేనెల 14 నుంచి 18వరకు రాజన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించేందకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మహాశివరాత్రి ముగిసిన అనంతరం శివకల్యాణోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోం ది. 15న పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్ల కల్యాణోత్సవం, 16న సదస్యం, 17న సాయంత్రం ఉత్సవమూర్తుల రథోత్సవం, 18న అవబృత స్నానం, త్రిశూల యాత్ర, ఏకాదశవరణములతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయని అర్చకులు తెలిపారు.
రాష్ట్రంలోని మిగతా శైవ క్షేత్రాలలో ‘కారణాగమము’ అనుసరించి మహాశివరాత్రి పర్వదినం రోజునే కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. కానీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ‘స్మార్థ వైదిక’ పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి అనంతరం కామదహనం మరుసటి రోజున పార్వతీపరమేశ్వరుల వివాహం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.
ఇరుకైన ప్రదేశంతో ఇబ్బందులు
రాజన్న భక్తులు, శివపార్వతులు కల్యాణోత్సవంలో పాల్గొని శివుడిని వివాహమాడటం ఆనవాయితీగా వస్తోంది. ఆలయంలోని అద్దాల మంటపంలో శివకల్యాణోత్సవం జరిపిస్తారు. లక్షలాదిగా తరలివచ్చే శివపార్వతులకు ఈ స్థలం ఏ మూలనా సరిపోవడం లేదు. ఇరుకైన ప్రదేశంలో కల్యాణోత్సవం నిర్వహించడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు ఇప్పటికే శివపార్వతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాజన్న గుడిలో జరిగే ఉత్సవాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న క్రమంలో ఈసారి కల్యాణోత్సవ వేదికను మార్పు చేస్తారా..? లేక అదే ప్రాంతంలో కొనసాగిస్తారా అన్న సందేహాలు ప్రారంభమయ్యాయి.