ప్రశ్న పత్రాలు రాక.. అభ్యర్థుల్లో కాక!
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : స్థలం : విశాఖ అక్కయ్యపాలెంలో జ్ఞాన నికేతన్ స్కూలు
సమయం : ఉదయం 9 గంటలు
సందర్భం : వీఆర్వో పరీక్ష జరగనున్న తరుణం
వీఆర్వో పరీక్ష నిర్వహణకు రంగం సిద్ధమైంది... తొమ్మిదయ్యేసరికి అభ్యర్థుల రాక మొదలైంది. ఒకొరొకరుగా, వడివడిగా పరీక్షార్థుల రాక మొదలైంది. తొమ్మిదిన్నర అయ్యేసరికల్లా అభ్యర్థులకు లోపలికి అనుమతించే కార్యక్రమం మొదలైంది. 9.50 కల్లా పరీక్ష కేంద్రంలో ఉన్న 21 కేంద్రాల్లో అభ్యర్థులకు ప్రశ్న పత్రాలు ఇవ్వవచ్చనడానికి సూచికగా గంట గణగణమని మోగింది. పరీక్ష నిర్వాహకులు ఏపీపీఎస్సీ పంపిన క్వశ్చన్ పేపర్ బండిల్‌ను పలువురు అధికారుల సమక్షంలో ఓపెన్ చేశారు.
షాక్! : ప్రశ్న పత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. మళ్లీ లెక్కించారు.. చాలా జాగ్రత్తగా లెక్కించారు.. అవును ప్రశ్న పత్రాలు తక్కువగానే ఉన్నాయి! 500 మంది అభ్యర్థులు ఉండగా 184 ప్రశ్న పత్రాలు మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలి? ఏం చేయాలి? అధికారుల్లో టెన్షన్! విషయం మెరుపు వేగంతో ఉన్నతాధికారులకు చేరింది. కలెక్టర్.. జారుుంట్ కలెక్టర్.. డీఆర్వో.. ఏపీపీఎస్సీ సభ్యుడు.. అబ్జర్వర్లు.. పోలీస్ ఉన్నతాధికారులు..అందరికీ విషయం చేరింది. హుటాహుటిన పరీక్ష కేంద్రానికి అధికారులందరూ చేరారు. పరీక్ష బండిల్‌ను చూసి వారు కూడా నిర్ఘాంతపోయూరు. ఏం చేయాలో తేలక అంతా తలలు పట్టుకున్నారు.
10:10 గంటలు.. అభ్యర్థుల్లో టెన్షన్. ప్రశ్న పత్రాలు ఇంకా ఇవ్వడం లేదేమిటని అంతా అడగడం మొదలెట్టారు. వస్తున్నాయని ఇన్విజిలేటర్లు నచ్చజెప్పడం మొదలెట్టారు. పదిన్నర అయింది. 10.40 కూడా అయింది. అభ్యర్థుల్లో వేడి పుట్టింది. ప్రశ్న పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నల వర్షం మొదలైంది. వారిని నచ్చజెబుతూనే, ఇతర కేంద్రాల నుంచి ప్రశ్న పత్రాలు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. 11 గంటల కల్లా అభ్యర్థులు మీడియా దృష్టికి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరో అరగంటకు వివిధ పరీక్ష కేంద్రాలలో మిగిలిన ప్రశ్న పత్రాలు తెచ్చి అభ్యర్థులకు అందజేశారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు పరీక్ష నిర్వహించారు.
ఇదేనా న్యాయం?
‘సార్.. కోటవురట్ల మండలం కైలాసపట్నం నుంచి చంటి పిల్లాడ్ని ఎత్తుకుని పరీక్షకు రావడం ఐదు నిమిషాలు ఆలస్యమైంది. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి రాత్రింబవళ్లు చదివాను. ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడం నా తప్పే. మానవతా హృదయంతో ఆలోచించి పరీక్ష హాల్లోకి పంపండి’ అంటూ రాజేశ్వరి అనే యువతి లబోదిబోమంది..చివరకు కన్నీరు పెట్టింది. అయినా అధికారులు స్పందించలేదు. మా రూల్స్ మేరకే మేము వ్యవహరిస్తాం. అని చెప్పడంతో ఆ అభ్యర్థిని చంటి పిల్లాడిని ఎత్తుకుని వెనుదిరిగింది.
తప్పేమీ జరగలేదు
తప్పేమీ జరగలేదు. క్వశ్చన్ పేపర్లు కొంత షార్ట్ వచ్చాయి. కొన్ని కేంద్రాల్లో ఎక్కువ క్వశ్చన్ పేపర్లు వెళ్లారుు. అక్కడి నుంచి తెప్పించాం.
- పెద్దయ్య, ఏపీపీఎస్సీ సభ్యుడు