Rajendranagar police
-
దారుణం: 30 వేల కోసం కన్న కొడుకునే..
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి డబ్బుల కోసం రెండు నెలల తన కొడుకును విక్రయించాడు. ఆ చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎంఎం పహాడిలో నివాసం ఉంటున్న సయ్యద్ హైదర్, షహానా బేగం దంపతులకు రెండు నెలల చిన్నారి ఉన్నాడు. గత రెండు మూడు రోజుల నుంచి బాబును అమ్మి ఇంట్లోకి వస్తువులు తెచ్చుకుందామని సయ్యద్ తన భార్యతో గొవడ పడ్డాడు. ఈ నేపథ్యంలోనే డబ్బుల కోసం తండ్రి సయ్యద్ తన చిన్నారిని విక్రయించాడు. తల్లి షహానా బేగం నమాజ్‌కు వెళ్లిన సమయంలో సయ్యద్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారి కనిపించక పోవడంతో భర్తపై అనుమానంతో భార్య షహానాబేగం పోలీసులను ఆశ్రయించారు. తన భర్త రూ.30వేల కోసం, ఇంట్లోకి వస్తువుల తీసుకోవడానికి బాబును అమ్మేశాడని భార్య రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని షహానా బేంగం పోలీసులను కోరింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: దేవుడికి నా ఇష్టం వచ్చినట్లు పూజలు చేసుకుంటా -
వెలుగు చూసిన సుపారీ కుట్ర
మొయినాబాద్(చేవెళ్ల) : ఓ హార్డ్‌వేర్ షాపు నిర్వాహకుడిని హత్య చేసేందుకు మరో షాపు నిర్వాహకుడు కుట్ర పన్నాడు. అతన్ని హత్య చేస్తే డబ్బులు ఇస్తానని నలుగురు యువకులతో డీల్ కుదుర్చుకున్నాడు. డబ్బులకు ఆశపడి హత్య చేయడానికి సిద్ధమైన యువకులు ఇనుప రాడ్డుతో హార్డ్‌వేర్ షాప్ నిర్వాహకుడిపై దాడి చేశారు. తలపై గట్టిగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. అతడు చనిపోయాడని భావించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. మొయినాబాద్ మండల కేంద్రంలో తొమ్మిది నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. కానీ అప్పటి సీఐ కేసు పక్కన పెట్టారు. ఇటీవల మొయినాబాద్‌లో జరిగిన ఓ గొడవతో అప్పటి దాడి విషయం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు దాడికి కారణమైనవారితోపాటు దాడికి పాల్పడినవారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వివరాలు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అశోక్(32) తన కుటుంబంతో పదేళ్ల క్రితం మొయినాబాద్‌కు వచ్చి హార్డ్వేర్షాపు నిర్వహిస్తున్నాడు. గతేడాది ఏప్రిల్ 1న రాత్రి షాపు మూసే సమయంలో బైకుపై ముఖాలకు ముసుగులతో ఇద్దరు దుండగులు వచ్చి అతడిపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. దీంతో అశోక్ స్పృహ కోల్పోయి కిందపడిపోగానే చనిపోయాడని భావించి పారిపోయారు. అయితే, మరో హార్డ్‌వేర్ షాపు నిర్వాహకులు అచలరాం, గణేష్‌పై అనుమానం ఉందని అశోక్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ కేసును దర్యాప్తు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. దాడికి అసలు కారణం ఇదీ.. మొయినాబాద్‌లో మాతాజీ హార్డ్‌వేర్ షాపు నిర్వహిస్తున్న అశోక్‌కు బంధువులైన అచలరాం, గణేష్ సైతం పదేళ్ల క్రితం మొయినాబాద్‌కు వచ్చి హార్డ్‌వేర్ దుకాణం పెట్టారు. వీరి మధ్య వ్యాపార గొడవలు ఉన్నాయి. దీంతో అచలరాం, గణేష్ అశోక్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అందుకోసం మొయినాబాద్‌కు చెందిన రియాజ్, ముస్తాక్, ముజ్జు, ఇమ్రొజ్తో రూ.4 లక్షలకు డీల్ కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.1 లక్ష ఇచ్చారు. సమయం కోసం వేచి చూస్తున్న వీరు గతేడాది ఏప్రిల్ 1న రాత్రి దాడి చేశారు. 20 రోజుల క్రితం మొయినాబాద్‌లో గ్యార్మీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో యువకుల మధ్య గొడవ జరిగింది. గొడవలో మాటామాటా పెరిగి గతంలో ఒకరిపై దాడి చేస్తే ఏం జరిగిం ది. ఇప్పుడు దాడి చేస్తే ఏం జరుగుతుందని కొందరు యువకు లు దాడిచేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అశోక్‌ను చం పేందుకు డీల్ కుదుర్చుకున్నామని.. దాని ప్రకారమే రాడ్డుతో కొట్టామని నిందితులు అంగీకరించారు. దీంతో దాడికి కారణమైన అచలరాం, గణేష్‌తోపాటు నలుగురు నిందితులను పోలీసులు జనవరి 29న రిమాండ్‌కు తరలించారు. ఏసీపీని కలిసిన బాధితుడు.. బాధితుడు అశోక్ శనివారం రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్‌కుమార్‌ను కలిసి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనను చంపేందుకు కుట్ర పన్నారని, నిందితులు జైలు నుంచి వచ్చిన తర్వాత తనను ఏమైనా చేస్తారేమోనని భయాందోళన వ్యక్తంచేశాడు. భయపడాల్సిన అవసరం లేదని, ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండని ఏసీపీ ధైర్యం చెప్పారు. -
వ్యభిచార ముఠా అరెస్ట్
అత్తాపూర్: బాలికతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి హ్యాపీహోమ్స్ ప్రాంతానికి చెందిన నిషాఖాన్(45) గృహిణి. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. నెల రోజుల క్రితం నిషాఖాన్ సులేమాన్‌నగర్‌కు చెందిన తషీన్ ఫాతిమా(32), పహాడీఫరీష్‌కు చెందిన సదా(21)లను కలిసి ఓ అమ్మాయి కావాలని కోరింది. అందుకు గాను డబ్బులు ఇస్తానని చెప్పింది. ఎందుకని వారు ప్రశ్నించగా వ్యభిచారం కోసమని సమాధానమిచ్చింది. వచ్చిన దాంట్లో సగం వారికిస్తానని ఆశచూపింది. ఫాతిమా, సదాలు పహాడీషరీఫ్‌లో కుమార్తె(16)తో సహా నివాసం ఉంటున్న ఓ గృహిణి వద్దకు వెళ్లారు. తమకు తెలిసిన వారింట్లో పనిచేసేందుకు అమ్మాయి కావాలని ప్రతినెలా రూ.15 వేలు చెల్లిస్తారని చెప్పారు. వీరి మాటలు నమ్మిన గృహిణి తన కుమార్తె(16)ను వాళ్లతో పంపింది. వాళ్లిద్దరూ బాలికను తీసుకెళ్లి నిషాఖాన్‌కు రూ.5వేలకు అమ్మేశారు. నిషాఖాన్ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దించింది. నెలరోజులుగా ఉప్పర్‌పల్లి, చింతల్మెట్ లాల్‌దాబా, బండ్లగూడ ప్రాంతాల్లోని ఇళ్లలో ఉంచి వ్యభిచారం చేయిస్తోంది. మూడు రోజుల క్రితం ఉప్పర్‌పల్లి నుంచి తప్పించుకున్న బాలిక రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిషాఖాన్ ఇంటిపై దాడిచేసి నిషా, ఫాతిమా, సదాలతో పాటు ముగ్గురు విటులు మహ్మద్‌అలీ(21), మహ్మద్ మజీర్(20), మహ్మద్ షకీలుద్దీన్(24)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను రెస్క్యూ హోంలో చేర్చారు. నిషాఖాన్ గతంలో ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం కేసులో జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై నెల రోజుల నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్న అందరినీ కాల్‌లిస్ట్ ఆధారంగా అదుపులోకి తీసుకుంటామని ఏసీపీ చెప్పారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ వి.ఉమేందర్, ఎస్సైలు వెంకట్‌రెడ్డి, శివప్రసాద్, మల్లిఖార్జున్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి.. అదనుచూసి
దారిదోపిడీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్ ఏడు బైకులు, నగలు, నగదు స్వాధీనం అత్తాపూర్ : మారణాయుదాలతో వాహనదారులు, ఒంటరిగా వెళ్తున్న వారిని బెదిరిస్తూ దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కింది. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ ఏసీపీ గంగారెడ్డితో కలిసి రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసినా విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నెల క్రితం షాద్‌నగర్ నుంచి నగరానికి రాత్రి వేళ వస్తున్న వాహనాన్ని దుండగులు శంషాబాద్‌లో ఆపి డ్రైవర్‌ను చితకబాది అతడివద్ద నగదు, బంగారు గొలుసు, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. అనంతరం ప్రతి రోజూ స్టేషన్ పరిధిలో దారి దోపిడీలు జరుగుతున్నాయి. క్రైం పోలీసులు, నిఘా ఇన్ఫార్మర్ల సాయంతో దోపిడీలకు పాల్పడుతుంది పాత బస్తీ బహదూర్‌పురాకు చెందిన మహ్మద్ అహ్మద్ గ్యాంగ్‌గా నిర్ధారించారు. అహ్మద్‌పై నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం రాత్రి అతడి గ్యాంగ్ సభ్యులైనా రంగారెడ్డిజిల్లా వికారాబాద్‌కు చెందిన అఫ్రోజ్‌ఖాన్(22), నగరంలోని తాడ్‌బన్‌కు చెందిన మహ్మద్ సమీ(20), కాలపత్తర్‌కు చెందిన ఖాదిర్ ఖురేషి(19), అబ్దుల్ బాసిర్(19)ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఏడు బైకులు, పది గ్రాముల బంగారం, 13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన బైక్‌లపై.. చోరీ చేసిన రెండు బైక్‌లపై ఐదుగురు అహ్మద్ గ్యాంగ్ సభ్యులు నగర శివారు ప్రాంతాలైనా రాజేంద్రనగర్, నార్సింగ్, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నంలలో సంచరిస్తూ ఎయిర్‌గన్, తల్వార్లతో బెదిరించి దారి దోపీడీలకు పాల్పడ్డారు. చోరీ చేసిన డబ్బులతో జల్సాలు చేసేవారు. చిక్కారు ఇలా.. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ఉమేందర్, డిటెక్టివ్ ఇన్‌స్పెక ్టర్ ప్రకాష్ రెండు రోజుల క్రితం రాజేంద్రగనర్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అహ్మద్ గ్యాంగ్ సభ్యులు ఇద్దరు బైక్‌పై అనుమానంగా తిరుగుతూ కనిపించారు. వారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో విచారించగా వారు చేసిన దోపిడీలను ఒప్పుకున్నారు. అహ్మద్‌తో పాటు నలుగురిని పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. వీరిపై రౌడీషీట్‌తో పాటు, పీడీయాక్టు నమోదు చేస్తామని డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ పోలీసులు, క్రైం సిబ్బందికి రివార్డు అందజేస్తామని డీసీపీ తెలిపారు.