వెలుగు చూసిన సుపారీ కుట్ర | relatives gave money to four members to murder a hardware shop owner | Sakshi
Sakshi News home page

వెలుగు చూసిన సుపారీ కుట్ర

Published Mon, Feb 5 2018 6:34 PM | Last Updated on Mon, Feb 5 2018 6:34 PM

relatives gave money to four members to murder a hardware shop owner - Sakshi

బాధితుడికి ధైర్యం చెబుతున్న ఏసీపీ అశోక్‌కుమార్‌

మొయినాబాద్‌(చేవెళ్ల) : ఓ హార్డ్‌వేర్‌ షాపు నిర్వాహకుడిని హత్య చేసేందుకు మరో షాపు నిర్వాహకుడు కుట్ర పన్నాడు. అతన్ని హత్య చేస్తే డబ్బులు ఇస్తానని నలుగురు యువకులతో డీల్‌ కుదుర్చుకున్నాడు. డబ్బులకు ఆశపడి హత్య చేయడానికి సిద్ధమైన యువకులు ఇనుప రాడ్డుతో హార్డ్‌వేర్‌ షాప్‌ నిర్వాహకుడిపై దాడి చేశారు. తలపై గట్టిగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. అతడు చనిపోయాడని భావించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. మొయినాబాద్‌ మండల కేంద్రంలో తొమ్మిది నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. కానీ అప్పటి సీఐ కేసు పక్కన పెట్టారు. ఇటీవల మొయినాబాద్‌లో జరిగిన ఓ గొడవతో అప్పటి దాడి విషయం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు దాడికి కారణమైనవారితోపాటు దాడికి పాల్పడినవారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వివరాలు.. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన అశోక్‌(32) తన కుటుంబంతో పదేళ్ల క్రితం మొయినాబాద్‌కు వచ్చి హార్డ్‌వేర్‌షాపు నిర్వహిస్తున్నాడు. గతేడాది ఏప్రిల్‌ 1న రాత్రి షాపు మూసే సమయంలో బైకుపై ముఖాలకు ముసుగులతో ఇద్దరు దుండగులు వచ్చి అతడిపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. దీంతో అశోక్‌ స్పృహ కోల్పోయి కిందపడిపోగానే చనిపోయాడని భావించి పారిపోయారు. అయితే, మరో హార్డ్‌వేర్‌ షాపు నిర్వాహకులు అచలరాం, గణేష్‌పై అనుమానం ఉందని అశోక్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ కేసును దర్యాప్తు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు.

దాడికి అసలు కారణం ఇదీ..
మొయినాబాద్‌లో మాతాజీ హార్డ్‌వేర్‌ షాపు నిర్వహిస్తున్న అశోక్‌కు బంధువులైన అచలరాం, గణేష్‌ సైతం పదేళ్ల క్రితం మొయినాబాద్‌కు వచ్చి హార్డ్‌వేర్‌ దుకాణం పెట్టారు. వీరి మధ్య వ్యాపార గొడవలు ఉన్నాయి. దీంతో అచలరాం, గణేష్‌ అశోక్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అందుకోసం మొయినాబాద్‌కు చెందిన రియాజ్, ముస్తాక్, ముజ్జు, ఇమ్రొజ్‌తో రూ.4 లక్షలకు డీల్‌ కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.1 లక్ష ఇచ్చారు. సమయం కోసం వేచి చూస్తున్న వీరు గతేడాది ఏప్రిల్‌ 1న రాత్రి దాడి చేశారు. 20 రోజుల క్రితం మొయినాబాద్‌లో గ్యార్మీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో యువకుల మధ్య గొడవ జరిగింది. గొడవలో మాటామాటా పెరిగి గతంలో ఒకరిపై దాడి చేస్తే ఏం జరిగిం ది. ఇప్పుడు దాడి చేస్తే ఏం జరుగుతుందని కొందరు యువకు లు దాడిచేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అశోక్‌ను చం పేందుకు డీల్‌ కుదుర్చుకున్నామని.. దాని ప్రకారమే రాడ్డుతో కొట్టామని నిందితులు అంగీకరించారు. దీంతో దాడికి కారణమైన అచలరాం, గణేష్‌తోపాటు నలుగురు నిందితులను పోలీసులు జనవరి 29న రిమాండ్‌కు తరలించారు.

ఏసీపీని కలిసిన బాధితుడు..
బాధితుడు అశోక్‌ శనివారం రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌కుమార్‌ను కలిసి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనను చంపేందుకు కుట్ర పన్నారని, నిందితులు జైలు నుంచి వచ్చిన తర్వాత తనను ఏమైనా చేస్తారేమోనని భయాందోళన వ్యక్తంచేశాడు. భయపడాల్సిన అవసరం లేదని, ఇబ్బంది ఉంటే ఫోన్‌ చేయండని ఏసీపీ ధైర్యం చెప్పారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement