అర్ధరాత్రి.. అదనుచూసి
దారిదోపిడీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్
ఏడు బైకులు, నగలు, నగదు స్వాధీనం
అత్తాపూర్ : మారణాయుదాలతో వాహనదారులు, ఒంటరిగా వెళ్తున్న వారిని బెదిరిస్తూ దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కింది. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ ఏసీపీ గంగారెడ్డితో కలిసి రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసినా విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నెల క్రితం షాద్‌నగర్ నుంచి నగరానికి రాత్రి వేళ వస్తున్న వాహనాన్ని దుండగులు శంషాబాద్‌లో ఆపి డ్రైవర్‌ను చితకబాది అతడివద్ద నగదు, బంగారు గొలుసు, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. అనంతరం ప్రతి రోజూ స్టేషన్ పరిధిలో దారి దోపిడీలు జరుగుతున్నాయి. క్రైం పోలీసులు, నిఘా ఇన్‌ఫార్మర్ల సాయంతో దోపిడీలకు పాల్పడుతుంది పాత బస్తీ బహదూర్‌పురాకు చెందిన మహ్మద్ అహ్మద్ గ్యాంగ్‌గా నిర్ధారించారు. అహ్మద్‌పై నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం రాత్రి అతడి గ్యాంగ్ సభ్యులైనా రంగారెడ్డిజిల్లా వికారాబాద్‌కు చెందిన అఫ్రోజ్‌ఖాన్(22), నగరంలోని తాడ్‌బన్‌కు చెందిన మహ్మద్ సమీ(20), కాలపత్తర్‌కు చెందిన ఖాదిర్ ఖురేషి(19), అబ్దుల్ బాసిర్(19)ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఏడు బైకులు, పది గ్రాముల బంగారం, 13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
చోరీ చేసిన బైక్‌లపై..
చోరీ చేసిన రెండు బైక్‌లపై ఐదుగురు అహ్మద్ గ్యాంగ్ సభ్యులు నగర శివారు ప్రాంతాలైనా రాజేంద్రనగర్, నార్సింగ్, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నంలలో సంచరిస్తూ ఎయిర్‌గన్, తల్వార్‌లతో బెదిరించి దారి దోపీడీలకు పాల్పడ్డారు. చోరీ చేసిన డబ్బులతో జల్సాలు చేసేవారు.
చిక్కారు ఇలా..
రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ ఉమేందర్, డిటెక్టివ్ ఇన్‌స్పెక ్టర్ ప్రకాష్ రెండు రోజుల క్రితం రాజేంద్రగనర్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అహ్మద్ గ్యాంగ్ సభ్యులు ఇద్దరు బైక్‌పై అనుమానంగా తిరుగుతూ కనిపించారు. వారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో విచారించగా వారు చేసిన దోపిడీలను ఒప్పుకున్నారు. అహ్మద్‌తో పాటు నలుగురిని పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. వీరిపై రౌడీషీట్‌తో పాటు, పీడీయాక్టు నమోదు చేస్తామని డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ పోలీసులు, క్రైం సిబ్బందికి రివార్డు అందజేస్తామని డీసీపీ తెలిపారు.