వ్యభిచార ముఠా అరెస్ట్‌ | Police arrest prostitution gang in Attapur | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా అరెస్ట్‌

Published Sat, Oct 21 2017 4:43 AM | Last Updated on Sat, Oct 21 2017 4:43 AM

Police arrest prostitution gang in Attapur

అత్తాపూర్‌: బాలికతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగారెడ్డి శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లి హ్యాపీహోమ్స్‌ ప్రాంతానికి చెందిన నిషాఖాన్‌(45) గృహిణి. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. నెల రోజుల క్రితం నిషాఖాన్‌ సులేమాన్‌నగర్‌కు చెందిన తషీన్‌ ఫాతిమా(32), పహాడీఫరీష్‌కు చెందిన సదా(21)లను కలిసి ఓ అమ్మాయి కావాలని కోరింది. అందుకు గాను డబ్బులు ఇస్తానని చెప్పింది. ఎందుకని వారు ప్రశ్నించగా వ్యభిచారం కోసమని సమాధానమిచ్చింది.

వచ్చిన దాంట్లో సగం వారికిస్తానని ఆశచూపింది. ఫాతిమా, సదాలు పహాడీషరీఫ్‌లో కుమార్తె(16)తో సహా నివాసం ఉంటున్న ఓ గృహిణి వద్దకు వెళ్లారు. తమకు తెలిసిన వారింట్లో పనిచేసేందుకు అమ్మాయి కావాలని ప్రతినెలా రూ.15 వేలు చెల్లిస్తారని చెప్పారు. వీరి మాటలు నమ్మిన గృహిణి తన కుమార్తె(16)ను వాళ్లతో పంపింది. వాళ్లిద్దరూ బాలికను తీసుకెళ్లి నిషాఖాన్‌కు రూ.5వేలకు అమ్మేశారు. నిషాఖాన్‌ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దించింది. నెలరోజులుగా ఉప్పర్‌పల్లి, చింతల్‌మెట్‌ లాల్‌దాబా, బండ్లగూడ ప్రాంతాల్లోని ఇళ్లలో ఉంచి వ్యభిచారం చేయిస్తోంది. మూడు రోజుల క్రితం ఉప్పర్‌పల్లి నుంచి తప్పించుకున్న బాలిక రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు నిషాఖాన్‌ ఇంటిపై దాడిచేసి నిషా, ఫాతిమా, సదాలతో పాటు ముగ్గురు విటులు మహ్మద్‌అలీ(21), మహ్మద్‌ మజీర్‌(20), మహ్మద్‌ షకీలుద్దీన్‌(24)లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను రెస్క్యూ హోంలో చేర్చారు. నిషాఖాన్‌ గతంలో ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వ్యభిచారం కేసులో జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై నెల రోజుల నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్న అందరినీ కాల్‌లిస్ట్‌ ఆధారంగా అదుపులోకి తీసుకుంటామని ఏసీపీ చెప్పారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్‌ ఇన్స్‌పెక్టర్‌ వి.ఉమేందర్, ఎస్సైలు వెంకట్‌రెడ్డి, శివప్రసాద్, మల్లిఖార్జున్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement