Rajesh lakhoni
-
మోగిన ఉప నగారా
రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగింది. తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలతో పాటు పుదుచ్చేరిలోని నెల్లితోప్పు అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ నేతృత్వంలో అధికార వర్గాలు ఎన్నికల పనుల్ని వేగవంతం చేసే పనిలో పడ్డాయి. సాక్షి, చెన్నై: రాష్ర్ట అసెంబ్లీకి మే నెలలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా అధికార వర్గాలు కొరడా ఝుళిపించాయి. అయినా, తంజావూరు, కరూర్జిల్లా అరవకురిచ్చి నియోజకవర్గాల్లో నోట్ల కట్టలు తాండవం చేశాయి. పెద్ద ఎత్తున నగదు పట్టుబడడంతో చివరకు తంజావూరు, అరవకురిచ్చి ఎన్నికల్ని నిలుపుదల చేసి, మిగిలిన 232 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టింది. ఈ సమయంలో ప్రమాణ స్వీకారానికి ముందే తిరుప్పరగుండ్రం అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎస్ఎం.శీనివేల్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. ఈ మూడు నియోజకవర్గాలకు ఎన్నికల నిర్వహణకు తగ్గ చర్యల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ నిమగ్నమయ్యారు. అయితే, పలు కారణాల వల్ల జాప్యం తప్పలేదు. ఎట్టకేలకు రాష్ట్రం నుంచి ఎన్నికల నిర్వహణకు తగ్గ నివేదిక ఢిల్లీకి చేరింది. అలాగే, పుదుచ్చేరి సీఎంగా ఉన్న నారాయణస్వామి కోసం నెల్లితోప్పు ఎమ్మెల్యే జాన్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానం భర్తీతో పాటు తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పర గుండ్రంలలో ఉప ఎన్నికల నిర్వహణకు తగ్గ నగారా సోమవారం మోగింది. నవంబర్ 19న ఎన్నికలు: కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నగారా మోగించడంతో రాష్ట్రంలోని మూడు, పుదుచ్చేరిలోని నెల్లితోప్పునియోజకవర్గాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈనెల 26వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. చివరి తేదీ నవంబర్ రెండుగా నిర్ణయించారు. మూడో తేదీన పరిశీలన, ఐదో తేదీన ఉప సంహరణ ప్రక్రియ సాగనుంది. అదే రోజు తుది జాబితా ప్రకటించనున్నారు. ఇక, ఎన్నికలు నవంబర్ 19వ తేదీ జరుగుతుంది. ఫలితాలు 22వ తేదీ ప్రకటించనున్నారు. నగారా మోగడంతో ఎన్నికల నిర్వహణకు తగ్గ చర్యల వేగవంతంలో రాజేష్‌లఖానీ నేతృత్వంలో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి. అభ్యర్థులు మారేనా: అసెంబ్లీ ఎన్నికల సమయంలో తంజావూరు అభ్యర్థిగా బి.అంజుగం, అరవకురిచ్చి అభ్యర్థిగా కేసీ పళని స్వామిలను డీఎంకే ప్రకటించింది. అయితే, ఈ ఇద్దరు ఆ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న దృష్ట్యా, అభ్యర్థుల్లో మార్పు అన్నది డౌటే. ఇక అన్నాడీఎంకే విషయానికి వస్తే తంజావూరులో రంగస్వామి, అరవకురిచ్చిలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీలను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే, ఈ సారి ఈ ఇద్దరు అభ్యర్థులకు మళ్లీ చాన్స్ దక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. రంగస్వామికి అవకాశం దక్కినా ఆరోపణల్ని ఎదుర్కొంటున్న సెంథిల్ బాలాజీ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక, అమ్మ జయలలిత ఆసుపత్రిలో ఉన్న దృష్ట్యా, అభ్యర్థుల ఎంపిక భారాన్ని పార్టీ కోశాధికారి పన్నీరు సెల్వం భుజాన వేసుకుంటారా..? లేదా, వారినే కొనసాగిస్తారా..? అన్న ప్రశ్న బయలు దేరి ంది. ఇక, తిరుప్పరగుండ్రం స్థానాన్ని శీనివేల్ కుటుంబీకులు ఎవరికైనా అప్పగిస్తారా..? మరెవరైనా రేసులో ఉంటారా..? అన్నది వేచి చూడాల్సిందే. అయితే, శీనివేల్ చేతిలో ఓటమి చవిచూసిన డీఎంకే అభ్యర్థిగా ఎం. మణిమారన్‌కు తిరుప్పరగుండ్రంలో పోటీకి డీఎంకే మళ్లీ చాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే అభ్యర్థులు ఈ స్థానాల రేసులో నిలబడ్డారు. అయితే, ఉప సమరంలో మళ్లీ పోటీకి దిగేనా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. తొలిసారిగా: పుదుచ్చేరి సీఎంగా నారాాయణస్వామి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రాజ్యసభ పదవితో కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తూ వచ్చిన నారాయణస్వామికి ఈ సారి పుదుచ్చేరి సీఎం అయ్యే అవకాశం దక్కింది. అయితే, ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన తప్పనిసరిగా పోటీ చేయాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, నెల్లితోప్పు ఎమ్మెల్యే జాన్‌కుమార్ తన పదవిని త్యాగం చేశారు. ఖాళీగా ఉన్న నెల్లితోప్పు నుంచి ఎన్నికల్లో పోటీకి పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నెల్లితోప్పులో నామినేషన్ దాఖలు చేయడానికి నారాయణస్వామి నిర్ణయించారు. -
తప్పుదోవ పట్టిస్తే జైలే
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాజకీయ కుతంత్రంతో ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా జైలుశిక్ష తప్పదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ సాధించాలని ఎన్నికల కమిషన్ పట్టుదలతో ఉంది. శాంతియుత వాతావరణంలో పోలింగ్ సాగేందుకు అన్ని కోణాల్లో బందోబస్తు చేపట్టనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 240 బెటాలియన్ల పోలీసులను వినియోగించగా ఈ ఏడాది అదనంగా రప్పించనున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారి గురించి మొబైల్ ద్వారా సమాచారం ఇస్తే చాలు వారి పనిబడతామని ప్రకటించింది. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే కటకటాలపాలు కావడం ఖాయమని హెచ్చరించింది. వాహనాలకు పార్టీల జెండాలు ఉన్నట్లయితే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. నూరుశాతం లక్ష్యసాధన కోసం రాజేష్ లఖానీ అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఓటర్ల చేరిక, నకిలీ ఓటర్ల తొలగింపు, విద్యార్థుల్లో ఓటు హక్కుపై అవగాహన అంశాలపై చర్చించారు. జిల్లాల్లోని విద్యాసంస్థల్లో ఓటు హక్కుపై అవగాహనా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఓటర్లను ఉద్దేశించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ పోలింగ్‌కు రెండు రోజుల ముందుగా ఆటోల సహాయంతో మైకుల ద్వారా వీధి వీధినా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. అలాగే ట్వీట్టర్ ద్వారా ఎన్నికల అవగాహన ప్రచారం సాగించేందుకు ఎన్నికల కమిషన్ ఒప్పందం కుదుర్చుకుంది. బందోబస్తులకు ఎంత సిబ్బంది కావాలనే అంశంపై చర్చించారు. కొత్త ఓటర్ల చేరిక కోసం చెన్నైలోని మూడు ఈ సేవా కేంద్రాల్లో వసతి కల్పించారు. ఈ సేవాకేంద్రాల ద్వారా కొత్త ఓటర్ల దరఖాస్తులతోపాటు గుర్తింపు కార్డులు కూడా పొందవచ్చు. ఎన్నికల బహిష్కరణ హెచ్చరిక: దుబాయ్ చెరలో ఉన్న తమిళ జాలర్లను విడిపించకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని పది గ్రామాలు ప్రకటించాయి. చేపలవేట వృత్తి కోసం కన్యాకుమారి, తూత్తుకూడి, తిరునెల్వేలి జిల్లాకు చెందిన 23 మంది మత్స్యకారులు 2013లో దుబాయ్ వెళ్లారు. సముద్రంలో చేపలవేట సాగిస్తున్న తరుణంలో అరేబియా దేశానికి చెందిన కమీస్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఇందుకు తమిళ మత్స్యకారులను బాధ్యులను చేస్తూ వారందరి పాస్‌పోర్టులను దుబాయ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు పెట్టకుండా కేవలం సాక్షులుగా తమ వద్ద ఉంచుకున్నారు. ఆరోపణలు ఎదుర్కోవడంతో 23 మందికి దుబాయ్‌లో మరెక్కడా ఉపాధి లభించక పోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ 23 మందిని రక్షించాలని కోరుతూ కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్‌కు నాలుగుసార్లు వినతిపత్రం సమర్పించారు. తమవారిని రక్షించకుంటే ఎన్నికలను బహిష్కరించడమేగాక ఆందోళనకు పూనుకుంటామని పదిగ్రామాల ప్రజలు మంగళవారం హెచ్చరించారు. ఇప్పటివరకు రూ.7 కోట్లు స్వాధీనం: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మొత్తం రూ.7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కృష్ణగిరి జిల్లాలో మంగళవారం జరిపిన వాహన తనిఖీల్లో ఒకే కారు నుంచి రూ.30లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొమ్ముపై రెండు రోజుల్లోగా తగిన డ్యాక్యుమెంట్లు చూపితే నగదును వాపస్ చేస్తామని కమిషన్ పేర్కొంది. దిండివనం జిల్లా ఓమందూరు సమీపంలో ఒక చౌకతోపులో దాచిపెట్టిన హెల్మెట్లు, కుక్కర్లు అధికారులు కనుగొన్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు కొన్ని వస్తువులు దాచిఉన్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి యువరాజ్‌కు సమాచారం వచ్చింది. మరికొందరు అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టగా 189 హెల్మెట్లు, 29 కుక్కర్లు దొరికాయి. వరదల్లో త్రీవంగా నష్టపోయిన వారికి దక్షిణాఫ్రికా డర్బన్‌కు చెందిన ఒక స్వచ్ఛంధ సేవా సంస్థ సమీపంలోని మంగళవారం ఉచితాల పంపిణీ చేసింది. సమాచారం అందుకున్న ఎన్నికల సిబ్బంది వచ్చి పంపకాలను నిలిపివేసి ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా సాగుతున్న సహాయాలను ఎలా అడ్డుకుంటారని స్థానిక ప్రజలు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారులు, పోలీసులు తెలిపారు.