
మోగిన ఉప నగారా
రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగింది. తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలతో పాటు పుదుచ్చేరిలోని నెల్లితోప్పు అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ నేతృత్వంలో అధికార వర్గాలు ఎన్నికల పనుల్ని వేగవంతం చేసే పనిలో పడ్డాయి.
సాక్షి, చెన్నై: రాష్ర్ట అసెంబ్లీకి మే నెలలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా అధికార వర్గాలు కొరడా ఝుళిపించాయి. అయినా, తంజావూరు, కరూర్‌జిల్లా అరవకురిచ్చి నియోజకవర్గాల్లో నోట్ల కట్టలు తాండవం చేశాయి. పెద్ద ఎత్తున నగదు పట్టుబడడంతో చివరకు తంజావూరు, అరవకురిచ్చి ఎన్నికల్ని నిలుపుదల చేసి, మిగిలిన 232 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టింది. ఈ సమయంలో ప్రమాణ స్వీకారానికి ముందే తిరుప్పరగుండ్రం అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎస్‌ఎం.శీనివేల్ అనారోగ్యంతో మృతి చెందారు.
దీంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. ఈ మూడు నియోజకవర్గాలకు ఎన్నికల నిర్వహణకు తగ్గ చర్యల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ నిమగ్నమయ్యారు. అయితే, పలు కారణాల వల్ల జాప్యం తప్పలేదు. ఎట్టకేలకు రాష్ట్రం నుంచి ఎన్నికల నిర్వహణకు తగ్గ నివేదిక ఢిల్లీకి చేరింది. అలాగే, పుదుచ్చేరి సీఎంగా ఉన్న నారాయణస్వామి కోసం నెల్లితోప్పు ఎమ్మెల్యే జాన్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానం భర్తీతో పాటు తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పర గుండ్రంలలో ఉప ఎన్నికల నిర్వహణకు తగ్గ నగారా సోమవారం మోగింది.
నవంబర్ 19న ఎన్నికలు:
కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నగారా మోగించడంతో రాష్ట్రంలోని మూడు, పుదుచ్చేరిలోని నెల్లితోప్పునియోజకవర్గాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈనెల 26వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. చివరి తేదీ నవంబర్ రెండుగా నిర్ణయించారు. మూడో తేదీన పరిశీలన, ఐదో తేదీన ఉప సంహరణ ప్రక్రియ సాగనుంది. అదే రోజు తుది జాబితా ప్రకటించనున్నారు. ఇక, ఎన్నికలు నవంబర్ 19వ తేదీ జరుగుతుంది. ఫలితాలు 22వ తేదీ ప్రకటించనున్నారు. నగారా మోగడంతో ఎన్నికల నిర్వహణకు తగ్గ చర్యల వేగవంతంలో రాజేష్‌లఖానీ నేతృత్వంలో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి.
అభ్యర్థులు మారేనా: అసెంబ్లీ ఎన్నికల సమయంలో తంజావూరు అభ్యర్థిగా బి.అంజుగం, అరవకురిచ్చి అభ్యర్థిగా కేసీ పళని స్వామిలను డీఎంకే ప్రకటించింది. అయితే, ఈ ఇద్దరు ఆ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న దృష్ట్యా, అభ్యర్థుల్లో మార్పు అన్నది డౌటే. ఇక అన్నాడీఎంకే విషయానికి వస్తే తంజావూరులో రంగస్వామి, అరవకురిచ్చిలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీలను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే, ఈ సారి ఈ ఇద్దరు అభ్యర్థులకు మళ్లీ చాన్స్ దక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. రంగస్వామికి అవకాశం దక్కినా ఆరోపణల్ని ఎదుర్కొంటున్న సెంథిల్ బాలాజీ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
ఇక, అమ్మ జయలలిత ఆసుపత్రిలో ఉన్న దృష్ట్యా, అభ్యర్థుల ఎంపిక భారాన్ని పార్టీ కోశాధికారి పన్నీరు సెల్వం భుజాన వేసుకుంటారా..? లేదా, వారినే కొనసాగిస్తారా..? అన్న ప్రశ్న బయలు దేరి ంది. ఇక, తిరుప్పరగుండ్రం స్థానాన్ని శీనివేల్ కుటుంబీకులు ఎవరికైనా అప్పగిస్తారా..? మరెవరైనా రేసులో ఉంటారా..? అన్నది వేచి చూడాల్సిందే. అయితే, శీనివేల్ చేతిలో ఓటమి చవిచూసిన డీఎంకే అభ్యర్థిగా ఎం. మణిమారన్‌కు తిరుప్పరగుండ్రంలో పోటీకి డీఎంకే మళ్లీ చాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే అభ్యర్థులు ఈ స్థానాల రేసులో నిలబడ్డారు. అయితే, ఉప సమరంలో మళ్లీ పోటీకి దిగేనా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.
తొలిసారిగా: పుదుచ్చేరి సీఎంగా నారాాయణస్వామి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రాజ్యసభ పదవితో కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తూ వచ్చిన నారాయణస్వామికి ఈ సారి పుదుచ్చేరి సీఎం అయ్యే అవకాశం దక్కింది. అయితే, ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన తప్పనిసరిగా పోటీ చేయాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, నెల్లితోప్పు ఎమ్మెల్యే జాన్‌కుమార్ తన పదవిని త్యాగం చేశారు. ఖాళీగా ఉన్న నెల్లితోప్పు నుంచి ఎన్నికల్లో పోటీకి పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నెల్లితోప్పులో నామినేషన్ దాఖలు చేయడానికి నారాయణస్వామి నిర్ణయించారు.