తప్పుదోవ పట్టిస్తే జైలే | tamil nadu chief electoral Officer Rajesh lakhoni Warned | Sakshi
Sakshi News home page

తప్పుదోవ పట్టిస్తే జైలే

Published Wed, Mar 16 2016 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

tamil nadu chief electoral Officer Rajesh lakhoni  Warned

 చెన్నై, సాక్షి ప్రతినిధి: రాజకీయ కుతంత్రంతో ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా జైలుశిక్ష తప్పదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ సాధించాలని ఎన్నికల కమిషన్ పట్టుదలతో ఉంది. శాంతియుత వాతావరణంలో పోలింగ్ సాగేందుకు అన్ని కోణాల్లో బందోబస్తు చేపట్టనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 240 బెటాలియన్ల పోలీసులను వినియోగించగా ఈ ఏడాది అదనంగా రప్పించనున్నారు.
 
 ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారి గురించి మొబైల్ ద్వారా సమాచారం ఇస్తే చాలు వారి పనిబడతామని ప్రకటించింది. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే కటకటాలపాలు కావడం ఖాయమని హెచ్చరించింది. వాహనాలకు పార్టీల జెండాలు ఉన్నట్లయితే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. నూరుశాతం లక్ష్యసాధన కోసం రాజేష్ లఖానీ అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఓటర్ల చేరిక, నకిలీ ఓటర్ల తొలగింపు, విద్యార్థుల్లో ఓటు హక్కుపై అవగాహన అంశాలపై చర్చించారు. జిల్లాల్లోని విద్యాసంస్థల్లో ఓటు హక్కుపై అవగాహనా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
 
 అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఓటర్లను ఉద్దేశించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ పోలింగ్‌కు రెండు రోజుల ముందుగా ఆటోల సహాయంతో మైకుల ద్వారా వీధి వీధినా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. అలాగే ట్వీట్టర్ ద్వారా ఎన్నికల అవగాహన ప్రచారం సాగించేందుకు ఎన్నికల కమిషన్ ఒప్పందం కుదుర్చుకుంది. బందోబస్తులకు ఎంత సిబ్బంది కావాలనే అంశంపై చర్చించారు. కొత్త ఓటర్ల చేరిక కోసం చెన్నైలోని మూడు ఈ సేవా కేంద్రాల్లో వసతి కల్పించారు. ఈ సేవాకేంద్రాల ద్వారా కొత్త ఓటర్ల దరఖాస్తులతోపాటు గుర్తింపు కార్డులు కూడా పొందవచ్చు.   
 
 ఎన్నికల బహిష్కరణ హెచ్చరిక:
 దుబాయ్ చెరలో ఉన్న తమిళ జాలర్లను విడిపించకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని పది గ్రామాలు ప్రకటించాయి. చేపలవేట వృత్తి కోసం కన్యాకుమారి, తూత్తుకూడి, తిరునెల్వేలి జిల్లాకు చెందిన 23 మంది మత్స్యకారులు 2013లో దుబాయ్ వెళ్లారు. సముద్రంలో చేపలవేట సాగిస్తున్న తరుణంలో అరేబియా దేశానికి చెందిన కమీస్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఇందుకు తమిళ మత్స్యకారులను బాధ్యులను చేస్తూ వారందరి పాస్‌పోర్టులను దుబాయ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు పెట్టకుండా కేవలం సాక్షులుగా తమ వద్ద ఉంచుకున్నారు. ఆరోపణలు ఎదుర్కోవడంతో 23 మందికి దుబాయ్‌లో మరెక్కడా ఉపాధి లభించక పోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ 23 మందిని రక్షించాలని కోరుతూ కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్‌కు నాలుగుసార్లు వినతిపత్రం సమర్పించారు. తమవారిని రక్షించకుంటే ఎన్నికలను బహిష్కరించడమేగాక ఆందోళనకు పూనుకుంటామని పదిగ్రామాల ప్రజలు మంగళవారం హెచ్చరించారు.
 
 ఇప్పటివరకు రూ.7 కోట్లు స్వాధీనం:
 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మొత్తం రూ.7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కృష్ణగిరి జిల్లాలో మంగళవారం జరిపిన వాహన తనిఖీల్లో ఒకే కారు నుంచి రూ.30లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొమ్ముపై రెండు రోజుల్లోగా తగిన డ్యాక్యుమెంట్లు చూపితే నగదును వాపస్ చేస్తామని కమిషన్ పేర్కొంది. దిండివనం జిల్లా ఓమందూరు సమీపంలో ఒక చౌకతోపులో దాచిపెట్టిన హెల్మెట్లు, కుక్కర్లు అధికారులు కనుగొన్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు కొన్ని వస్తువులు దాచిఉన్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి యువరాజ్‌కు సమాచారం వచ్చింది.
 
 మరికొందరు అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టగా 189 హెల్మెట్లు, 29 కుక్కర్లు దొరికాయి.  వరదల్లో త్రీవంగా నష్టపోయిన వారికి  దక్షిణాఫ్రికా డర్బన్‌కు చెందిన ఒక స్వచ్ఛంధ సేవా సంస్థ సమీపంలోని మంగళవారం ఉచితాల పంపిణీ చేసింది. సమాచారం అందుకున్న ఎన్నికల సిబ్బంది వచ్చి పంపకాలను నిలిపివేసి ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా సాగుతున్న సహాయాలను ఎలా అడ్డుకుంటారని స్థానిక ప్రజలు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారులు, పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement