Rajgiri
-
బిహార్‌లో ఏం జరుగుతోంది? సీఎం నితీశ్‌పై విరుచుకుపడ్డ బీజేపీ ఎమ్మెల్యే
పట్నా: బిహార్ బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహరీ సీఎం నితీశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిలిం సీటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వంటి ప్రాజెక్టులు రాజ్‌గిరికే ఎందుకు తరలివెళ్తున్నాయని ప్రశ్నించారు. రాజ్గిరి సీఎం నితీశ్ కుమార్ సొంత జిల్లా నలందలో ఉండటం గమనార్హం. దీంతో వినయ్ బిహారీ సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. తాను కళలు, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్ర రాజధాని పట్నాలో నిర్మించాలనుకున్నట్లు వినయ్ చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టును రాజ్‌గిరికి తరలించారని ఆరోపించారు. అలాగే ఫిలిం సిటీని కూడా వాల్మీకి నగర్లో నిర్మించాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ దాన్ని కూడా రాజ్‌గిరికి మార్చారాని ఆరోపించారు. భోజ్‌పురి ఫిలిం మేకర్ అయిన వినయ్ బిహారీ.. తనకంటే ఎక్కువ నితీశ్ కుమార్‌కు ఏమీ తెలియదన్నారు. అక్కడైతే ఫిల్మ్ మేకింగ్‌కి అనువైన వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండవని పేర్కొన్నారు. అసలు ఈ రెండు ప్రాజెక్టులను రాజ్‌గిరికి ఎందుకు మార్చారో సీఎం, సంబంధిత మంత్రి, బీజేపీ డిప్యూటీ సీఎంలే చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఫిలిం సిటీ, క్రికెట్ స్టేడియం పనులు నత్తనడకన సాగుతున్నాయని సీఎంపై వినయ్ బిహారీ విమర్శలు గుప్పించారు. 2014లో మొదలైన ఈ ప్రాజెక్టులు సగం కూడా పూర్తి కాలేదన్నారు. బిహార్‌లో అధికార జేడీయూ, బీజేపీ మిత్రపక్షాలు. అలాంటిది సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే ఈ స్థాయిలో విరుచుకుపడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. చదవండి: బీజేపీ నేతలపై ఈడీ చర్యలు ఉంటాయా?.. చర్చనీయాంశంగా ఎన్సీపీ బ్యానర్! -
'గ్లాస్ ఫ్లోర్ బ్రిడ్జ్' పనులు పరిశీలించిన సీఎం నితీష్
పాట్నా: రాజ్‌గిర్‌లోని పర్యాటక హాట్‌స్పాట్ 'ప్రకృతి సఫారీ' పనులను బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 'గ్లాస్ ఫ్లోర్ బ్రిడ్జ్' (స్కై వాక్) పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సందర్శనలో భాగంగా జీప్ లైన్, జీప్ బైక్, ప్రకృతి సఫారీ ప్రధాన క్యాంప్ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. 'గ్లాస్ ఫ్లోర్ బ్రిడ్జ్' (స్కై వాక్) యొక్క నిర్మాణ, నిర్వహణ, రక్షణ విషయంలో నిపుణుల సహాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. (చదవండి: ఈ నెల 25న రైతులతో ప్రధాని మోదీ భేటీ) బిహార్‌లోని రాజ్‌గీర్‌లో 'ప్రకృతి సఫ్రీ' నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ప్రకృతి పార్కును సీఎం నితీష్ కుమార్ కలల ప్రాజెక్టుగా భావిస్తారు. రాజ్గీర్ ప్రజలకు గంగానది నుండి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా నలంద విశ్వవిద్యాలయం, రక్షణ, పోలీసు సిబ్బంది, గృహాలు,హోటల్స్... ఇలా ప్రతి ఒక్కరికి ఈ ప్రాజెక్ట్ ద్వారా నీరు అందించాలని సీఎం కోరారు. ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక ఎవరు కూడా తాగునీటి కోసం భూగర్భ జలాలను ఉపయోగించకూడదని పేర్కొన్నారు. భూగర్భ జలాలను తోడేయడం ద్వారా గొప్ప వారసత్వం(రాజ్గీర్) దెబ్బతిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ స్థలాలను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నితీస్ కుమార్ తెలిపారు. -
'నలంద' వేడుకల్లో సుష్మా స్వరాజ్
పాట్నా: ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వ విద్యాలయాల్లో ఒకటైన నలందా విశ్వవిద్యాలయం పున ప్రారంభ వేడుకల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావటం సంతోషంగా ఉందన్నారు. నలంద విశ్వవిద్యాలయం బీహార్‌లోని రాజ్‌గిర్ ప్రాంతంలో 455 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ప్రాంగణంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయంలో చరిత్ర, పర్యావరణ అధ్యయన విభాగాలలో మొత్తం 15 మంది విద్యార్థులతో పాటు ఆరుగురు అధ్యాపకులు ఉన్నారు. విద్యార్థులలో జపాన్, భూటాన్ దేశాలకు చెందిన ఒక్కో విద్యార్థి ఉన్నారు. కాగా 2020 నాటికి విశ్వవిద్యాలయం పూర్తిగా కొత్తరూపు సంతరించుకోనుంది. బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మంజీ, బీజేపీ నేత, మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సుశీల్ కుమార్ మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే నలందా విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభం అయ్యేందుకు కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. నితీశ్‌కు ఆహ్వానం పంపలేదని విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. -
800 ఏళ్ల తర్వాత మళ్లీ ....
బీహార్ షరీఫ్:- ప్రపంచంలోనే తొట్టతొలి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, పలుదేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంలో సోమవారం మళ్లీ తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు 800 సంవత్సరాల తర్వాత బీహార్‌లోని రాజ్‌గిరిలో పునరుద్ధరించిన విశ్వవిద్యాలయ నూతన ప్రాంగణంలో విద్యార్థుల చదువుల సందడి మొదలైంది. విశ్వవిద్యాలయంలో చరిత్ర, పర్యావరణ అధ్యయన విభాగాలలో మొత్తం 15 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో 9 మంది తొలిరోజున తరగతులకు హాజరయ్యారు. విద్యార్థులలో జపాన్, భూటాన్ దేశాలకు చెందిన ఒక్కో విద్యార్థి ఉన్నారు. విద్యార్థులకు, ఆరుగురు అధ్యాపకులకు, సిబ్బందికి వైస్ చాన్సలర్ గోపా సభర్వాల్ స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోపా సభర్వాల్ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కృషితో ప్రాచీన విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభమైందని, భవిష్యత్తులో ఇది బలోపేతంకాగలదని ఆశిస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయం మౌలిక సదుపాయాలు, అవసరాలపై సమీక్ష కోసం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ నెల 14న వర్సిటీని సందర్శిస్తారన్నారు. వివిధ కోర్సులకు 35దేశాల విద్యార్థుల నుంచి తమకు 1,400 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. సరైన ప్రచారంలేనందునే తక్కువ సంఖ్యలో విద్యార్థులు నమోదయ్యారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. **