పడకేసిన ఆరోగ్య పథకం
పింప్రి, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ గాంధీ జీవన్‌దాయి ఆరోగ్య పథకం పుణే జిల్లాలో పడకేసింది. ఈ పథకం గురించి నగర వాసుల్లో సరైన అవగాహన, ప్రచారం కల్పించకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పథకం గురించి తెలిసిన వైద్యులు కూడా సరైన సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యకార్డులను అందజేయడానికి పౌర సరఫరా విభాగం ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించింది. కానీ గ్రామ పంచాయతీలల్ల్లో ఆన్లైన్ సదుపాయం లేదు. కార్డుల పంపిణీ మరింత జటిలంగా మారింది. జిల్లాలోని అనేక గ్రామాలల్లో కార్డుల పంపిణీ జరగలేదు. కార్డులు లేని నిరుపేదలు ఈ పథకానికి నోచుకోవడం లేదు.
972 జబ్బులకు ఉచిత శస్త్రచికిత్సలు
పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలను కల్పించడానికి రాజీవ్ గాంధీ జీవన్‌దాయి ఆరోగ్య పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 972 రకాల జబ్బులకు శస్త్రచికిత్స, మందుల ద్వారా చికిత్సలతోపాటు 121 రకాల వైద్యపరమైన పరీక్షలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నేషనల్ ఇన్సూరెన్స కంపెనీ సహకారంతో నడుపుతోంది. రూ.1.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు వైద్య ఖర్చులల్లో 50 శాతం భరిస్తుంది. లక్ష రూపాయల ఆదాయం ఉన్న పేద కుటుంబాలకు 100 శాతం ఉచితంగా వైద్య ఖర్చులను అందిస్తుంది.
ఈ వివరాలను పేద ప్రజల చెంతకు తీసుకు పోయినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకం లక్ష్యం నెరవేరుతుంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ చికిత్సలను ఏఏ ఆస్పత్రులల్లో అందిస్తారో చాలా మందికి తెలియదు. ఉచితంగా అందించాల్సిన వైద్య సేవలు పేదలకు అందకుండా పోతున్నాయి. ఈ విషయమై ఎవరికి ఫిర్యాదుల చేయ్యాలో తెలియకపోవడంతో రోగులు డాక్టర్ల వద్ద మొరపెట్టుకొంటున్నారు. జిల్లా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని డాక్టర్లు సలాహా ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారే తప్ప సహకరించడం లేదు. అంతేకాకుండా ఈ పథకం కింద అంతేకాకుండా ప్రయోజనం జరగకపోగా, కొందరు అక్రమంగా సేవలు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా అధికారులూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పథకం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.