Rajiv Gandhis assassins
-
25 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరైన మురుగన్
వేలూరు(తమిళనాడు): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ 25 ఏళ్ల తర్వాత మొట్ట మొదటి సారిగా వేలూరు కోర్టులో హాజరయ్యాడు. రాజీవ్ హత్య కేసులో మురుగన్, అతని భార్య నళినితో పాటు పేరరివాలన్, శాంతన్ మొత్తం ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. జైలులో సెల్ఫోన్లు నిషేధం ఉన్న నేపథ్యంలో జైలు అధికారులు మురుగన్ గదిలో తనిఖీలు చేపట్టి రెండు సెల్ఫోన్లు, చార్జరు, రెండు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. మురుగన్ సెల్‌ఫోన్ ఉపయోగించినందున మూడు నెలలపాటు ఎవరినీ కలిసి మాటాడేందుకు అవకాశం ఇవ్వలేదు. జైలు గదిలో సెల్‌ఫోన్ ఉపయోగించిన కేసులో వేలూరు జెఎం వన్ కోర్టులో గురువారం విచారణకు వచ్చింది. మురుగన్ కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి మే నెల 4వ తేదికి వాయిదా వేశారు. అనంతరం పోలీసులు మురుగన్‌ను జైలుకు తీసుకెళ్ళారు. అయితే, ఆయనతో న్యాయవాది తప్ప ఎవరినీ కలిసి మాట్లాడేందుకు అనుమతించలేదు. మురుగన్ జైలులో స్వామిజీ తరహా మౌనవ్రతంలో ఉన్నట్లు పుకార్లు వచ్చిన విషయం విదితమే. వాటిని నిరూపించే విధంగా కోర్టులో హాజరయ్యే సమయంలో మురుగన్ గడ్డంతో షర్టు లేకుండా పచ్చ దుస్తులు మాత్రమే కప్పుకొని రావడంతో స్వామీజీ మాదిరి ఉన్నాడు. సాయిబాబా, మారియమ్మన్‌ల మొక్కుల కోసమే ఇలా మారినట్లు సమాచారం. -
నళినితో మాట్లాడేందుకు భర్త విముఖత
వేలూరు: స్థానిక మహిళా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నళినితో మాట్లాడేందుకు ఆమె భర్త మురుగన్ విముఖత వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళిని మహిళా జైలులోను, ఆమె భర్త మురుగన్‌లు పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఓసారి భార్యభర్తలిద్దరూ కలిసి మాట్లాడుకునేందుకు కోర్టు అవకాశం కల్పించింది. దీంట్లో భాగంగా గత నెల 20వ తేదీన నళిని, మురుగన్‌లు మాట్లాడుకున్నారు. ఇదిలాఉండగా శనివారం వీరిద్దరూ కలిసి మాట్లాడుకునేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ విషయాన్ని శనివారం ఉదయం జైలు అధికారులు మురుగన్‌కు తెలిపారు. అయితే ఇందుకు మురుగన్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. వేరే ఏ రోజైనా ఆమెతో మాట్లాడతానని మురుగన్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో మురుగన్ నళినితో కలిసేందుకు ఎందుకు నిరాకరించాడు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
'నా మనసులో మాట చెప్పడం ఇష్టంలేదు'
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల విడుదల కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖపై వ్యాఖ్యానించడానికి, రాజీవ్ కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాకరించారు. దీనిపై ఏం చేయాలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ అంశంపై తానేమీ చెప్పలేనన్నారు. దీనిపై గురువారం స్పందించిన రాహుల్ దీనిపై తన మనసులోని మాటను బయటపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాజీవ్ దోషులను విడుదల చేస్తే అంతకన్నా ఘోరం మరొకటి ఉండదని లోకసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే గురువారం పార్లమెంట్లో అన్నారు. ఇలాంటి చర్యల వల్ల దేశ ఐక్యతకే భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. తమిళనాడు రాసిన లేఖను కేంద్ర హోంశాఖ బయటపెట్టడం శోచనీయమన్నారు. కాగా తమిళనాడు రాసిన లేఖను పరిశీలిస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో తెలిపారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు నిందితులను విడుదల చేసే విషయంలో, కేంద్రం అనుమతి కావాలంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే.